12, జులై 2010, సోమవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 5వ అధ్యాయం






రాజు - రాజ్యం




అధ్యాయం - 5

జయించబడటానికి పూర్వం తమ స్వంత చట్టాల క్రింద మనుగడ సాగించిన 
నగరాలు లేక సంస్థానాలను పరిపాలించే విధానం గురించి






నేను చెప్పినట్లుగా తమ స్వంత చట్టాల క్రింద మనుగడ సాగిస్తూ, స్వేచ్ఛగా ఉండటానికి అలవాటుపడిన రాజ్యాలు జయించబడినపుడు వాటిని మూడు విధానాలలో సంరక్షించుకోవచ్చు. వాటిని నాశనం చేయడం మొదటి పద్దతి. వెళ్ళి స్వయంగా అక్కడ నివసించడం రెండవ పద్దతి. మూడవ పద్దతి వాటి నుండి కప్పం వసూలు చేస్తూ, తమ చట్టాల పరిధిలోనే అవి మనుగడ సాగించడానికి అనుమతించడం. అలా అనుమతించడమే కాక ఆ రాజ్యంలో కొద్దిమంది స్థానికులతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వారు మిగతా రాజ్యాన్నంతా నీతో స్నేహపూర్వకంగా మెలగేటట్లు చేస్తారు. అటువంటి ప్రభుత్వం విజేత అయిన రాజుచే ఏర్పాటు చేయబడింది కనుక… అతని సంరక్షణ, మద్దతు లేని యెడల అది నిలబడలేదు అన్న విషయాన్ని తెలుసుకొని ఆ విజేతకు అది తన శక్తిమేర తోడ్పాటు నందిస్తుంది. మరి స్వేచ్ఛగా మనుగడసాగించడానికి అలవాటుపడిన నగరాన్ని ఏదో విధంగా సంరక్షించుకోవాలని అనుకుంటే అది ఏ ఇతర మార్గం కన్నా కూడా దాని స్వంత పౌరులద్వారానే చాలా సులభం. (అను: సులభమే కానీ సురక్షితం కాదు)

స్పార్టన్‌లు మరియు రోమన్‌ల చరిత్రలో మనకు ఈ విధానాలన్నింటికీ ఉదాహరణలు దొరుకుతాయి. స్పార్టన్‌లు థేబ్స్‌ను, ఏథెన్స్‌ను సంరక్షించుకోవడానికి ఆ నగరాలలో కొద్దిమందితో కూడిన ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు, …కానీ చివరికి వాటిని కోల్పోయారు. రోమన్‌లు కాపువా, కార్తేజ్ మరియు నుమాంటియాలను నిలుపుకోవడానికి వాటిని విధ్వంసానికి గురిచేయడంతో ఎన్నడూ వాటిని కోల్పోవడం జరగలేదు. మరో సందర్భంలో రోమన్‌లు గ్రీసును స్పార్టన్‌లు సంరక్షించుకున్న తరహాలోనే తామూ సంరక్షించుకోవాలని తలచి అది స్వేచ్ఛగా మనగలగడానికీ, అది తన స్వంత చట్టాలద్వారా పరిపాలింపబడటానికీ అనుమతినిచ్చారు. కానీ వారు సఫలత చెందలేదు. దానితో వారికి ఆ రాజ్యాన్ని సంరక్షించుకోవటానికి దానిలోని అనేక నగరాలను విధ్వంసానికి గురిచేయవలసివచ్చింది. ఎందుకంటే నిజానికి వాటిని నిలుపుకోవడానికి వాటిని విధ్వంసానికి గురిచేయడం కన్నా సురక్షితమైన మార్గం మరోటిలేదు. ఎవరైతే స్వేచ్ఛగా మనుగడ సాగించే నగరాన్ని జయించిన తదుపరి దానిని నాశనం చేయరో వారు దాని చేతనే నాశనం చేయబడతారని భావించవచ్చు. ఎందువల్లనంటే అది ఎల్లప్పుడూ కూడా ‘స్వేచ్ఛ’ మరియు ‘పూర్వపు హక్కులు’ అనబడే నినాదాలతో తిరుగుబాటు చేస్తుంది. ఈ నినాదాలూ, వాటి భావనలూ కాలగతిలోనూ మరువబడవు, అలాగే విజేతచే ఒనగూడిన మేలు వలన కూడా మరువబడవు. నీవు ఏమిచేసినా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రజలు అసంఘటితం చేయబడి, చెల్లాచెదురు చేయబడకపోతే స్వేచ్ఛ, పూర్వపు హక్కులు అనబడే వాటిని అవి ఎన్నటికీ విస్మరించవు. అవకాశం దొరికినపుడల్లా, అవి ఆ నినాదాలను త్వరితగతిన అందుకొంటాయి. పీసా నగరం వందేళ్ళ పరాధీనత తరువాత ఫ్లోరెంటైన్ల మీద ఇలాగే తిరుగుబాటుచేసింది.

కొత్తగా జయించబడిన నగరం లేక దేశం ఒక రాజు యొక్క అధీనంలోనిదైతే, అతడి కుటుంబం తుదముట్టింపబడిన తరువాత దాని పౌరులు ఒక వంక విధేయత చూపడానికి అలవాటుపడి ఉండి, మరో వంక తమ పాత రాజుని కోల్పోయి ఉండటంతో తమలో నుండి ఒకరు రాజుగా ఎంపిక అవడానికి అంగీకరించడం వారికి సాధ్యంకాదు. అలాగే తమను తామెలా పరిపాలించుకోవాలో కూడా వారికి తెలియకపోవడం వలన వారు త్వరితగతిన ఆయుధాలను చేపట్టలేరు; కనుక విజేత వారందరినీ సులువుగా తనవైపు తిప్పుకొని తనతోనే ఉంచుకోగలుగుతాడు. కానీ రిపబ్లిక్‌లలో అధిక చైతన్యం, తీవ్రమైన ద్వేషం, చల్లారని ప్రతీకార వాంఛ ఉంటాయి. ఇవేవీ కూడా ఆ రిపబ్లిక్కులు తమ పూర్వపు స్వేచ్చ యొక్క జ్ఞాపకాన్ని మరిచిపోడానికి అంగీకరించవు. అందువలన సురక్షితమైన మార్గం వాటిని విధ్వంసం చేయడం; లేదా వెళ్ళి అక్కడ నివసించడం.


9, జులై 2010, శుక్రవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 4వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం - 4 

అలెగ్జాండర్ చేత జయించబడిన డేరియస్ సామ్రాజ్యం అలెగ్జాండర్ మరణానంతరం అతని వారసుల మీద ఎందుకు తిరుగుబాటు చేయలేదు?







అలెగ్జాండర్ ద గ్రేట్ కొద్ది సంవత్సరాలలోనే ఆసియా మీద విజయాన్ని సాధించి, అక్కడ తన అధికారం ఇంకా స్థిరపడకముందే మరణించాడు. ఒక కొత్త రాజ్యాన్ని సంరక్షించుకోవడంలో ఉండే కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకొని అతడు మరణించటం వలన సామ్రాజ్యం మొత్తం తిరుగుబాటు చేస్తుందని భావించబడింది. కానీ అతని వారసులు దానిని సమర్థవంతంగా సంరక్షించుకోగలిగారు. అలాచేయడంలో వారికి కేవలం తమ దురాశ మూలంగా మరియు ఒకరి యెడల ఒకరు అసూయ చెందడం మూలంగా తలయెత్తిన కష్టం తప్ప మరెటువంటి ఇతర కష్టం ఎదురుకాలేదు.

ఇలా జరగటం ఎవరికైనా కొత్తగా అనిపించి కారణం అడిగితే, నేను ఈ విధంగా సమాధానమిస్తాను. మనకు తెలిసిన అన్ని సంస్థానాలూ రెండు వేర్వేరు విధానాలలో పరిపాలింపబడుతున్నాయి. ఒక విధానంలో రాజు మరియు కొంతమంది సేవకుల సమూహం ఉంటుంది. వారంతా ఆ రాజు యొక్క ప్రసన్నత వలన మరియు అనుమతి వలన రాజ్యాన్ని పరిపాలించడంలో అతనికి మంత్రులుగా సహకరిస్తుంటారు. మరో విధానంలో రాజు మరియు కొందరు ప్రభువంశీకులు ఉంటారు. వారు తమ హోదాను రాజు యొక్క దయ వలన కాక అనువంశికంగా కలిగి ఉంటారు. ఈ ప్రభువంశీకులు అందరికీ తమను వారి రాజుగా గుర్తిస్తూ, ఎంతగానో ప్రేమించే ప్రజలతో కూడుకున్న స్వంత రాజ్యాలు ఉంటాయి. రాజు మరియు అతని సేవకులచే పరిపాలింపబడే రాజ్యాలు రాజుకు చాలా ప్రాముఖ్యత కలుగజేస్తాయి. ఎందుకంటే దేశం మొత్తంలో ఇతని కన్నా ఉన్నతుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి మరెవరూ ఉండరు. ఒకవేళ ఇతరులు ఎవరైనా గౌరవాన్ని పొందినా కూడా, రాజు యొక్క మంత్రులుగా, అధికారులుగా వారు గౌరవాన్ని పొందుతారేగానీ వారి యెడల మరేవిధమైన వ్యక్తిగత ప్రేమాభిమానాలు ఉండవు.

