3, జులై 2008, గురువారం

భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!---11





సామ్యవాద సిద్ధాంతం


సొంత ఆస్తి-కుటుంబం-రాజ్యం

మార్క్స్ తన గ్రంథాలలో ప్రవచించిన కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం మొదట్లో ప్రజలు ‘కమ్యూన్’ అనే సామాజిక వ్యవస్థలో జీవించేవారు. ఈ వ్యవస్థలో ఉన్నపుడు మానవునికి సొంత ఆస్తి, కుటుంబం, రాజ్యం ఇవేవీ ఉండేవి కావు. ప్రజలంతా ఎవరిపని వారు చేసుకొని దొరికిన ఆహారంతో బ్రతికేవారు. ఉత్పత్తి వనరులను ఎవరూ తమ వ్యక్తిగత ఆస్తులుగా ఉంచుకునేవారు కారు. ఎవరూ ఎవరిమీద దాడి చేసేవారు కాదు. వర్గాలు ఉండేవి కావు. కనుక వర్గ పోరాటం ఉండేది కాదు. దానితో పాలక(పీడక)వర్గం, పాలిత(పీడిత)వర్గాన్ని అణచటానికి ఉపయోగించే ‘రాజ్యం’ యొక్క అవసరం ఉందేది కాదు (సామ్యవాదం రాజ్యాన్ని ఇలానే అభివర్ణించింది). ఏ స్త్రీ ఏ ఒక్కరికీ స్వంతంకాదు. ఎవరు ఎవరితోనైనా సంతానం కనవచ్చు. కనుక కుటుంబాలు ఉండేవికావు. ఇటువంటి వ్యవస్థలో పీడన, దోపిడి ఉండేవికావు. ప్రజలంతా దేనికీ లోటు లేకుండా హాయిగా జీవించేవారు.

కానీ కాలక్రమంలో వ్యక్తి స్వార్థంతో స్వంత ఆస్తి కూడబెట్టడం ప్రారంభించాడు. దానితో సమాజంలో ప్రాబల్యం కలిగిన వ్యక్తులు మిగతా వారిని అణచి సమాజంలోని ఉత్పత్తి వనరులను తమ ఆస్తిగా ఉంచుకునేవారు. ఇలా ‘సొంత ఆస్తి’ ఏర్పడింది. అలా అణచటానికి సాధనంగా ‘రాజ్యం’ ఏర్పడింది. ఇలా కూడబెట్టిన ఆస్తిని తనదైన సంతానానికి వారసత్వ సంపదగా ఈయటానికి తనకు మాత్రమే సంతానాన్ని కనటానికి తనకు మాత్రమే స్త్రీ పరిమితమయ్యేటట్లుగా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా సమాజంలో ‘సొంత ఆస్తి’, ‘కుటుంబం’, ‘రాజ్యం’ అనబడే వ్యవస్థలు ఏర్పడ్డాయి. మరో సమూహం దాడినుండి తన సమూహాన్ని రక్షించుకొనటానికి కూడా ‘రాజ్యం’ అనే ఆయుధం ఉపయోగపడింది.


వర్గ పోరాటం

సొంత ఆస్తి, కుటుంబం, రాజ్యం ఏర్పడటంతో సమాజంలో ఆర్థికంగా కొందరు బలవంతులుగా మరికొందరు బలహీనులుగా ఉన్న పరిస్థితి తలయెత్తి సమాజం రెండు వర్గాలుగా (Classes) విడిపోయింది. బలవంతులు తమ ప్రాబల్యం కోసం బలహీనులను రాజ్యం అనే సాధనంతో అణచి ఉంచటానికి ప్రయత్నించటంతో ఈ రెండు వర్గాల మధ్యన అనివార్యమైన సంఘర్షణ తలయెత్తి వర్గపోరాటం (Class Struggle) ప్రారంభమైనది.

ఈ వర్గపోరాటం వలన సమాజం అనేక మార్పులకు లోనై, అనేక పరిణామ దశలను దాటి నేటి రూపంలోకి వచ్చింది. ఇప్పుడు బూర్జువా వర్గానికి, కార్మిక వర్గానికి పోరాటం జరుగుతున్నది. ఈ వర్గపోరాటంలో కార్మిక వర్గం అంతిమంగా విజయం సాధించి సమాజంలో కార్మిక వర్గ నియంతృత్వాన్ని స్థాపించి స్వంత ఆస్తిని రద్దు (ఆస్తిహర్తల ఆస్తిహరణం) చేస్తుంది. తద్వారా సమాజంలో వర్గాలను నిర్మూలిస్తుంది. దానితో పాలిత వర్గాన్ని అణచటానికి తప్ప మరిదేనికీ పనికిరాని రాజ్యం నిరుపయోగమై డుల్లిపోతుంది (Withering Out of the State). దానితో అది కూడా రద్దౌతుంది. ఈ విధంగా ‘ఆధునిక కమ్యూన్ వ్యవస్థ’ ఏర్పడుతుంది. ఈ వ్యవస్థలో ఆదిమ కమ్యూన్ వ్యవస్థలో వలెనే ఎవరికీ ఆస్తులుండవు. వర్గాలు ఉండవు.రాజ్యం ఉండదు. అంతా సమానంగా ఉంటారు. ఎవరూ ఎవరినీ పీడించరు. అందరికీ వారి అవసరాలు సమృద్ధిగా తీరతాయి. కమ్యూన్ వ్యవస్థను ఆదర్శంగా భావించినది కనుక ఈ సిద్ధాంతానికి ‘కమ్యూనిజం’ అనే పేరు ఏర్పడింది.

