29, జూన్ 2008, ఆదివారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---9





పారిశ్రామిక విప్లవం-నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు

ఐరోపా ప్రజలలో ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ ఫలితంగా ఏర్పడిన శాస్త్రీయ దృక్పథం కేవలం మతసంస్కరణకేకాక నూతన విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలకు కూడా దారితీసింది. 18వ శతాబ్దంలో మొదటగా జేమ్స్‌వాట్ అనే శాస్త్రవేత్త 1765వ సం||లో ఆవిరి యంత్రాన్ని కనుగొనటంతో ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలకు పునాది పడింది. మనిషి చేసే పనిని యంత్రం ద్వారా చేయించటంతో వస్తూత్పత్తి సామర్ధ్యం పెరిగింది. ఇది క్రమంగా మొదటగా ఇంగ్లండ్‌లో తదుపరి మిగతా యూరప్‌లో అనతికాలంలోనే అనేక పరిశ్రమలు ఏర్పడటానికి దోహదంచేసింది.

అప్పటివరకు కార్ఖానాలలో తయారయ్యే వస్తువులు పెద్ద పెద్ద పరిశ్రమలలో తయారవటం ప్రారంభమైనది. భారీ పరిశ్రమలకు కావలసిన యంత్రాల తయారీకి ఇనుము, ఉక్కు వంటి లోహాలు మరియు యంత్రాలను నడపటానికి అవసరమైన ఆవిరిశక్తి ఉత్పత్తి కోసం బొగ్గు కావలసి వచ్చాయి. ఫలితంగా ఈ లోహాల ఉత్పత్తి మరియు గనులనుండి బొగ్గు తవ్వితీయడం అధికమైనది. ముడి సరుకులను పరిశ్రమలకు మరియు ఉత్పత్తులను మార్కెట్లకు చేర్చవలసి రావడంతో రవాణారంగం కూడా తీవ్రంగా ప్రభావితమైనది. రైల్వేలు, స్టీమర్లు, ఓడలు నిర్మించబడ్డాయి. ఈ విధంగా ఒక పరిశ్రమ మరికొన్ని పరిశ్రమలు ఏర్పడటానికి మరలా ఆయా పరిశ్రమలన్నీ మరి ఎన్నో పరిశ్రమలు ఏర్పడటానికి కారణమయ్యాయి. ఇదంతా వెరసి ‘పారిశ్రామిక విప్లవం’గా పిలువబడింది.

పారిశ్రామిక విప్లవంలో భాగంగానే అనేక నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు జరిగాయి.వీటివలన ప్రజల జీవితం మరింత సుఖవంతమైనది. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కలిగాయి. ప్రజాజీవితాన్ని సుఖప్రదం చేయటంలో తోడ్పడ్డ ఆవిష్కరణలు విద్యుచ్ఛక్తి, టెలిగ్రాఫ్, టెలిఫోన్, నిస్తంత్రీ వార్తావిధానం, కుట్టుమిషన్, టైపు మిషన్, పెట్రోల్, రబ్బర్, రిఫ్రిజరేటర్ మొదలైనవి. విద్యుచ్ఛక్తి, పెట్రోల్ లను కనుగొన్న తరువాత యంత్రాలను నడపటానికి అవసరమయ్యే ఇంధనంకొరకు బొగ్గు స్థానంలో క్రమంగా ఈ రెంటి వాడకం ప్రారంభమైనది.

ఆనాడు ప్రారంభమైన ఈ నూతన వైజ్ఞానిక ఆవిష్కరణల పర్వం వలస పాలన ఏనాడో అంతమైనా కూడా నేటికీ కొనసాగుతూనే ఉన్నది. మానవ జీవితంలోకి అనేక నూతనమైన వస్తువులు మరియూ పరికరాలూ వచ్చిచేరుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ కనుగొన్న ప్రతివస్తువు కూడా అది కనుగొనబడిన సమయం దగ్గరనుండి మొదలుకొని నేటి వరకూ కాలానుగుణంగా సున్నితత్వాన్ని మరియు మరింత సామర్ధ్యాన్ని సంతరించుకుంటూనే ఉన్నది.