ఈ రెండు ప్రభుత్వ విధానాలకూ మనకాలంలో మంచి ఉదాహరణలు టర్కీ మరియు ఫ్రాన్స్. టర్కిష్ సామ్రాజ్యం మొత్తం ఒక్క రాజు చేతనే పాలింపబడుతూ ఉంటుంది. ఇతరులు అందరూ సేవకులుగా ఉంటారు. అతడు రాజ్యాన్ని ‘సంజక్’లు అనబడే విభాగాలుగా విభజించి, వాటన్నింటికి ఒక్కొక పరిపాలనా అధికారిని నియమిస్తాడు. ఆ పరిపాలనా అధికారులను రాజు తన చిత్తానుసారంగా బదిలీ చేస్తుంటాడు. ఒకరి స్థానంలో మరొకరిని నియమిస్తుంటాడు. అయితే ఇందుకు విరుద్ధంగా ఫ్రాన్స్ దేశపు రాజు వంశపారంపర్య అధికారం కలిగిన అనేక మంది ప్రభువంశీకులచే పరివేష్ఠితుడై ఉంటాడు. వారిలో ప్రతి ఒక్కరూ తమ స్వంత ప్రజలనుండి గుర్తింపునూ, ప్రేమాభిమానాలనూ పొందుతుంటారు. ఆ ప్రభువంశీకులంతా కొన్ని ప్రత్యేకాధికారాలను కలిగి ఉంటారు. రాజుకు సైతం వాటిని తొలగించడం కష్టసాధ్యం.

ఈ రెండు రాజ్యాల యొక్క వేరువేరు లక్షణాలను పరిశీలించిన వారు టర్కీ రాజ్యాన్ని ఆక్రమించడం కష్టసాధ్యమనే విషయాన్ని గ్రహిస్తారు. అయితే ఒకసారి దానిని జయించడమంటూ జరిగితే ఆ తదుపరి దానిని నిలుపుకోవడం మాత్రం సులభ సాధ్యం. టర్కీని జయించడంలో ఉన్న కష్టాలకు కారణాలు ఏమిటంటే దండెత్తాలని అనుకునేవారికి ఆ రాజ్యంలోని ఏ ప్రభువంశీకుల నుండి కూడా పిలుపు అందదు. అలానే శత్రురాజు యొక్క సహచరులు రాజద్రోహానికి పాల్పడటం ద్వారా తమ దురాక్రమణ ప్రయత్నాలకు ఏదైనా సహాయం మందవచ్చని ఆశించే వీలు కూడా ఉండదు. పైన తెలిపిన కారణాల వలన ఇలా జరిగింది. అవేమంటే రాజు యొక్క మంత్రులు అతనికి కేవలం సేవకులూ మరియు అతని మీద ఆధారపడి బ్రతికే బానిసలు అవడం మూలాన వారు అంత తేలికగా రాజద్రోహానికి పాల్పడరు. ఒకవేళ వారు ద్రోహానికి పాల్పడినా కూడా వారి నుండి అందే సహాయం ఏమీ ఉండదు. ఎందుకంటే ముందే చెప్పినట్లుగా వారు ప్రజలను కూడగట్టలేరు కనుక. కనుక టర్కీని జయించాలనుకునేవారు మొదట తన వారంతా సంఘటితంగా ఉండటం గురించి ఆలోచించాలి. అలానే శతృశిబిరంలోని రాజద్రోహాలమీద కాకుండా తన స్వీయశక్తి మీదే ఆధారపడాలి. అయితే ఒకసారి టర్కీ జయించబడిన తరువాత, అది తన సైన్యాన్ని తిరిగి కూడగట్టలేని విధంగా యుద్ధరంగం నుండి తరిమి వేయబడిన తరువాత ఒక్క రాజకుటుంబానికి తప్ప మరిదేనికీ భయపడవలసిన పనిలేదు. దానిని కూడా తుదముట్టించిన తరువాత ఇక భయపడవలసిన వారు ఒక్కరు కూడా మిగిలి ఉండరు. మిగిలిన వారెవరికీ ప్రజలలో పలుకుబడి ఉండదు కనుక విజేత ఆ రాజ్యాన్ని జయించడానికి పూర్వం వారి మీద ఏ విధంగా ఆధారపడలేదో, అలాగే జయించిన తరువాత వారికి భయపడాల్సిన పని కూడా లేదు.

ఫ్రాన్సు వంటి పరిపాలన ఉన్న రాజ్యాలలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది. అటువంటి చోట్ల అసమ్మతివాదులు, మార్పును అభిలషించేవారూ ఎల్లప్పుడూ ఉంటారు కనుక ఎవరో ఒక ప్రభువంశీకుడి సహాయసహకారాల ద్వారా చాలా సులభంగా ఆ రాజ్యంలో ప్రవేశించవచ్చు. అటువంటి వ్యక్తులు ముందే తెలుపబడిన కారణాలరీత్యా తమ రాజ్యం మీద నీవు దండెత్తడానికి మార్గాన్ని సుగమం చేయడమే కాక నీవు సులువుగా విజయం సాధించడానికి తోడ్పడతారు. అయితే ఆ తదుపరి ఆ రాజ్యాన్ని సంరక్షించుకొనే ప్రయత్నంలో నీచే రాజ్యాన్ని కోల్పోయినవారి నుండే కాక నీకు సహాయం చేసినవారి నుండి కూడా నీవు అంతులేని కష్టాలను ఎదుర్కొంటావు. నీకు వ్యతిరేకంగా జరిగే తదనంతర పరిణామాలన్నింటికీ మిగిలిపోయిన రాజవంశీకులందరూ నాయకత్వం వహిస్తారు కనుక రాజకుటుంబాన్ని ఒక్కదాన్ని మట్టుబెట్టినందువల్ల ప్రయోజనమేమీ ఉండదు. ఈ రాజవంశీకులను నీవు ఇటు సంతృప్తి పరచలేక అటు తుదముట్టించలేక సతమతమవుతూ ఏదో ఒక సమయంలో జయించిన రాజ్యాన్ని తిరిగి కోల్పోతావు.

ఇప్పుడు నీవు డేరియస్ ప్రభుత్వ స్వభావాన్ని పరీక్షించినట్లైతే, అది టర్కీ సామ్రాజ్యంతో పోలి ఉన్నట్లుగా తెలుసుకుంటావు. కనుక అలెగ్జాండర్‌కు ముందుగా అతడిని యుద్ధంలో ఓడించి, అటు పిమ్మట అతడి రాజ్యాన్ని సొంతం చేసుకోవలసిన అవసరం ఒక్కటే ఉన్నది. అలా విజయం సాధించిన తరువాత డేరియస్ చంపబడి, పైన తెలిపిన కారణాల వలన ఆ రాజ్యం అలెగ్జాండర్‌కు శాశ్వతంగా స్వంతమైపోయింది. అలెగ్జాండర్ వారసులు సంఘటితంగా ఉన్నట్లైతే ఆ రాజ్యాన్ని చాలా సులువుగా, సురక్షితంగా తమ స్వాధీనంలో ఉంచుకోగలిగేవారు. ఎందుకంటే ఆ రాజ్యంలో మరే ఇతర కల్లోలాలూ చెలరేగలేదు..వీళ్ళు స్వయంగా సృష్టించుకున్నవి తప్ప.

(డేరియస్ పర్షియా రాజు)

అయితే ఫ్రాన్సును పోలిన ప్రభుత్వ విధానం ఉన్న రాజ్యాలను సంరక్షించుకోవడం ఇంత తేలిక కాదు. స్పెయిన్, గాల్ మరియు గ్రీసు రాజ్యాలు చిన్న చిన్న సంస్థానాలతో కూడుకున్నవి కనుక అక్కడ రోమన్‌లకు వ్యతిరేకంగా తరచూ తిరుగుబాట్లు చెలరేగుతుండేవి. ఆ సంస్థానాల జ్ఞాపకాలు (పాత ప్రభువుల యొక్క జ్ఞాపకాలు) ఉన్నంతకాలం రోమన్‌ల పెత్తనం ఏనాడూ సురక్షితంగా లేదు. కానీ కాలక్రమంలో రోమన్‌ల అధికారం వలన మరియు వారి పరిపాలన దీర్ఘకాలం కొనసాగటం వలన ఆ పాత జ్ఞాపకాలన్నీ చెరిగిపోయి రోమన్ల పెత్తనం సురక్షితంగా మారింది. తరువాత తమలో తాము కలహించుకున్న సమయంలో తాము అక్కడ కలిగి ఉన్న పలుకుబడిని బట్టి ఆ రాజ్యాలలో కొంత కొంత భాగాన్ని వారిలో ప్రతి ఒకరూ తమతో ఉంచుకోగలిగారు. ఆయాచోట్ల పాత ప్రభువుల యొక్క కుటుంబాలు తుదముట్టించబడటంతో రోమన్‌లు తప్ప వేరెవ్వరూ ప్రభువులుగా గుర్తించబడలేదు.

ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నట్లైతే అలెగ్జాండర్ ఆసియాలోని తన సామ్రాజ్యాన్ని సులువుగా సంరక్షించుకున్న వైనం యెడల, అలాగే పిర్రస్ మరియు అనేకమంది ఇతరులు తాము జయించిన రాజ్యాలను సంరక్షించుకోవడంలో ఎదుర్కున్న కష్టాల యెడల ఆశ్చర్యబోవలసిన అవసరం ఎవరికీ ఉండదు. ఎందువల్లనంటే దీనికి కారణం విజేత బలవంతుడో లేక బలహీనుడో అవటం కాదు. వారు జయించిన రాజ్యాల యొక్క లక్షణాలలోని తేడాలే దీనికి కారణం.


7, జులై 2010, బుధవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 3వ అధ్యాయం





రాజు - రాజ్యం



అధ్యాయం - 3 

మిశ్రమసంస్థానాల గురించి






అయితే నూతన సంస్థానంలో చాలా కష్టాలు ఎదురౌతాయి. మరి మొదటగా, సంస్థానం పూర్తి కొత్తదిగా ఉండక రాజు యొక్క పాత భూభాగాలకు చేర్చబడి వాటితో కలిపి మిశ్రమ సంస్థానంగా పిలువబడే విధంగా రూపొందితే, అటువంటి సంస్థానంలో నూతన రాజ్యాలన్నింటిలో స్వాభావికంగా ఉండే ఒక కారణం వలన సంక్షోభాలు తలయెత్తుతాయి. ఎలా అంటే కొందరు వ్యక్తులు తమ పరిస్థితి మెరుగు పడాలని భావిస్తూ తమ పాలకులను మార్చాలనే ఉద్దేశ్యంలో ఎల్లవేళలా ఉంటారు. ఈ భావనతో వారు తమ పాలకుడికి వ్యతిరేకంగా ఆయుధాలను ధరిస్తారు. కానీ ఈ ప్రయత్నంలో వారు మోసపోతారు. ఎందుకంటే తిరుగుబాటు తదనంతరం తమ పరిస్థితి మరింత దిగజారినట్లు వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. తన అధీనంలోకి వచ్చిన వారిని సైన్యం ద్వారా, ఇంకా తను కొత్తగా సాధించిన రాజ్యంలో తప్పనిసరిగా అమలు చేయవలసిన అనేకానేక ఇతర కష్టాల ద్వారా పీడించడం ఒక కొత్త రాజు (New Prince) కుండే మరో సహజమైన, సాధారణమైన ఆవశ్యకత అవడం వలన కూడా ఈ విధమైన పరిణామం సంభవిస్తుంది.

ఈవిధంగా ఒక సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవడంలో అనేక మందికి హాని చేయడం వలన వారంతా నీకు శత్రువులుగా మారతారు. అంతేకాక ఆ సంస్థానాన్ని పొందడంలో నీకు సహాయం చేసిన మిత్రులు కూడా ఎంతోకాలం నీకు మిత్రులుగా ఉండరు. ఎందుకంటే నీవు వారు ఆశించిన రీతిలో వారి కోరికలను తీర్చలేవు. మరో పక్క వారికి ఋణపడి ఉండటం వలన వారికి వ్యతిరేకంగా ధృడమైన చర్యలు కూడా తీసుకోలేవు. అందువలన మనం ఎంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఒక రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు ఆ రాజ్యంలోని స్థానికుల సుహృద్భావం ఎల్లప్పుడూ అవసరమౌతుంది.

ఈ కారణాలవలనే ఫ్రాన్స్ రాజైన 12 వ లూయీ మిలన్‌ను ఎంత త్వరగా ఆక్రమించాడో అంతేత్వరగా పోగొట్టుకున్నాడు. మొదటిసారి ఇతనిని తరిమి వేయడానికి మిలన్ రాజు Lodovico కు స్వంత సైన్యం ఒక్కటే సరిపోయినది. ఎందుకంటే 12వ లూయీకి కోటతలుపులు తెరిచిన వారే తమ భవిష్యత్ ఆశల విషయంలో తాము మోసపోయామని గ్రహించినమీదట ఆ కొత్త రాజు (New Prince) చేసే అవమానాలను, దుశ్చర్యలను ఇక ఎంత మాత్రం సహించలేకపోయారు. (అను: సహించలేక తిరుగుబాటుచేసి స్వతంత్ర్యాన్ని పొందారు) ఒకసారి తిరుగుబాటు చేసిన సంస్థానాలు తిరిగి రెండవసారి ఆక్రమణకు గురైతే అవి ఈసారి అంత తేలికగా స్వతంత్ర్యాన్ని పొందలేవనేది నిజం. ఎందుకంటే రాజు తిరుగుబాటును ఒక సాకుగా తీసుకుని ఏ మాత్రం సంకోచించకుండా అపరాధులను శిక్షించి, అనుమానితులను తుడిచిపెట్టి, బలహీన ప్రాంతాలలో తనను బలంగా మలచుకుంటాడు.

కనుకనే మొదటి సందర్భంలో Duke Lodovico కు ఫ్రాన్స్ నుండి మిలన్ ను విడిపించడానికి సరిహద్దులలో తిరుగుబాట్లు లేవదీయడంతో సరిపోయింది. కానీ రెండవ సందర్భంలో అతని నుండి మిలన్ ను విడిపించడానికి మొత్తం ప్రపంచాన్నే అతనికి వ్యతిరేకంగా నిలిపి అతని సైన్యాన్ని ఓడించి, వాటిని ఇటలీ నుండి తరిమి వేయవలసిన అవసరం ఏర్పడింది. ఇదంతా పైన వివరించిన కారణాలను అనుసరించే జరిగినది.

ఏదైతేనేం మొదటిసారి మరలా రెండవసారి కూడా మిలన్ ఫ్రాన్స్ చెరనుండి విడిపించబడింది. మొదటి సందర్భం యొక్క సాధారణ కారణాలు తెలుపబడ్డాయి. రెండవ సందర్భపు కారణాలను పేర్కొనడం, ఫ్రాన్స్ రాజైన 12 వ లూయీ ఏయే తరుణోపాయాలను కలిగిఉన్నాడు, ఒకవేళ ఇతని స్థానంలో మరో వ్యక్తి ఉన్నట్లైతే అతను ఏయే తరుణోపాయాలను కలిగి ఉండటం ద్వారా తను సాధించుకున్న రాజ్యాన్ని ఫ్రాన్స్ రాజులా పోగొట్టుకోకుండా సురక్షితంగా నిలుపుకోగలిగేవాడు అనే విషయాలను పరిశీలించడం మిగిలిపోయింది.

నేనిపుడు ఓ విషయం గురించి చెబుతాను. ఓ రాజు కొత్త ప్రాంతాలను జయించి వాటిని తన పాత రాజ్యంలో కలిపినపుడు ఆ కొత్త ప్రాంతాలు అదే దేశ, భాషలకు చెందినవైనా అవుతాయి లేదా విభేదిస్తాయి. దేశం, భాష ఒకటే అయిన పక్షంలో ఆ కొత్త ప్రాంతాలను నిలుపుకోవడం తేలిక. మరిముఖ్యంగా అవి స్వయం పాలనకు అలవాటుపడని పక్షంలో మరింత తేలిక. ఒక వేళ అవి స్వయంపాలిత ప్రాంతాలైతే అప్పటివరకు వాటిని పరిపాలిస్తున్న రాజును సకుటుంబంగా నాశనం చేస్తే సరిపోతుంది. రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు (పాలకుల విషయంలో తప్ప) ఇతర విషయాలలో అదే పాత వారసత్వాన్ని సంరక్షించుకుంటూ ఉంటారు. తమ ఆచార వ్యవహారాలలో భేదం లేకపోవడం వలన కలసిమెలసి జీవిస్తారు. చాలాకాలం నుండి ఫ్రాన్స్‌తో కలసిపోయి ఉన్న బ్రిట్టని, బర్గండి, గాస్కొని మరియు నార్మండి విషయంలో మనం ఈ పరిస్థితిని గమనించవచ్చు. భాష విషయంలో కొంత భేదం ఉన్నప్పటికీ ఆచారవ్యవహారాలు ఒకటే అవడం వలన పైప్రాంతాలలోని ప్రజలు పరస్పరం సులభంగా కలసిపోగలిగారు. ఇటువంటి ప్రాంతాలను ఆక్రమించుకున్న వ్యక్తి వాటిని సంరక్షించుకోవాలని కోరుకున్నట్లైతే రెండే రెండు ఆలోచనలను తన మనసులో కలిగి ఉండాలి. మొదటిది ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజును సకుటుంబంగా నాశనం చేయడం, రెండవది ఆ ప్రాంతపు చట్టాలను, పన్నులను మార్చకపోవడం. ఈ విధంగా చేసినట్లైతే కొద్దికాలంలోనే వారు పాతరాజ్యంలో అవిభాజ్యమైన భాగస్వాములైపోతారు.

కానీ ఒక దేశంలో ఉన్న భాష, ఆచారవ్యవహారాలు, చట్టాలు మొదలైన విషయాలలో విభేదించే రాజ్యాలను సాధించినపుడు అనేక ఆటంకాలు ఎదురౌతాయి. వీటిని నిలుపుకోవడానికి బాగా అనుకూలంగా ఉన్న పరిస్థితులు మరియు గొప్పవైన శక్తి సామర్ధ్యాలు అవసరమవుతాయి. అన్నింటికన్నా ఎక్కువగా, నిజంగా అవసరమైన దేమిటంటే ఆ రాజ్యాలను జయించిన రాజు ఆ ప్రాంతానికి వెళ్ళి, అక్కడే నివసించాలి. ఇలా చేస్తే అతని స్థానం మరింత సురక్షితంగా ఉండటమేకాక చిరకాలం మన్నుతుంది. గ్రీసు దేశంలోని టర్కులు ఇలాగే మనగలిగారు. ఆ రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి ఆ టర్కిష్ రాజు అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, అతను అక్కడ నివసించకపోయినట్లైతే ఆ రాజ్యాన్ని అతను సంరక్షించుకోగలిగేవాడు కాదు. ఎందుకంటే అక్కడే నివసిస్తున్నట్లైతే దుష్పరిణామాలు సంభవించిన వెంటనే వాటిని గమనించి అవి చిన్నగా ఉన్నపుడే వాటిని నివారించవచ్చు. కానీ అక్కడ రాజులేని పక్షంలో అవి పెరిగిపెద్దవైన తరువాత మాత్రమే చెవినబడతాయి. అపుడు ఎవరూ వాటిని నివారించలేరు. అంతేకాక రాజు ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్లైతే తన అధికారులవలన దేశం దోపిడీలకూ, లూటీలకూ గురికాకుండా ఉంటుంది. ప్రజలు తమ గోడు చెప్పుకోవడానికి అందుబాటులో ఉన్న రాజును చూచి సంతృప్తి చెందుతారు. అంతే కాక రాజు తన యెడల సదుద్దేశ్యం కలిగిన ప్రజలలో తన మీద మరింత ప్రేమను కలిగిస్తాడు. అలానే దురుద్దేశ్యం కలిగిన వారిలో తన యెడల భయాన్ని ప్రేరేపించగలుతాడు.

బయటినుండి ఎవరైనా ఆ రాజ్యం మీద దాడి చేయాలనుకొంటే అతడు తప్పనిసరిగా అత్యంత జాగరూకత వహించవలసి ఉంటుంది. రాజు అదే రాజ్యంలో నివసిస్తున్నంతకాలం చాలా గొప్ప కష్టం ద్వారా మాత్రమే ఆ రాజ్యం అతనినుండి బలవంతంగా వేరుచేయబడుతుంది.

రాజు అక్కడే నివసించడానికి వీలుకాని పక్షంలో మరో మంచి పద్దతి ఏమిటంటే ఆ రాజ్యంలో ఒకటి రెండు కీలక ప్రదేశాలలో వలసలను ఏర్పాటు చేయడం. ఈ విధంగా చేయని పక్షంలో పదాతి, అశ్విక దళాలతో కూడిన పెద్ద సైన్యాన్ని అక్కడ ఉంచవలసి ఉంటుంది (అను: ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని). వలసలు అంత ఖర్చుతో కూడుకున్నవి కావు. చాలా తక్కువ ఖర్చుతోనే వాటిని స్థాపించి, నిర్వహించవచ్చు. వలసలకొరకు ఎంచుకున్న ఆ ఒకటి, రెండు ప్రదేశాలలోని ప్రజల ఆస్తులు అంటే వారి ఇళ్ళు, పొలాలు మాత్రమే వలస వచ్చిన వారికివ్వడం కొరకు దోచివేయబడతాయి. ఆ విధంగా పేదవారిగా మారిపోయి చెట్టుకొకరు పుట్టకొకరుగా మరిన ఆ కొద్దిమంది ఈ రాజుకు గానీ, అతని అధికారానికిగానీ, ఏవిధమైన హానీ చేయలేరు. ఆ రాజ్యంలోని మిగిలిన ప్రజలకు ఏ విధమైన హానీ జరగదు కనుక వారు శాంతియుతంగానే ఉంటారు. మరో పక్క వారు వలస కేంద్రాలలోని ప్రజలవలే తాముకూడా దోచివేయబడతామేమో అనే భయంతో ఏ విధమైన అల్లర్లకూ పాల్పడకుండా ఉంటారు. చివరకు నేను చెప్పేదేమిటంటే వలసలు ఖర్చుతో కూడుకున్నవి కావు, విశ్వాస పాత్రమైనవి, తక్కువ మందికి హానిచేస్తాయి. ఆ విధంగా హాని చేయబడిన ఆ కొద్ది మందికూడా ముందే చెప్పినట్లుగా చెల్లాచెదురైపోయి పేదవారిగా మారిపోవటం వలన ఏ విధంగానూ తిరిగి హాని తలపెట్టలేరు. దీనిని బట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మనుషులతో మంచిగానైనా ప్రవర్తించాలి లేదంటే వారిని పూర్తిగా నాశనమైనా చేయాలి. ఎందుకంటే కొద్దిపాటి హాని వలన వారు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. కానీ తీవ్రంగా హానిచేస్తే ఆవిధంగా చేయలేరు. కనుక మనం ఒక వ్యక్తికి చేసే హాని ప్రతీకార భయం కలిగించని విధంగా ఉండాలి.

వలసల స్థాపన కాకుండా నూతనరాజ్యంలో సాయుధబలగాలనే ఉంచదలచుకుంటే అందుకు అమితంగా ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఆ రాజ్యం మీద వచ్చే ఆదాయమంతా సైన్యం కొరకే ఖర్చు చేయడం వలన ఆ ఆక్రమణ నష్టదాయకంగా మారుతుంది. రాజ్యమంతటిలో ఈ సైన్యం కల్లోలం సృష్టించటం వలన ఆ రాజ్యం లోని ప్రజలంతా ఆగ్రహంతో ఉంటారు. ఈ సైన్యం రాజ్యమంతా అటూ, ఇటూ కదులుతూ ప్రజలందరినీ అనేక కష్టనష్టాలకు గురిచేయడంతో వారంతా ఆక్రమణ దారులకు వ్యతిరేకంగా మారతారు. తమ రాజ్యంలోనే తాము హింసించబడుతుండటంతో శత్రువులుగా మరిన వారు ఆక్రమణ దారులకు హాని చేయగలిగే స్థితిలో (సంఖ్యాబలం రీత్యా) ఉంటారు. ఏ కారణంతో చూచిన కూడా ఈవిధంగా సైన్యాన్ని నిలపడం ఉపయోగకరం కాదు. వలసల స్థాపన మాత్రమే ఉపయోగకరం.

మరలా భాష మరియు చట్టాల విషయంలో తన రాజ్యంతో విభేదించే రాజ్యాన్ని సాధించి, దానిని సంరక్షించే రాజు దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న పొరుగురాజ్యాలన్నింటికీ నాయకుడిగా, రక్షకుడిగా తనను తాను రూపొందించుకోవాలి. వాటిలోని బలమైన రాజ్యాలను బలహీన పరచాలి. ఏ కారణం చేత కూడా తనతో సమబలుడైన విదేశీయుడెవ్వడూ ఆ ప్రాంతంలో అడుగు పెట్టకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే దురాశ వలనగానీ, భయం వలనగానీ అసంతృప్తులై ఉన్నవారు ఎల్లప్పుడూ అటువంటి విదేశీయుడిని ఆహ్వానిస్తుంటారు. గ్రీసు దేశంలోనికి రోమన్‌లను ఏటోలియన్స్ ఆహ్వానించారు. అలానే రోమన్‌లు కాలు మోపిన ప్రతీ ఇతర దేశంలోకి కూడా వారు స్థానికుల ద్వారానే ప్రవేశించారు. ఇలా ఒక బలవంతుడైన విదేశీయుడు ఒక దేశంలో ప్రవేశించగానే సర్వసాధారణంగా జరిగే విషయం ఒకటే. ఆ దేశపు సామంతరాజ్యాలన్నీ తమ సార్వభౌముడిమీద ఉన్న ద్వేషంతో ఆ విదేశీయుడి దరి చేరతాయి. కనుక ఈ సామంత రాజ్యాల మద్దతు పొందడానికి రాజు ఏమాత్రం కష్టపడనవసరం లేదు. ఎందుకంటే వారందరూ వెనువెంటనే, మూకుమ్మడిగా, స్వీయ సమ్మతితో అక్కడ అతను సాధించిన కొత్త రాజ్యం వైపు పరుగులు పెడతారు. కనుక కొత్త రాజు ఆ సామంత రాజ్యాలు మరీ ఎక్కువ శక్తినీ, అధికారాన్ని పెంచుకోకుండా మాత్రమే జాగ్రత్త పడి, ఆ పిమ్మట తన స్వంత సైన్యంతో, ఆ సామంత రాజ్యాల సుహృద్భావంతో సులువుగానే వారిలో బలవంతులు ఎవరైనా ఉంటే వారిని బలహీన పరచి, దేశం మొత్తం మీద తానొక్కడే అన్ని విషయాలలో సమున్నతుడిగా మిగిలిపోగలడు. ఎవరైతే ఇలా చేయలేకపోతారో వారు త్వరలోనే తాను సాధించిన రాజ్యాన్ని కోల్పోతారు. అంతేకాక దానిని సంరక్షించే సమయంలో అంతులేని కష్టనష్టాలను చవిచూస్తారు.