గతితార్కిక భౌతికవాదం-చారిత్రక భౌతిక వాదం

ఆదిమ కమ్యూన్ వ్యవస్థ నుండి ఆధునిక కమ్యూన్ వ్యవస్థకు జరిగే ఈ మొత్తం పరిణామాన్ని గతితార్కిక తాత్త్విక విధానంలో కార్ల్‌మార్క్స్ వివరించాడు. ‘కాలగతిలో సమాజంలో మార్పు జరుగుతూ ఉత్పత్తి సాధనాలు మారినపుడు అది ఉత్పత్తి సంబంధాలలో మార్పునకు దారితీస్తుంది. ఆ మార్పు కొత్త ఉత్పత్తి సంబంధాలకు అనుగుణమైన వ్యవస్థ సమాజంలో ఏర్పడటానికి దారితీస్తుంది’ అని నిర్ధారించిన మార్క్స్ దానిని ఈ క్రింది విధంగా విశదీకరించాడు.

సొంత ఆస్థి, కుటుంబం, రాజ్యం ఏర్పడటంతో ఆదిమ కమ్యూన్ వ్యవస్థలో వర్గాలు ఏర్పడి మొదటగా బానిస వ్యవస్థ ఏర్పడింది. అంటే పాలక వర్గం చేతిలో ఆస్తి ఉండేది. అపుడు ఆస్తి అంటే ప్రధానంగా భూమి. సేద్య బానిసలు పనిచేసి ఉత్పత్తి చేసేవారు. ఈ బానిసలకు కూలి రూపంలోగానీ మరేరూపంలోగానీ డబ్బు చెల్లించబడేది కాదు. కేవలం బ్రతకడానికింత తిండి పడేసేవారు. రెండవది ఈ బానిసలకు పని చేయటం అనివార్యం. స్వేచ్ఛ ఉండేది కాదు. తప్పనిసరిగా తమ యజమాని వ్యవసాయ క్షేత్రంలో బ్రతుకంతా పనిచేసి తీరవలసినదే. ఈ వ్యవస్థలో వర్గాలు ‘సేద్యబానిస’ మరియు ‘బానిస యజమాని’. బానిస తిరుగుబాట్ల వలన ఈ వ్యవస్థ అంతరించింది. ఈ వ్యవస్థ యొక్క అవశేషాలు వెట్టిచాకిరీ రూపంలో నేటి సమాజంలో కూడా కనిపిస్తుంటాయి.

తరువాత కాలక్రమంలో ఫ్యూడల్ (భూస్వామ్య) వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థ బానిస వ్యవస్థ కన్నా కొంత పురోగామి స్వభావం కలిగినది. ఈ కాలంలో పీడిత వర్గ ప్రజలు వ్యవసాయం చేసేవారు కానీ వారు బానిసలు కారు; స్వతంత్రులే. అయితే సెంటు భూమికూడా లేని పేదవారు. అందువలన భూస్వామి వద్ద భూమి కౌలుకు తీసుకొని, చాకిరీ చేసి పండించి, కౌలుకింద ఆ పంటలో చాలా భాగం ఆ భూస్వామికే ఇచ్చేవారు.

ఈ విధంగా సమాజంలో ‘బానిస వ్యవస్థ’ నుండి ‘ఫ్యూడల్ వ్యవస్థ’ వరకూ పరిణామం జరిగింది. అప్పుడు ఫ్యూడల్ ప్రభువులే రాజులు. కానీ ఆ ఫ్యూడల్ సమాజంలో కాలక్రమంలో వచ్చిన మార్పుల వలన నూతన ఉత్పత్తి వనరులు ఏర్పడ్డాయి. అవే పరిశ్రమలు. ఫ్యూడల్ వ్యవస్థలో వస్తువులు కార్ఖానాలలో తయారవుతుండేవి. ఆ కార్ఖానాలు ఏమంత పెద్ద ఆస్తులుగా భావించబడేవి కావు. అపుడు ప్రధాన ఆస్తి భూమి మాత్రమే. కానీ ‘పారిశ్రామిక విప్లవం’ వచ్చిన తరువాత వస్తూత్పత్తి పెద్ద పెద్ద పరిశ్రమలలో జరగటం, వాటి వ్యాపారం ఖండాంతరంగా జరగటంతో అవి భూములను మించిన ఉత్పత్తి సాధనాలుగా పరిణమించాయి. అంటే సమాజంలో ఉత్పత్తిసాధనాలలో మార్పు వచ్చింది. మొదట్లో ఈ మార్పు ఫ్యూడల్ వ్యవస్థ పరిధిలో వృద్ధిచెందింది. ఫ్యూడల్ వ్యవస్థకు ఆధారభూతమైన ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాలు వేరు. ఈ ఆధునిక పరిశ్రమలతో కూడుకున్న ఉత్పత్తి సంబంధాలు వేరు. ఆ వర్గాలు వేరు, ఈ వర్గాలు వేరు. ఫ్యూడల్ వ్యవస్థలో వర్గాలు ‘భూస్వామి’ మరియు ‘పేదరైతు’. పారిశ్రామిక వ్యవస్థలో వర్గాలు ‘బూర్జువా పారిశ్రామిక యజమాని’ (పెట్టుబడిదారుడు) మరియు ‘కార్మికుడు’.