తెల్లవాడి బాధ్యత

ప్రపంచాన్ని ఆక్రమించుకొనుట కొరకు అప్పటికే ఐరోపాలో అనేక వర్తక సంఘాలు ఏర్పడ్డాయి. స్పానిష్, పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ జాతులకు చెందిన ఈ వర్తక సంఘాలు ప్రపంచం అంతా వ్యాపించి ఎవరికి దొరికిన ప్రాంతాన్ని వారు ఆక్రమించుకున్నారు. ఆక్రమణ, పాలన, వర్తకం, దోపిడీ, మతప్రచారం, ఆధునిక నాగరికతా వ్యాప్తి మరియు నూతన వైజ్ఞానిక విద్యా వ్యాప్తి అంతా పక్కపక్కనే జరిగేవి. ఇదంతా ‘ప్రపంచం యెడల తెల్లవాడి బాధ్యత’ గా యూరోపియన్‌లు భావించేవారు.ఇది కొంతవరకు నిజమే. ఐతే దోపిడీ అన్నది మిగిలిన అన్ని విషయాలకన్నా ప్రాధాన్యతను సంతరించుకోవడంతో ఆఖరికి అదే ప్రధాన సమస్యగా పరిణమించింది.

అగ్రరాజ్యంగా బ్రిటన్ ఆవిర్భావం

పారిశ్రామిక విప్లవానికి ముందు స్పెయిన్, పోర్చుగల్ దేశాలు బలమైన నౌకాశక్తిని కలిగి ఉండి అగ్రరాజ్యాలుగా చలామణీ అయ్యేవి. అప్పట్లో దోపిడీ పచ్చిగా, నగ్నంగా జరిగేది. నౌకాబలమే అప్పట్లో దేశాల ఔన్నత్యాన్ని నిర్దేశించేది.

కాలక్రమంలో ఇంగ్లాండులో మొదటగా తదుపరి మిగతా యూరప్‌లో పారిశ్రామిక విప్లవం సంభవించడంతో పారిశ్రామిక శక్తి దేశాల ఔన్నాత్యాన్ని నిర్దేశించటం ప్రారంభమైనది. దీనితో స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశాల స్థానంలో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్సు దేశాలు అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించాయి. ఈ దేశాల దోపిడీ స్పెయిన్, పోర్చుగల్ దేశాల దోపిడీకి భిన్నంగా ఉంటుంది. ఇవి తాము ఆక్రమించుకున్న దేశాలను తమదేశంలోని పరిశ్రమలకు ముడిసరుకు సరఫరాదారులుగా మరియు తమ దేశపు పరిశ్రమలలో తయారైన వస్తువులకు మార్కెట్లుగా ఉపయోగించుకునేవి. దీనితో ఆయాదేశాలలో అనాదిగా ఉన్న ఆర్థిక జీవనం తలక్రిందులైనది.

ఐరోపా పరిశ్రమలలో తయారైన వస్తువులతో వలస దేశాల మార్కెట్లను ముంచెత్తటంతో ఆయా దేశాలలోని కుటీర పరిశ్రమలన్నీ ఛిన్నాభిన్నమైపోయాయి. ఆ ఉత్పత్తులను కొనే నాథుడే లేడు. దీనివలన ముఖ్యంగా గ్రామీణ జీవనం నాశనమైనది. బ్రతుకుతెరువు కోల్పోయిన గ్రామీణులు పరిశ్రమలలో పనిచేసేటందుకు పట్టణాలకు వలస వచ్చారు.

ఈ వలసలతో పట్టణాలు పెద్ద పెద్ద నగరాలుగా మారాయి. నూతన 'కార్మికవర్గం' సమాజంలో ఆవిర్భవించింది.

గ్రామీణులు పట్టణాలకు వలస రావటం అనే పరిణామం ఐరోపా దేశాలలో కూడా జరిగినది. ఎందుకంటే పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఐరోపా పట్టణాలలో స్థాపించబడిన పరిశ్రమల మూలంగా ఆ దేశాలలోని గ్రామాలలో గల కుటీర పరిశ్రమలు కూడా దెబ్బతిన్నాయి.

మధ్యతరగతి ఆవిర్భావం-విప్లవ సన్నాహం

కార్మిక వర్గంతోపాటు మరో వర్గంకూడా సమాజంలో ఏర్పడింది. అదే 'మధ్య తరగతి వర్గం'. కార్మిక వర్గం పారిశ్రామిక విప్లవం తదనంతరం తలయెత్తితే మధ్యతరగతి వర్గం మాత్రం అంతకన్నా ముందే వలసల స్థాపనతోటే సమాజంలో జనించి పారిశ్రామిక విప్లవంతో మరింతగా పెరిగి బలపడింది.

అప్పటి వరకు ప్రజలు రెండే వర్గాలుగా ఉండే వారు. ధనిక ప్రభువర్గం మరియు పేద ప్రజలు. ఫ్రజలంతా దాదాపూ పేదలే(వ్యాపార వర్గం ఉపేక్షించదగిన స్వల్ప పరిమాణంలో మాత్రమే ఉండేది. వారికెటువంటి ప్రాబల్యం ఉండేది కాదు). ప్రభువర్గం మాత్రమే ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అనుభవించేది. కానీ వలసల స్థాపనతో మరియు ఆ తరువాత పారిశ్రామిక విప్లవంతో వ్యాపార, వాణిజ్యాలు పెరగటంతో ప్రభువర్గం, పేదప్రజలకు మధ్యన వ్యాపారం మరియు పరిశ్రమలద్వారా ధనం ఆర్జించిన మరో వర్గం సమాజంలో ఏర్పడింది. అదే మధ్య తరగతి వర్గం లేక బూర్జువా వర్గం. ఈ మధ్య తరగతి వర్గం కాలక్రమంలో విశ్వరూపం దాల్చింది. అనేక స్థాయీ భేదాలతో ఈ వర్గపు ప్రజలు పెంపొందారు. దీనికి తోడు ఆధునిక వైద్య సౌకర్యాలతో ప్రజల ఆయుఃప్రమాణం పెరిగి విస్పోటనం సంభవించినట్లుగా జనాభా పెరిగింది.

ఈ మధ్య తరగతి ఏర్పడినప్పటినుండి మానవుడు అదృష్టవంతుడయ్యాడు. ప్రభువర్గంలో జన్మించని పక్షంలో పేదవాడిగా అణగారి జీవించాల్చిన పరిస్థితి దీనితో అంతరించింది. సాధారణమైన పౌరుడు జీవితంలో ఏ కొద్ది వృద్ధి అయినా సాధించగలిగే అవకాశాలు సమాజంలో ఏర్పడ్డాయి. అలా అభివృద్ధి సాధించిన వారే మధ్యతరగతివారు. వీరు అటు ఫ్యూడల్ ప్రభువులు కారు.ఇటు నిరుపేదలు కారు. అందుకే వీరిని మధ్య తరగతి అన్నారు. వీరిలో కోటీశ్వరులూ ఉన్నారు; చిన్న చిన్న వ్యాపారస్థులు మరియు వివిధ స్థాయి ఉద్యోగులూ ఉన్నారు. ఐతే వీరిలో ధనిక బూర్జువా వర్గం మత్రమే విప్లవాత్మకం అయిన క్రియాశీలతను కలిగిఉన్నది.

మొదట ఈ విప్లవ బూర్జువావర్గానికి చెందినవారు ఫ్యూడల్ ప్రభువుల కనుసన్నలలో మెలగుతూ వారికి విధేయులై వారి ఆజ్ఞలకు, శాసనాలకు లోబడి పెంపొందారు. వీరు ఎంతగా వృద్ధి చెందారంటే వీరి భావి వికాసం ఇక ఫ్యూడల్ వ్యవస్థ పరిధిలో ఎంత మాత్రం జరగదు. ఫ్యూడల్ వ్యవస్థ వీరికి ఆటంకంగా పరిణమించింది. దీనితో ఈ బూర్జువా వర్గం తమకనుగుణమైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం దానంతటదే జరిగిపోయింది. ప్రపంచ మానవాళి జీవనంలో ఇస్లాం తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రపంచ రాజకీయ కేంద్రం ఇస్లామిక్ ఆసియా నుండి పెట్టుబడిదారీ ఐరోపాకు మారింది.

ఈ మధ్యతరగతి వర్గం వ్యవస్థలోని మూడు అంగాలలో ‘సమాజం’ అనే అంగానికి ప్రాతినిథ్యం వహించింది. సమాజ వికాసం వీరివలనే సాధ్య పడింది. వీరు మితిమీరిన రాజ్య శక్తినుండి మానవాళిని కాపాడారు. ప్రమాదంలో పడిన సమాజాన్ని రక్షించారు. వ్యవస్థలోని సమాజం అనే అంగం యొక్క ప్రయోజనాలను వీరు కాపాడారు. వీరి వలన సమాజం బహుముఖాలుగా విస్తరిల్లింది. దానిలోని ఉత్పత్తి వనరులు మరియు మౌలిక సదుపాయాలు వృద్ధిచెందాయి.ఖండాంతర వ్యాపారం వృద్ధి చెందింది.నిరంతర యుద్ధాల బారినుండి ప్రజలను వీరు రక్షించారు.సమాజంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో మూఢ విశ్వాసాల స్థానంలో శాస్త్రీయ దృక్పథం నెలకొన్నది. తద్వారా విజ్ఞాన శాస్త్రావిష్కరణ జరిగినది. ఆ విజ్ఞాన శాస్త్ర ఫలాలను, అది అందించే సౌకర్యాలను మానవాళి అందుకున్నది. సమాజంలో అభ్యుదయకారకమైన నూతన నాగరికత, నూతన జీవన విధానం వెల్లివిరిసాయి.

ఇంతకు ముందే చెప్పినట్లుగా మొదట ఈ మధ్యతరగతి వర్గం నిరంకుశ ఫ్యూడల్ ప్రభువుల శాసనాలకు లోబడే వృద్ధిచెందింది. కాలక్రమంలో రాజ్యపు చట్రంనుండి తాము బయటపడి ప్రజలను కూడా రక్షించాలని వీరు కాంక్షించారు. ఈ క్రమంలో ఫ్రాన్సు దేశంలో సంభవించిన విప్లవం ప్రపంచంలో సమాజం యొక్క ప్రయోజనాలను కాపాడే వ్యవస్థ అయిన పెట్టుబడిదారీ వ్యవస్థకు మరియు దాని రాజకీయ రూపమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంనకు ప్రాతిపదికగా నిలచింది.అదే ‘ఫ్రెంచ్ విప్లవం’ గా చరిత్రలో పిలువబడింది.

ఈ విధంగా ఏర్పడిన పెట్టుబడిదారీ వ్యవస్థ మానవాళి జీవన విధానాన్ని,వారి జీవన దృక్పథాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. ఐతే కాలక్రమంలో ఈ వ్యవస్థకు దీని యొక్క దోపిడీ స్వభావంవలన సామ్యవాదరూపంలో ఎంతో వ్యతిరేకత ఏర్పడినది. ఆ పరిణామాలను ఇప్పుడు చూద్దాం.....(సశేషం)


3 కామెంట్‌లు:

  1. ఉపయుక్త గ్రంథాలు ఇస్తే చదువరులకు బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. ఒరెమూనా గారూ!

    ఇది ప్రధానంగా చరిత్ర రచన కాదు. ప్రపంచ చరిత్ర అందరికీ తెలిసిన విషయమే అని భావిస్తూ...ఆ చారిత్రక క్రమంలో అంతర్లీనంగా ఉన్న తత్త్వాన్ని గురించి చెప్పటమే ఈ రచన ప్రధాన ఉద్దేశం.

    ఒకానొక నూతన రాజనీతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి, ఒకానొక తత్త్వాన్ని ప్రపంచ చరిత్రకు apply చేయటానికి ఈ రచన ప్రయత్నిస్తున్నది. అందుకే రిఫరెన్స్ గురించి నేను పేర్కొనలేదు.

    ఇస్లాం గురించి వివరించేటపుడు చరిత్ర గురించి తక్కువగా ప్రస్తావించి సిద్ధాంత చర్చ ఎక్కువగా చేశాను.కానీ కాపిటలిజం విషయంలో చరిత్రను avoid చేయటం సాధ్యపడలేదు. కాపిటలిజం చాలా సంక్లిష్టమైనది. అందువలన చరిత్ర వివరించకుండా కాపిటలిజాన్ని వివరించటం కష్టం.

    మీ సూచన చూచిన తరువాత ఉపయుక్త గ్రంథాలను సూచించాలని నిర్ణయించుకున్నాను.ప్రపంచ చరిత్ర గురించి చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నా నావరకూ నేను చదివిన పుస్తకాలను పేర్కొంటున్నాను.

    జవహర్ లాల్ నెహ్రూ రాసిన 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ'. ఈ గ్రంథాన్ని నేను నా మరో బ్లాగు 'వేణుగానం 'లో పరిచయం చేసాను కూడా. తెలుగు అకాడెమీ వారి ఇంటర్,డిగ్రీ,P.G. టెక్స్ట్ బుక్స్.

    ఇవి గాక ఇస్లాం గురించి ప్రత్యేకంగా కొన్ని తెలుగు-ఇస్లామిక్ ప్రచురణలు చదివాను. కాపిటలిజం గురించి,కమ్యూనిజం గురించి సామ్యవాద సాహిత్యం ఉండనే ఉన్నది.ఇవి గాక అన్ని విషయాలూ ఉండే ఎన్‌సైక్లోపీడియాలు ఉన్నాయి.

    తెలుగులో ఆధునిక ప్రపంచ చరిత్ర గురించి ఓరియంట్ లాంగ్మన్ వారి ప్రచురణ కూడా ఉన్నది.

    ప్రతి ప్రచురణ సంస్థకూ స్వంత విక్రయశాలలున్నా ఈ పుస్తకాలలో దాదాపుగా అన్నీ 'విశాలాంధ్రా బుక్ స్టాల్ ' లో దొరుకుతాయి.

    రిప్లయితొలగించండి