రోమన్‌లు తాము స్వాధీనం చేసుకున్న రాజ్యాలలో ఈ చర్యలన్నింటినీ పూర్తిగా ఆచరించారు. వలసలు స్థాపించారు. చిన్న రాజ్యాలతో వాటి శక్తిని పెరగనీయకుండా చూస్తూనే వాటితో స్నేహసంబంధాలను కొనసాగించారు. శక్తివంతమైన రాజ్యాలను అదుపులో ఉంచగలిగారు. అలానే శక్తివంతులైన విదేశీయులెవ్వరికీ ఆ ప్రాంతంలో తమ అధికారాన్ని పాదుకొల్పగలిగే అవకాశం ఇవ్వలేదు. గ్రీసు దేశంలోని వివిధ ప్రాంతాలు ఒక మంచి ఉదాహరణగా నాకు కనిపిస్తున్నాయి. రోమన్‌లచే ఏచియన్స్ మరియు ఏటోలియన్స్ స్నేహపూర్వకంగా చూడబడ్డారు. మాసిడోనియా రాజ్యం అదుపాజ్ఞలలో ఉంచబడింది. ఆంటియోకస్ తరిమివేయబడ్డాడు. ఏచియన్స్ మరియు ఏటోలియన్‌ల మంచితనం వీరు తమ శక్తిని, అధికారాన్ని పెంచుకొనేటందుకు రోమన్‌లు అనుమతించే విధంగా చేయలేకపోయింది. (అను: ఏచియన్స్ మరియు ఏటోలియన్‌ల మంచిగా ఉన్నా కూడా వారు తమ శక్తిని, అధికారాన్ని పెంచుకొనేటందుకు రోమన్‌లెప్పుడూ అనుమతించలేదు.) ముందుగా ఫిలిప్ తన శక్తిని తగ్గించుకొనేంతవరకూ తమతో స్నేహం చేయాలనే అతని ప్రయత్నాలేవీ కూడా రోమన్‌లను కదిలించలేకపోయాయి. ఆంటియోకస్ యొక్క శక్తి సామర్ధ్యాలు అతను ఆ ప్రాంతంలోని ఏదో ఒక్క రాజ్యాన్నైనా కలిగి ఉండటానికి రోమన్‌లు అనుమతించేటట్లుగా చేయలేకపోయాయి. ఈ ఉదాహరణలన్నింటిలోనూ, ఈ వ్యవహారాలన్నింటిలోనూ రోమన్‌లు ముందుచూపు కలిగిన రాజులందరూ ఎలాగైతే ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తించారు. ముందుచూపు కలిగిన వారు ప్రస్తుత సమస్యలనేకాక ఎదుర్కోవడానికి సర్వశక్తులతో సంసిద్ధులై ఉండవలసిన భవిష్యత్ సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుంటారు. ఎందుకంటే సమస్యలను ముందుగానే అంటే అవి సుదూరంగా ఉన్నపుడే గమనించగలిగితే వాటిని నివారించడం సులభం. ఒక వేళ నీవు గనుక ఆ సమస్యలు సమీపించేవరకు వేచి ఉన్నట్లైటే నివారణోపాయాలేవీ పనిచేయక పరిస్థితి చేజారిపోతుంది. వైద్యులు చెప్పేవిధంగా విషజ్వరం సోకినప్పుడు ప్రారంభంలో ఆ జబ్బును తగ్గించడం తేలిక అయితే గుర్తించడం కష్టం. కనుక దానిని గుర్తించకపోవడం వలన, ఆరంభంలోనే నివారించకపోవడం వలన కాలం గడిచేకొలదీ అది తేలికగా గుర్తించగలిగే విధంగా, నివారించడానికి కష్టసాధ్యమయ్యేటట్లుగానూ తయారవుతుంది. రాజ్య వ్యవహారాలలో కూడా ఇలానే జరుగుతుంది. ముందుగానే పసిగట్టబడిన (రచయిత: అలా పసిగట్టే సామర్థ్యం వివేకవంతులకు ఉంటుంది) దుష్పరిణామాలు వెనువెంటనే నివారింపబడతాయి. కానీ అలా ముందుగా పసిగట్టలేకపోతే అవి అందరికీ కనబడేంతగా పెరిగి పెద్దవైపోతాయి. అప్పుడు వాటికి నివారణే ఉండదు. కనుక రోమన్‌లు సమస్యలను ముందుగానే గ్రహించి వెంటనే వాటియెడల తగిన విధంగా వ్యవహరించేవారు. యుద్ధ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి కూడా వారు సమస్యలను పెరగనిచ్చేవారు కాదు. ఎందుకంటే యుద్ధమెప్పుడూ జరగకుండా పోదు. కేవలం వాయిదా మాత్రమే వేయబడుతుంది. అది కూడా ఇతరులకే లాభిస్తుంది. ఈ విషయం వారికి బాగా తెలుసు. ఫిలిప్ మరియు ఆంటియోకస్‌లు ఇటలీలో తమతో తలపడకుండా ఉండటం కొరకు వారితో రోమన్‌లు గ్రీసులో యుద్ధం చేయాలని కోరుకున్నారు. వారు ఈ రెండు యుద్ధాలను కూడా జరగకుండా ఆపగలిగేవారే. కానీ వారు అలా కోరుకోలేదు. మన కాలంలో వివేకవంతులమనుకునేవారి నోళ్ళలో ఎల్లప్పుడూ నానే ‘కాలం ఇవ్వజూపే సానుకూలతలను స్వీకరిద్దాం’ అనే ‘నీతి’ వాక్యం యెడల వారెప్పుడూ వ్యామోహితులు కాలేదు. వారు తమ శక్తిసామర్థ్యాలు మరియు తమ ముందుచూపు వలన ఒనగూడే సానుకూలతలను మాత్రమే స్వీకరించారు. ఎందుకంటే కాలం తన ముందు ఉన్న ప్రతి విషయాన్నీ నెట్టివేస్తుంది. అంతేకాక అది తనతో మంచితో పాటు చెడునూ, అలానే చెడుతోపాటు మంచిని కూడా తేగలదు.

ఇప్పుడు మనం పైన పేర్కొన్న విషయాలలో ఏ ఒక్కదాన్నైనా ఫ్రాన్సుదేశం ఆచరణలో పెట్టిందేమో పరిశీలిద్దాం. నేను 8వ చార్లెస్ గురించి కాక 12వ లూయీ గురించే మాట్లాడుతాను . ఎందుకంటే లూయీ ఇటలీని సుదీర్ఘకాలం తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కనుక ఇతని వ్యవహారశైలి పరిశీలించడానికి అనువుగా ఉంటుంది. ఒక విదేశీ రాజ్యాన్ని నిలుపుకోవడానికి ఏమి చేయవలసి ఉంటుందో అందుకు ఇతడు పూర్తి విరుద్ధంగా వ్యవహరించినట్లుగా నీవు తెలుసుకుంటావు.

ఫ్రాన్స్‌రాజు 12వ లూయీ జోక్యంతో లొంబార్డీ రాజ్యంలో సగభాగాన్ని పొందాలని వెనటియన్స్ కోరుకున్నారు (అను: మిగతా సగభాగం లూయీకి). వీరియొక్క ఈ ఆకాంక్ష లూయీని ఇటలీకి రప్పించింది. లూయీ ప్రవర్తనను నేను నిందించను. ఎందుకంటే ఇటలీలో ఏదోవిధంగా పాదుకొల్పుకోవడానికి అక్కడ తనకెవరూ స్నేహితులు లేకపోవడం వలన--తనకు ముందు రాజుగా ఉన్న 8వ ఛార్లెస్ ప్రవర్తన వలన తనకు అన్ని తలుపులూ మూసుకుపోయినవని గ్రహించడం వలన--తప్పనిసరి పరిస్థితులలో తనకు అందుబాటులో ఉన్న అన్ని స్నేహహస్తాలనూ లూయీ అందుకున్నాడు. ఇతర విషయాలలో కొన్ని తప్పులు చేయకపోయినట్లైతే ఇతని పథకం చాలా త్వరగా విజయవంతమై ఉండేది. ఏదైతేనేం లూయీ లొంబార్డీని పొందిన వెంటనే చార్లెస్ కోల్పోయిన అధికారాన్ని తిరిగిపొందాడు. జెనోవా లొంగిపోయినది. ఫ్లోరెంటైన్స్ ఇతనికి స్నేహితులైపోయారు. మాంటువాకి చెందిన మార్క్వెస్, డ్యూక్ ఆఫ్ ఫెర్రార, ద బెంటివోగ్లి, మై లేడి ఆఫ్ ఫోర్లి, ఫేంజా ప్రభువు, పెసారో రాజు, రిమిని రాజు, కామెరినో రాజు, పియోంబినో రాజు, ద లకెస్, ద పిసన్స్, ద సీనెస్ ( the Marquess of Mantua, the Duke of Ferrara, the Bentivogli, my lady of Forli, the Lords of Faenza, of Pesaro, of Rimini, of Camerino, of Piombino, the Lucchese, the Pisans, the Sienese) వీరంతా కూడా లూయీతో స్నేహం చేయడానికి ముందుకొచ్చారు. అప్పుడుగానీ వెనటియన్‌లకు తాము చేసిన తప్పు అర్థం కాలేదు. లొంబార్డీలోని రెండు పట్టణాలను తాము పొందడం కొరకు వారు లూయీని ఇటలీలోని మూడింట రెండువంతుల ప్రాంతానికి అధిపతిని చేసేశారు.

దీనినిబట్టి పైన పేర్కొన్న సూత్రాలను ఆచరణలో ఉంచినట్లైతే లూయీ ఎంత సులువుగా ఇటలీలోని తన స్థానాన్ని నిలుపుకోగలిగేవాడో ఎవరైనా ఊహించగలరు. ఇటలీలో అతని స్నేహితులు చాలామంది ఉన్నారు. ఐతే వారంతా బలహీనులు, మరియు పిరికివారు. కొందరు చర్చికి భయపడేవారు. కొందరు వెనటియన్స్‌కు భయపడేవారు. అందువలన వాళ్ళంతా లూయీనే అంటిపెట్టుకుని ఉండేవారు. వీరందరినీ అతను సంరక్షిస్తూ, తనతోటే ఉండిపోయేటట్లుగా చేసుకునట్లైతే వారి సహాయ, సహకారాలద్వారా ఏ శక్తివంతమైన ఇతర రాజ్యం నుండైనా తనను తాను చాలా సులువుగా రక్షించుకోగలిగేవాడు. కానీ ఇతను మిలన్ చేరుకోగానే రొమాగ్నా ఆక్రమణలో పోప్ అలెగ్జాండర్ కు సహాయం చేయడం ద్వారా అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు. ఈ చర్యద్వారా తనను తానే బలహీనపరచుకుంటున్న సంగతినీ, తన స్నేహితులనూ, మరియూ ఎవరైతే వారంతటవారుగా వచ్చి తన సాంగత్యాన్ని అభిలషించారో వారందరినీ పోగొట్టుకుంటున్న సంగతినీ అతనెప్పుడూ గ్రహించలేదు. అదేసమయంలో ఇతడు చర్చిని బలపడేటట్లు చేసి, దాని ఆధ్యాత్మిక అధికారాలకు తోడు లౌకిక అధికారాలను కూడా కట్టబెట్టి దాని అధికార పరిధిని అమాంతం పెంచేసాడు. ఈ విధంగా ప్రాధమికంగా తప్పు చేసిన లూయీకి తరువాత కూడా దానినే అనుసరించక తప్పలేదు. చివరికి ఇదంతా ఎక్కడకు దారితీసిందంటే అలెగ్జాండర్ అధికార దాహాన్ని అంతం చేయడానికీ, అతడు టస్కనీ అధినేతగా మారకుండా నిలువరించడానికీ తానే స్వయంగా ఫ్రాన్సు నుండి ఇటలీ రావలసి వచ్చింది.

చర్చిని శక్తివంతం చేయడం, తన స్నేహితులనందరినీ పోగొట్టుకోవడం; ఇత్యాదివన్నీ చాలవన్నట్లు కింగ్ లూయీ నేపుల్స్ రాజ్యాన్ని పొందాలనే ఆతురతలో దానిని స్పెయిన్ రాజుతో పంచుకున్నాడు. ఈవిధంగా తానొక్కడే సర్వోన్నతుడిగా ఉన్న ఇటలీలో తనతో సమ ఉజ్జీ మరియు తనకు ప్రత్యర్థి కాగలిగిన వ్యక్తిని తెచ్చిపెట్టుకున్నాడు. ఆవిధంగా ఇటలీలోని దురాశాపరులకూ, ఫ్రాన్స్‌లోని అసమ్మతివాదులకూ సహాయపడగలిగే ఒక కేంద్రాన్ని చేజేతులా ఏర్పాటుచేశాడు. అంతేకాక నేపుల్స్ రాజ్యానికి తన పెన్షనర్‌గా ఉండటానికి అంగీకరించిన పాతరాజుని అలానే కొనసాగనివ్వకుండా అతడిని వెళ్ళగొట్టి, తననే అక్కడి నుండి తరిమివేయగలిగేంతటి బలవంతుడిని దానికి రాజుగా చేశాడు.

విజయాన్ని పొందాలనే కోరిక మనుషులలో చాలా సహజం మరియు సాధారణం. నిజంగా వారికి అంత సామర్థ్యమున్నపుడు వారు విజయాన్ని తప్పక పొందుతారు. అందుకొరకు వారు ప్రశంసించబడతారేగానీ నిందించబడరు. కానీ వారికి అంత సామర్థ్యం లేనపుడు కూడా వారు ఏదో విధంగా విజయాన్ని పొందాలనుకుంటే ఖచ్చితంగా అది పొరబాటే,…. నిందార్హమే. ఫ్రాన్సు తన స్వంత సైన్యంతో నేపుల్స్ ను జయించగలిగే పరిస్థితిలో ఉన్నట్లైతే అది అలా జయించడం సబబే అయ్యేది. ఐతే దానికి అంత సామర్థ్యం లేకపోయేసరికి స్పెయిన్‌తో కలసి పంచుకోవడం ద్వారా నేపుల్స్‌ను ఏదో విధంగా పొందాలనుకోవడం సరైన చర్యకాదు. వెనటియన్స్‌తో లొంబార్డీని పంచుకోవడం ద్వారా లూయీ ఇటలీలో కాలు మోపగలిగాడు గనుక ఆ విభజన సరియైన చర్యే అవుతుంది. కానీ అటువంటి అవసరమేమీ లేదు కనుక స్పానియార్డులతో నేపుల్స్‌ను పంచుకోవడం గర్హనీయమే అవుతుంది.

ఈ విధంగా లూయీ ఈ ఐదు తప్పులకు పాల్పడ్డాడు. చిన్న శక్తులను (బలహీనులను) నాశనం చేశాడు. ఇటలీలోని శక్తివంతులలో ఒకడైనటువంటివాడి శక్తిని మరింత పెంచాడు. ఒక విదేశీ శక్తికి చోటు కల్పించాడు. అతడు దేశంలో నివసించలేదు. కనీసం వలసలను కూడా ఏర్పాటు చేయలేదు. ఇతడు ఇన్ని తప్పులు చేసినప్పటికీ వెనటియన్స్ నుండి వారి రాజ్యాన్ని లాగేసుకోవడం ద్వారా ఆరో తప్పు చేయకపోయినట్లైతే అతనికి హాని జరిగి ఉండేది కాదు. ఎందుకంటే లూయీ చర్చి అధికారాన్ని పెంచకపోయి ఉన్నట్లైతే. స్పెయిన్‌కు ఇటలీలో స్థానం కల్పించకపోయి ఉన్నట్లైతే వెనటియన్స్‌ను అణచివేయడం చాలా సహేతుకం మరియు ఆవశ్యకం అయి ఉండేది. కానీ పై రెండు పనులూ ఒకసారి చేసివేసిన తరువాత వెనటియన్స్ యొక్క నాశనాన్ని అతడు కోరుకొని ఉండవలసినది కాదు. ఎందుకంటే వెనటియన్స్ అధికారంలో ఉంటే లొంబార్డీ మీద ఎటువంటి కుట్రలకూ ఇతరులు పాల్పడకుండా జాగ్రత్తవహించేవారు. తాము ప్రభువులవడానికి తప్ప మరిదేనికీ అటువంటి కుట్రలను వారు అంగీకరించేవారు కాదు. అలానే ఇతరులెవ్వరూ కూడా వెనటియన్స్‌కు తిరిగి లొంబార్డీని అప్పజెప్పడం కొరకు ఫ్రాన్స్ నుండి దానిని గుంజుకోవడానికి ప్రయత్నించేవారు కాదు. అలానే ఫ్రాన్స్‌ను, లొంబార్డీని కలిపి ఎదుర్కోవడానికి ఎవరికీ ధైర్యం చాలేది కాదు.

కింగ్ లూయీ అలెగ్జాండర్‌కు రొమాగ్నాను స్వాధీనం చేయడం, నేపుల్స్‌లో కొంతభాగాన్ని స్పెయిన్‌కు ఇవ్వడం….. ఇదంతా యుద్ధప్రమాదాన్ని తప్పించుకోవడానికే చేశాడు అని ఎవరైనా సమర్ధించబూనితే దానికి నా సమాధానం: పైన పేర్కొన్న కారణాలరీత్యా యుద్ధాన్ని ఆపడం కోసం మనమెప్పుడూ పొరపాటు మార్గంలో నడవకూడదు. ఎందుకంటే యుద్ధమెప్పుడూ నివారింపబడదు. అది కేవలం వాయిదా మాత్రమే వేయబడుతుంది. ఆ వాయిదా కూడా మనకు నష్టదాయకంగా మాత్రమే ఉంటుంది.

తన వివాహాన్ని రద్దు చేసినందుకు, అలాగే ఆర్చ్‌బిషప్ రోయిన్‌కు కార్డినల్ పదవి కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా రొమాగ్నాను జయించి ఇస్తానని పోప్‌కు లూయీ వాగ్దానం చేయడాన్ని పేర్కొని ఎవరైనా లూయీని సమర్ధించబూనితే దానికి నా సమాధానం, రాజుల యొక్క వాగ్దానాలు మరియు వాటిని ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయం గురించి నేను ముందు ముందు రాయబోయే వాటి ద్వారా చెబుతాను.

రాజ్యాలను జయించి వాటిని సంరక్షించుకోవాలని కోరుకున్నవారు ఆచరించే ఏ పద్దతినీ అనుసరించకపోవడం ద్వారా కింగ్ లూయీ లొంబార్డీని పోగొట్టుకున్నాడు. ఇందులో ఆశ్చర్యపడవలసిన దేమీ లేదు. ఇలా జరగడం సహేతుకం మరియు సహజం. (ఫ్రాన్స్ దేశం లోని) నాన్సే పట్టణంలో ఉన్న సమయంలో నేను రోయిన్‌తో ఈ విషయాల గురించి సంభాషించాను. ఆ సమయంలో పోప్ అలెగ్జాండర్ కొడుకు -సీజర్ బోర్గియాగా పిలువబడే వాలెంటినో- రొమాగ్నాను ఆక్రమించాడు. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకొని కార్డినల్ రూయిన్ నాతో ‘ఇటాలియన్లు యుద్ధ కళని అర్థం చేసుకోలేదు’ అని అన్నాడు. నేను ఆ మాటకు ‘ఫ్రెంచి వారే రాజనీతిని అర్థం చేసుకోలేదు’ అని బదులిచ్చాను. ఎందుకంటే వారికి రాజనీతి పట్టుబడినట్లైతే చర్చిని అంతటి శక్తివంతమైన స్థానానికి ఎదగనిచ్చేవారు కాదు. ఇటలీలో చర్చి మరియు స్పెయిన్ దేశం శక్తివంతమైన స్థానాన్ని పొందడానికి కారణం ఫ్రాన్సు. తరువాత అవే చర్చి, స్పెయిన్‌లు ఫ్రాన్స్ నాశనానికి కారణమయ్యాయి. దీనిని బట్టి మనమొక తిరుగులేని సూత్రాన్ని రూపొందించవచ్చు. అదేమంటే ‘ఎవరైతే ఇతరులు శక్తివంతులవ్వడానికి కారకులౌతారో వారు తద్వారా తమ వినాశనాన్నే కొని తెచ్చుకుంటారు’. ఎందుకంటే ఇతరులకు గొప్పస్థానాన్ని కలుగజేయడానికి వారు తమకున్న తెలివితేటలనో లేక శక్తిసామర్థ్యాలనో ఉపయోగిస్తారు. ఈ రెంటిని కూడా ఆ మేలుబొందినవాడు విశ్వసించడు.


3, జులై 2010, శనివారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 2వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం - 2

అనువంశిక సంస్థానాల గురించి






ప్రాతినిథ్య ప్రభుత్వము (republic) ల గురించి వేరేచోట విస్తృతంగా రాయడం జరిగినది కనుక వాటి గురించిన చర్చను వదిలేసి సంస్థానాల చర్చ వరకే నేను పరిమితమౌతాను. పైన సంగ్రహంగా తెలిపిన విషయక్రమాన్ని విశదీకరిస్తూ ఈవిధమైన సంస్థానాలు ఏవిధంగా పరిపాలించబడతాయి, ఏవిధంగా సంరక్షించబడతాయి అనే విషయాల గురించి చర్చిస్తాను.

చిరకాలంనుండి రాజకుటుంబపు ఆధీనంలో ఉన్నటువంటి అనువంశిక రాజ్యాలను ఆధీనంలో ఉంచుకోవడంలో నూతన రాజ్యాలను ఆధీనంలో ఉంచుకోవడంలో కన్నా చాలా తక్కువ కష్టనష్టాలు ఎదురౌతాయని నేను చెబుతున్నాను. ఎందుకంటే అనువంశిక రాజ్యంలో రాజు తన పూర్వీకుల వ్యవహారశైలిని అనుసరిస్తే సరిపోతుంది. అంతకుమించి ఏమీ చేయవలసిన అవసరం లేదు. జరగబోయే సంఘటనలను ముందుగానే పసిగట్టి తగిన విధంగా వ్యవహరించగలిగే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా ఒక అసాధారణమైన, బలమైన శక్తి చేత తన రాజ్యాన్ని పోగొట్టుకుంటే తప్ప సాధారణమైన శక్తి సామర్థ్యాలు కలిగిన రాజు కూడా అనువంశికరాజ్యంలో తన స్థానాన్ని కాపాడుకోగలుగుతాడు. ఒకవేళ అలా పోగొట్టుకున్నా కూడా దురాక్రమణదారుడు ఏదేని ప్రతికూలతను ఎదుర్కొన్న సమయంలో దానిని తిరిగి సాధించుకోగలుగుతాడు.

ఊదాహరణకు ఇటలీలో Duke of Ferrara తన రాజ్యాన్ని చిరకాలంగా కలిగిఉన్న కారణంగానే అతని అధికారం సుస్థిరమై 1484 లో వెనెటియన్స్ దాడులను, 1510 లో పోప్ జూలియస్ దాడులను ఎదుర్కోగలిగాడు. ఒక అనువంశికమైన రాజు యొక్క జీవితంలో ప్రజలకు ఆగ్రహం కలిగించగలిగిన సందర్భాలు గానీ, కారణాలుగానీ పెద్దగా ఉండవు కనుక ఆ రాజు వారి ప్రేమకు సహజంగానే పాత్రుడౌతాడు. ఏవైనా అసాధారణమైన దుశ్చర్యలవలన అతను ప్రజాద్వేషానికి గురికానంతకాలం అతను ప్రజాభిమానానికి పాత్రుడౌతూనే ఉంటాడు. అంతేకాక అతని పరిపాలన యొక్క పురాతనత మరియు అవిచ్ఛిన్నత (antiquity and continuity) ఒకనాటి మార్పుయొక్క జ్ఞాపకాలనూ, ఉద్దేశాలను చెరిపివేస్తాయి. అయితే ఒకమార్పు మరోమార్పు తలయెత్తడానికి కావలసిన ప్రాతిపదికను ఎల్లవేళలా సిద్ధం చేస్తుంది.

(అనువాదకుడు: చిరకాలం నుండి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న రాజ్యలు కూడా ఒకనాడు కొత్తగా ఏర్పడినవే అనే విషయాన్ని ప్రజలు మరచిపోతారని ఈ అధ్యాయం చివరిలో తెలియజేస్తూ మాకియవెల్లి మానవస్వభావాన్ని గురించిన తనయొక్క అనేక పరిశీలనలలో మొట్టమొదటిదాన్ని పేర్కొంటున్నాడు.)



'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 1వ అధ్యాయం





రాజు - రాజ్యం



అధ్యాయం - 1

వివిధ రకాల సంస్థానాలు మరియు వాటిని పొందే విధానాలు





ప్రజలను గతంలో పాలించిన, ఇప్పుడు పాలిస్తున్న అన్ని రాజ్యాలూ, అన్ని అధికారాలు కూడా ప్రాతినిథ్య ప్రభుత్వాలు లేదా సంస్థానాలు (republics or principalities ) అని రెండు విధాలు.

సంస్థానాలు మరలా అనువంశికమైనవి (hereditary) లేదా నూతనమైనవి (new) అని రెండు విధాలు. అనువంశికమైన సంస్థానాలలో రాజ్యాధికారం రాజు యొక్క కుటుంబం చేతుల్లో చిరకాలంగా కొనసాగుతూ రాజుకి వంశపారంపర్యానుగతంగా సంక్రమిస్తుంది.

నూతనమైన సంస్థానం మరలా రెండు రకాలు. మొదటిది పూర్తిగా నూతనమైనది. మిలన్ సంస్థానాన్ని Francesco Sforza పొందడం ఈ విధమైనది. ఇక రెండవ రకం: అప్పటికే సంస్థానాధిపతి అనువంశికంగా కలిగి ఉన్న రాజ్యానికి నూతనమైన సంస్థానాలను సంపాదించి కలపడం. స్పెయిన్ రాజు నేపుల్స్ రాజ్యాన్ని కలుపుకోవడం ఈవిధమైనది.

ఈవిధంగా పొందబడిన సంస్థానాలకు సంస్థానాధిపతిని నియమించడమైనా జరుగుతుంది. లేదంటే అవి స్వతంత్రంగానైనా ఉంచబడతాయి. ఈ సంస్థానాలను Prince తన స్వంత సైన్యం ద్వారాగానీ, లేదా ఇతరుల సైన్యం ద్వారాగానీ జయిస్తాడు. అలాగే కాలం కలసి వచ్చి అదృష్టం వలన గానీ, లేదంటే తన శక్తి సామర్ధ్యాల ద్వారాగానీ సాధిస్తాడు.






2, జులై 2010, శుక్రవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' తెలుగు అనువాదం



రాజు-రాజ్యం


ఉపోద్ఘాతం:

‘ప్రోజెక్ట్ గుటెన్‌బర్గ్’ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పేరుతో చరిత్రలో ఇంతవరకూ ఆంగ్లభాషలో రచించబడిన లేదా ఆభాషలోకి అనువదించబడిన అనేకమంది ప్రఖ్యాతవ్యక్తులయొక్క వివిధరచనల పూర్తిపాఠాన్ని ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ప్రోజెక్ట్ అయిదారు సంవత్సరాల క్రిందట ప్రారంభించబడి శరవేగంతో ముందుకు పోతున్నది. దీనితో పాటుగా ‘ఇంటర్నెట్ ఆర్చివ్’ అనబడే మరో ప్రోజెక్ట్ కూడా ప్రారంభమై గతంలో ఆంగ్లంలో ప్రచురింపబడిన అనేక పాత గ్రంథాల యొక్క స్కానింగ్ కాపీలను అందుబాటులో ఉంచుతున్నది. ఈ రెండు ప్రోజెక్ట్‌ల వలన మనకు ఈరోజున కాపీరైట్‌లేని అనేక విలువైన రచనలు ఉచితంగా లభిస్తున్నాయి. ఈ రెండు ప్రోజెక్టులంత విస్తృతస్థాయిలో కాకపోయినా ఆంగ్లభాషలో ఇంకా అనేక ఇతర వెబ్‌సైట్లు కూడా మనకు కొన్ని ప్రఖ్యాత రచనలను ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నాయి.

మన తెలుగుభాషలో ఒక్కపుస్తకం యొక్క పూర్తిపాఠమైనా ఇలా నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటే బాగుండన్న ఆలోచన నాకు కలిగినది. అది కూడా ఏ తెలుగుగ్రంథమో అయితే అది మార్కెట్లోనో లేక మరోవిధంగానో లభిస్తుంది కనుక అలా దొరకని పరభాషాగ్రంథాన్నీ, విలువైన సమాచారం ఉన్న గ్రంథాన్నీ, నాకున్న సమయానికి సరిపడేటట్లుగా చిన్న గ్రంథాన్నీ, అలాగే కాపీరైట్ సమస్యలు లేని గ్రంథాన్నీ ఎంచుకోవాలనుకున్నాను. ఈ లక్షణాలన్నింటికీ తగినవిధంగా ఉన్న 15వ శతాబ్దపు ఇటాలియన్ రాజనీతిజ్ఞుడు మాకియవెల్లి యొక్క ప్రఖ్యాత రచన ‘ద ప్రిన్స్’ ఎంపిక చేశాను.

ఈ గ్రంథం మాతృక ఇటాలియన్ భాషలో రచించబడినది. నాకు ఆ భాష రాదు. కనుక దీని ఆంగ్లానువాదాన్ని తెలుగులోకి తర్జుమా చేయాలనుకున్నాను. ఇది 26 అధ్యాయాలు కలిగిన చిన్న గ్రంథం.

గ్రంథపరిచయం:

ఇది జగత్‌ప్రసిద్ధిచెందిన ఒక విశిష్టమైన రాజనీతిశాస్త్ర గ్రంథం. ప్రపంచ రాజకీయాలమీద ఎనలేని ప్రభావాన్ని చూపి ఆధునికరాజకీయాలకు పునాది వేసినటువంటిది. ఇందులోని విషయాలు ఎంతైనా తెలుసుకోదగ్గవి. ఇది సగటు మానవుడు తలదాల్చే ఆశయాలతో, అలాగే సాధారణ సాంప్రదాయక రచయితలు బోధించే నీతులు, ఆదర్శాలతో కూడుకున్న ఆచరణసాధ్యంకాని పంచదారపలుకులున్న గ్రంథం కాదు. జీవన గమనంలో మానవుడు తన మనుగడకోసం అనుసరించకతప్పని చేదునిజాలను, కఠిన వాస్తవాలను వివరించిన గ్రంథం.

ఈ గ్రంథం మీద అనేక అపోహలు, దురభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ నిజంకాదు. ఎందుకంటే మనుషులను చిలకపలుకులు, తప్పుడు మాటలు, మోసపూరితమైన మాటలు ఆకట్టుకున్నంతగా, వాస్తవాలు ఆకట్టుకోలేవు. ఎవరికైనా నిజం చెబితే నిష్టూరంగానే ఉంటుంది. ఈ అపోహలన్నింటికీ కారణం అది మాత్రమే. ఈ గ్రంథంలో బోధించినది లౌక్యం, వ్యవహార దక్షత, రాజకీయ దక్షత మాత్రమే.

ఈ గ్రంథం మీద దురభిప్రాయాలు తలయెత్తడానికి మరో ముఖ్యకారణం ఇందులోని బోధనలు విజేతలు అనుసరించే విధానాలవడంతో సహజంగానే ఆ విధానాలను పరాజితజాతులు ద్వేషించడం జరిగినది. కానీ ఇది సరియైన పద్దతికాదు. విజేతలలో ఉన్న లక్షణాలు తమలో లేకపోవడం వలనే తాము పరాజితులుగా మిగిలిపోవలసి వచ్చింది అన్న విషయాన్ని వీరు గ్రహించాలి. అనుసరించదగిన విధానాలు ఎవ్వరివద్ద ఉన్నాకూడా అవి నేర్చుకోవలసినదే. అది తమను జయించిన వారైనాసరే. అప్పుడే తాముకూడా విజయపథంలో నడవగలరు. అందుకే ఈ గ్రంథం లోని విషయాలను భారతీయులవంటి పరాజితజాతులు తప్పనిసరిగా తెలుసుకొని తమ ఆలోచనావిధానాన్ని తగినవిధంగా మార్చుకోవలసిన అవసరం ఉన్నది.

మాకియవెల్లి పరిచయం:

మాకియవెల్లి (1469-1527) ఇటలీదేశపు రాజనీతిజ్ఞుడు మరియు రచయిత. ఈయనను అనేకమంది ‘ఆధునిక రాజనీతిశాస్త్ర పితామహుడు’ గా భావిస్తారు. ఐరోపాలో 14వ మరియు 17వ శతాబ్దాల మధ్యన గొప్పగా మేధోవికాసం జరిగిన సాంస్కృతిక పునరుజ్జీవన కాలపు అత్యంత ప్రముఖ రాజనీతివేత్తలలో ఒకడిగా ఈయన స్థానం పొందాడు. ఈయన ఒక ప్రభుత్వాధికారిగా అనుభవాన్ని గడించడం మరియూ చరిత్రను అధ్యయనం చేయడం అనేవి ఈయన రాజకీయాలను ఒక కొత్తకోణంలో చూడటానికి దారితీసాయి. మధ్యయుగపు రాజకీయ రచయితలందరూ రాజకీయాలను మతం యొక్క పరిధిలో ఆదర్శవంతమైనవిగా పరిగణించారు. కానీ మాకియవెల్లి రాజకీయాలను మానస్వభావం ఆధారంగా చరిత్ర యొక్క పరిధిలో వాస్తవదృష్టితో వివరించాలని కోరుకున్నాడు.

మాకియవెల్లి తన ఆలోచనలలో చాలా వాటిని ‘ద ప్రిన్స్’ అనే ఈ ప్రఖ్యాత గ్రంథంలోనే వివరించాడు. ఇది 1513 లో రచించబడి మాకియవెల్లి మరణించిన 5 సంవత్సరాల తర్వాత 1532 లో ప్రచురింపబడింది. ఈ గ్రంథం ఒక రాజు తాను శక్తివంతుడిగా రూపొందటం కొరకూ; అలానే తన రాజ్యాన్ని బలమైనదిగా రూపొందించడం కొరకు అనుసరించవలసిన విధానాలను వివరిస్తుంది.

మాకియవెల్లిని కొందరు అర్థశాస్త్ర రచయిత అయిన మన చాణక్యునితో పోలుస్తారు. ఒక రాజు తన రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి ఇతర విధానాలన్నీ విఫలమైనపుడు క్రూరత్వం, మోసం, బలవంతం లాంటి వాటిలో అవసరమైన ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చని మాకియవెల్లి బోధించాడు. ఫలితంగా అనేకమంది ఇతను రాజకీయాలలో క్రూరత్వాన్నీ, మోసాన్నీ ప్రోత్సహించాడని భావించారు. చాణక్యుని మరోపేరైన కౌటిల్యుడు నుండి భారతీయభాషలలో ‘కౌటిల్యం’, ‘కుటిలత్వం’ లాంటిపదాలు ఎలా వచ్చాయో అలానే ఆంగ్లంలో ‘మాకియవెల్లియన్’ అనే పదం జిత్తులమారితనానికీ, కుట్రపూరిత స్వభావానికీ పర్యాయపదమైపోయింది.