మొదట్లో ఫ్యూడల్ వ్యవస్థ పరిధిలో వృద్ధి పొందిన ఈ నూతన ఉత్పత్తి సంబంధాలకు ఆ వ్యవస్థ కాలక్రమంలో ఆటంకంగా పరిణమించింది. కనుక ఈ భూస్వామ్య వ్యవస్థను కూలదోసి తమ ఉత్పత్తి సంబంధాలకు అనుగుణమైన నూతన వ్యవస్థను ఏర్పరచటానికి బూర్జువా శక్తులు ప్రయత్నించి విజయాన్ని పొందాయి. అలా ఏర్పడిందే ‘పెట్టుబడిదారీ వ్యవస్థ’. దానికి అనుగుణంగా రాజకీయంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ కన్నా పురోగామిశీలి. ఈ విధంగా సమాజం మరికొంత వృద్ధి చెందింది.

కార్మిక వర్గ నియంతృత్వం

పరిశ్రమలు విస్తరించటం వలన తిరిగి ఇప్పుడు కార్మిక వర్గం సంఖ్యాపరంగా అభివృద్ధి చెంది వారిలో చైతన్యం, ఐకమత్యం, రాజకీయ అవగాహన పెంపొందటం వలన కాలక్రమంలో ఈ కార్మిక వర్గం విప్లవాత్మకమైన క్రియాశీలతను సంతరించుకుంటుంది. కార్మిక వర్గం యొక్క శ్రమను దోపిడీ చేస్తున్న ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ క్రమంగా ఆ వర్గం యొక్క మనుగడకు ఆటంకంగా పరిణమిస్తుంది. అప్పుడు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ కూల్చివేయబడి దోపిడీలేని వర్గరహితమైన నూతన వ్యవస్థ ఏర్పడుతుంది. కార్మిక వర్గం ఈ విప్లవానికి ఆధారభూతమై ముందుండి నడిపిస్తుంది. వర్గరహిత సమాజం ఏర్పడటానికి ముందు ‘కార్మిక వర్గ నియంతృత్వం’ స్థాపించబడి, సొంత ఆస్తి రద్దు చేయబడుతుంది.

ఈ విధంగా కార్ల్‌మార్క్స్ గతితార్కిక తత్త్వశాస్త్రం ప్రకారం ‘శాస్త్రీయ కమ్యూనిజం’ను వివరించాడు.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి

ఈ మొత్తం పోరాటంలో కార్మికులకు ప్రధానమైన బలం ఐకమత్యం, ఏకాభిప్రాయం, సంఘటితమవడం. వారి ప్రధాన ఆయుధం ‘సమ్మె’. మొదట కార్మికులు అసంఘటితంగా ఉన్నపుడు వారు బూర్జువా పారిశ్రామిక యజమానుల దోపిడీ భరించలేక యంత్రాలను విరగగొట్టడం, తగులబెట్టడం లాంటి నిస్సహాయ చర్యలకు పాల్పడేవారు. కానీ కాలక్రమంలో తమలాంటి వారే అంతటా ఉన్నారని గ్రహించి అంతా ఒక తాటి మీదకు వచ్చి సంఘటిత పోరాటం చేయటంద్వారా ప్రయోజనం ఉంటుందని గ్రహించి అలా ఒక్కటిగా సంఘటితమౌతారు. అలా ఏర్పడినదే ‘కార్మికోద్యమం’ లేక ‘ట్రేడ్‌యూనియన్ ఉద్యమం’. ఈ ట్రేడ్‌యూనియన్లు తమ హక్కుల కొరకు పోరాడతాయి. ఒక ఫాక్టరీలోని యూనియన్‌లో ఆ ఫాక్టరీలోని కార్మికులంతా సభ్యులుగా ఉంటారు. తుదకు ఈ ట్రేడ్‌యూనియన్లన్నీ ఏకమై మొత్తం కార్మికవర్గమంతా ఒక్కటై పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చివేస్తుంది. ఈ లక్ష్య సాధన కొరకే కమ్యూనిష్టు ఉద్యమం సుప్రసిద్ధమైన ఈ క్రింది నినాదాన్నిచ్చింది.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి. పోరాడితే పోయేదేమీలేదు మీ సంకెళ్ళు తప్ప’ ......(సశేషం)


2 కామెంట్‌లు: