28, అక్టోబర్ 2010, గురువారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్' 16వ అధ్యాయం





రాజు - రాజ్యం



అధ్యాయం - 16

ఉదారత మరియు లోభితనం గురించి






ఇప్పుడు పైన చెప్పబడిన లక్షణాలలో మొదటి దానితో ప్రారంభిస్తూ ఉదారత కలిగిన వారిగా ప్రఖ్యాతి పొందటం మంచిదే అని నేను చెబుతాను. అయితే ఉదారుడిగా ప్రఖ్యాతిని పొందలేని విధానంలో నీవు ఉదారతను ఆచరిస్తే అది నీకు హానికరం. ఎందుకంటే ఎవరైనా ఉదారతను నిజాయితీగా మరియు దానిని ఆచరించవలసిన విధానంలో ఆచరిస్తే అది ఇతరులకు తెలియకపోవడం వలన అందుకు వ్యతిరేకమైన (పిసినారి అనే) నిందను తప్పించుకోలేవు. కనుక ఉదారుడిగా ప్రజలలో పేరుపొందాలని కోరుకునే ఎవరైనా వైభవాన్ని, విలాసాన్ని ప్రదర్శించక తప్పదు. ఫలితంగా, అలా కోరుకునే రాజు అటువంటి కార్యాలకు తన సంపదనంతా వినియోగించి, --ఇంకా ఉదారుడు అనే పేరు నిలుపుకోవాలని అతడు కోరుకుంటుంటే-- చివరికి, ప్రజలమీద అక్రమంగా భారాన్ని మోపే విధంగా వత్తిడి చేయబడి, వారిమీద పన్నులు విధిస్తాడు. ఇంకా ధనాన్ని పొందటానికి అతడు చేయగలిగిన ప్రతీపనీ చేస్తాడు. ఇదంతా అతని ఎడల ప్రజలలో ద్వేషం కలుగచేస్తుంది. పేదవాడిగా మారిపోవటం వలన అతని కెవ్వరూ విలువనివ్వరు. ఆ విధంగా తన ఉదారతతో కొద్దిమందిని సంతోష పెట్టి, అనేక మందికి ఆగ్రహం తెప్పించడంతో, అతడు తాను యెదుర్కొనే మొట్టమొదటి కష్టంతోటే సతమతమైపోతాడు, మొదటి ప్రమాదానికే కృంగిపోతాడు. ఈ విషయాన్నంతా గ్రహించినమీదట, దానినుండి వెనుకకు మరలాలలనే ప్రయత్నంలో పిసినారితనం అనే నిందలో చాలా త్వరగా కూరుకుపోతాడు.

రాజు తాను కష్టాలపాలవటానికి సిద్ధమైతే తప్ప -ఇతరుల గుర్తింపు పొందేవిధంగా ఉదారత అనే నీతిని ఆచరించలేని స్థితిలో ఉంటాడు కనుక- అతనికి వివేకం ఉన్నట్లైతే పిసినారి అనే పేరు పొందడానికి భయపడకూడదు. ఎందుకంటే అతడు కాలక్రమంలో తాను ఉదారుడిగా ప్రవర్తించిన దానికన్నా ఎక్కువగా పరిగణించబడతాడు. దీనికి కారణం పొదుపు మూలంగా అతనికి ఆదాయం సరిపడినంతగా ఉంటుంది. దానివలన అతడు తన రాజ్యంమీద దండెత్తేవారిని స్వయంగా ఎదుర్కోగలుగుతాడు. అలాగే యుద్ధాలను ప్రజలమీద పన్నులు విధించకుండానే నడపగలుగుతాడు. అంటే ఎలా చెప్పవచ్చంటే ఎవరి నుండి ఏమీ తీసుకోడో, వారి అందరి యెడల ఇతడు ఉదారంగా ఉన్నట్లే. వీరు సంఖ్యలో లెక్కకు మిక్కిలిగా ఉంటారు. ఎవరికి ఇతడు ఏమీ ఇవ్వడో, వారి యెడల ఇతడు పిసినారితనాన్ని ఆచరించినట్లుగా చెప్పవచ్చు. వీరు సంఖ్యలో కొద్దిమందే ఉంటారు.

పిసినిగొట్టుగా (లోభి) పేరుపొందిన వారి వలన తప్ప మన కాలంలో మరెవరి వలనా ఘన కార్యాలు జరిగినట్లు మనం చూడలేదు. వారు తప్ప మిగతా వారంతా వైఫల్యాన్నే చవి చూశారు. పోప్ జూలియస్II పోప్ అవడం కొరకు ఉదారుడిగా తనకున్న ప్రఖ్యాతిని అడ్డు పెట్టుకున్నాడు. కానీ పోప్ అయిన తరువాత దానిని నిలుపుకోవడానికి అతడు కృషి చేయలేదు, ఫ్రాన్సు రాజు మీద యుద్ధం చేసినపుడు అతడు తన ప్రజల మీద అధిక పన్నులు వేయకుండానే అనేక యుద్ధాలను చేశాడు. ఎందుకంటే అతనికున్న అదనపు ఖర్చులకు కావలసిన ధనాన్ని అతడు తను దీర్ఘకాలం ఆచరించిన పొదుపు ద్వారా సమకూర్చుకున్నాడు. ఇప్పటి స్పెయిన్ రాజు ఒకవేళ ఉదారుడిగా కనుక పేరు పడి ఉంటే అన్ని యుద్ధాలను చేయగలిగేవాడే కాదు, వాటిలో గెలిచేవాడే కాదు. కనుక ఒక రాజు తన అనుచరులను దోచుకోకుండా ఉండటానికీ, తనను రక్షించుకోవడానికీ, తాను పేదరికానికీ, చులకనకూ లోనుకాకుండా ఉండటానికీ, దురాశాపరుడిగా మారవలసిన అగత్యం లేకుండా చేసుకోవడానికీ… ఇలా వీటన్నింటి కొరకు లోభిగా పేరుపొందడానికి సంకోచించకూడదు. ఎందుకంటే తాను పరిపాలన సాగించడానికి సహాయపడే దుష్ట కార్యాలలో (vices) అది ఒకటి.

సీజర్ ఉదార గుణం వలననే సామ్రాజ్యన్ని పొందగలిగాడు. అలానే అనేకమంది ఇతరులు ఉదారంగా ఉండటం వలన మరియు ఆ విధంగా పరిగణింపబడటం వలనే అత్యున్నత స్థానాలకు చేరుకున్నారని ఎవరైనా అన్నట్లైతే దానికి నా సమాధానం: నిజంగా నీవు రాజువైనా లేక రాజు కావడనికి ప్రయత్నిస్తున్న వాడివి అయినా సరే. మొదటి పరిస్థితిలో ఈ ఉదార గుణం చాలా ప్రమాదకరం. రెండవ పరిస్థితిలో ఉదారంగా పరిగణించబడటం చాలా అవసరం. సీజర్ రోమ్ మొత్తంలోనే సర్వోన్నతుడిగా (చక్రవర్తిగా) రూపొందాలని అభిలషించిన వారిలో ఒకడు. కానీ అలా అయిన తరువాత అతడు ఖర్చులను అదుపులో ఉంచకుండా జీవించినట్లైతే అతడు తన ప్రభుత్వాన్ని నాశనం చేసుకొని ఉండేవాడు. దీనికి ఎవరైనా ఇలా బదులిస్తే: ఎందరో రాజులు ఉన్నారు. వారంతా ఉదారులుగా పరిగణింపబడుతూనే సైన్యంతో ఎన్నో ఘనకార్యాలు చేశారు. దీనికి నా బదులు: ఒక రాజు తనకు మరియు తన అనుచరులకు చెందిన దానిని ఖర్చు చేస్తాడు లేక ఇతరులకు చెందిన దానినైనా ఖర్చు చేస్తాడు. మొదటి పరిస్థితిలో అతడు చాలా పొదుపుగా ఉండాలి, రెండవ పరిస్థితిలో ఉదారంగా ఉండే ఏ అవకాశాన్ని అతడు వదులుకోకూడదు. ఏ రాజైతే తన సైన్యాన్ని దోపిడీలు, లూటీలు, బలవంతపు వసూళ్ళ ద్వారా పోషిస్తూ ముందుకు నడిపిస్తుంటాడో -ఇతరులకు చెందిన ధనం అతడి వద్ద ఉంటుంది కనుక- అతడికి ఈ ఉదారగుణం అవసరం. లేదంటే సైనికులు అతడిని అనుసరించరు. ఏదైతే నీది, నీ అనుచరులది కాదో దానిని నీవు సులువుగా ఇచ్చివేయవచ్చు …సైరస్, సీజర్, అలెగ్జాండర్ మాదిరిగా. ఎందుకంటే ఇతరులకు చెందిన దానిని విచ్చలవిడిగా పంచిపెట్టడం వలన నీకున్న ప్రఖ్యాతి పోదు, పైగా ఇంకా పెరుగుతుంది. నీ స్వంత ధనాన్ని విచ్చలవిడిగా పంచిపెట్టడం మాత్రమే నీకు నష్టదాయకం.

ఉదారత అంత త్వరగా వృధా అయిపోయే లక్షణం మరోటిలేదు. ఎందుకంటే నీవు దానిని ఆచరించే సమయంలోనే అలా ఆచరించగల సామర్థ్యాన్ని కోల్పోయి, పేదరికాన్నీ మరియు అగౌరవాన్నీ మూటగట్టుకుంటావు, లేదంటే ఆ పేదరికాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో దోపిడీదారుడిగా మారి ద్వేషాన్నైనా మూటగట్టుకుంటావు. రాజనేవాడు అన్నిటి కన్నా ముఖ్యంగా అగౌరవానికీ, ద్వేషానికీ గురికాకుండా తనను కాపాడుకోవాలి. ఉదారత ఈ రెంటికీ నీవు గురయ్యేటట్లు చేస్తుంది.

కనుక ఉదారుడుగా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటంలో దోపిడీదారుడనే చెడ్డ పేరునూ, దానితో పాటు ద్వేషాన్నీ కొనితెచ్చుకునేకన్నా, పిసినారి అనే పేరు తెచ్చుకోవడం వివేకం. ఎందుకంటే ఇది చెడ్డపేరును మాత్రమే తెస్తుంది కానీ ద్వేషానికి గురిచేయదు.






'మాకియవెల్లి-ద ప్రిన్స్' 15వ అధ్యాయం




రాజు - రాజ్యం




అధ్యాయం - 15
 
వ్యక్తులు, ముఖ్యంగా రాజులు ప్రసంశలు పొందటానికి లేక నిందలు మోయడానికి కారణమయ్యే విషయాల గురించి






ఒక రాజు తన అనుచరులతో మరియు మిత్రులతో (subject and friends) మెలగవలసిన విధానం ఎలా ఉండాలన్నది తెలిసుకోవడం ఇప్పుడు మిగిలి ఉన్నది. అనేకమంది ఈ అంశం గురించి రాశారనే విషయం నాకు తెలుసు కనుక, దీనిని నేను మరలా చెప్పడం, --మరి ముఖ్యంగా ఈ విషయం గురించి చర్చించేటపుడు నేను ఇతరులు చెప్పిన దానితో విభేదించడం-- అనేది తెగువగా పరిగణింపబడుతుందని నేను భావిస్తాను. అయితే, అర్థం చేసుకునే వారికి ఉపయోగకరం గా ఉండే విషయం గురించి రాయడం నా ఉద్దేశ్యం కనుక, ఒక విషయం గురించి ఊహలు చేయడం కన్నా, దాన్ని గురించిన వాస్తవాలను, నిజాలను అనుసరించడం మరింత సముచితంగా నాకు కనపడుతున్నది. ఎందుకంటే అనేక మంది రిపబ్లిక్‌ల గురించి, సంస్థానాల గురించి ఎంతో వర్ణించారు కానీ, వాస్తవంలో ఎన్నడూ, ఎవరూ వాటిని ఆ విధంగా కనలేదు, వినలేదు. ఎందుకంటే ఒకవ్యక్తి ‘ఏ విధంగా జీవించాలి’ అన్నదానికీ, ‘ఏ విధంగా జీవిస్తాడు’ అన్నదానికీ చాలా భేదం ఉంటుంది. ఎవరైతే ‘ఏమి జరిగితే బాగుంటుంది’ అన్నదాని కొరకు ‘ఏమి జరిగింది’ అన్నదానిని నిర్లక్ష్యం చేస్తారో అతడు తనను రక్షించుకోవడనికి బదులుగా త్వరలోనే వినాశనానికి దగ్గరౌతాడు. ఎందుకంటే ఎవరైతే ప్రతీ విషయంలోనూ పూర్తి ఆదర్శవంతంగా, పూర్తి మంచిగా ఉండాలని కోరుకుంటారో వారు అనేక మంది చెడ్డవారి మధ్యన త్వరలోనే పతనమైపోతారు.

దీనిని బట్టి తన స్థానాన్ని నిలుపుకోవాలనుకునే రాజెవరికైనా చెడుగా ఎలా ఉండాలో కూడా తెలిసి ఉండవలసిన అవసరం ఉన్నది. అవసరాన్ని బట్టి ఆవిధంగా ఉండాలా లేక ఉండకూడదా అన్నది కూడా తెలిసి ఉండాలి. కనుక ఒక రాజుకు సంబంధించిన ఊహాత్మకమైన విషయాలన్నింటినీ పక్కనబెట్టి వాస్తవమైన వాటినే చర్చిస్తూ నేను ఓ విషయం చెబుతాను. మనుషులెవరి గురించైనా మనం మాట్లాడేటపుడు -మరీ ముఖ్యంగా రాజుల గురించి, ఎందుకంటే వారు చాలా ఉన్నత స్థానంలో ఉంటారు గనుక- వారికి అపనిందనో లేక ప్రశంసనో కలుగజేసే ప్రత్యేక లక్షణాలను కలిగిన వారిగా వారిని మనం గుర్తిస్తాము. ఈ విధంగా ఒక మనిషి ఉదారుడుగా ప్రఖ్యాతిని పొందుతాడు. మరో మనిషి పిసినారిగా పేరు పొందుతాడు (పేరాశపరుడుకు బదులు పిసినారి అనే పదం ఎందుకు వాడానంటే పేరాశ కలిగినవాడు ధనం మీద వ్యామోహంతో ఇతరుల సొమ్మును సైతం కాజేయలని చూస్తాడు. కానీ పిసినిగొట్టు అదే ధన వ్యామోహంతో తన సొమ్మును ఖర్చు చేయకుండా మాత్రమే ఉంటాడు). ఒక మనిషి దానగుణానికి పేరుపొందుతాడు, మరో మనిషి దోపిడీదారుడుగా పేరుపొందుతాడు. ఒకడు క్రూరుడు, మరొకడు దయామయుడు. ఒకడు నమ్మదగిన మనిషి, మరొకడు నమ్మదగని మనిషి. ఒకడు పిరికి వాడు, మగటిమి లేనివాడు, మరొకడు ధైర్యసాహసాలు కలిగినవాడు. ఒకడు సౌజన్యమూర్తి, మరొకడు గర్విష్ఠి. ఒకడు కాముకుడు, మరొకడు నీతివర్తనుడు. ఒకడు అమాయకుడు, మరొకడు జిత్తులమారి. ఒకడు స్థిరచిత్తుడు, మరొకడు చంచలుడు. ఒకడు గంభీరంగా ఉంటాడు, మరొకడు చిలిపిగా ఉంటాడు. ఒకడు ఆస్తికుడు, మరొకడు నాస్తికుడు… ఇలా ఉంటారు. పైన తెలిపిన లక్షణాలలో మంచివాటన్నింటినీ ఒక రాజు గనుక ప్రదర్శించగలిగితే, అది ఎంతో ప్రశంసనీయంగా ఉంటుందనే విషయం అందరూ ఒప్పుకుంటారని నాకు తెలుసు. కానీ, ఆ లక్షణాలన్నింటినీ కలిగి ఉండటం గానీ, వాటిని ఆచరించడం గానీ –మానవ పరిస్థితులు అందుకు వీలు కల్పించవు కనుక- సాధ్యం కాదు. కనుక తన రాజ్యాన్ని కోల్పోయేంతగా అపఖ్యాతిని తెచ్చిపెట్టే దుష్టకార్యాలకు దూరంగా ఎలా ఉండాలో -తెలుసుకోగలిగే వివేకాన్ని తగినంతగా కలిగి ఉండటం- ఒక రాజుకు అవసరం. సాధ్యమైతే రాజ్యం కోల్పోయేంత ప్రమాదంలేని దుష్టకార్యాలకు కూడా దూరంగా ఉండటం మంచిదేకానీ, అంత నిబద్ధతగా ఉండటం సాధ్యంకాదు కనుక, వాటిని నిస్సంకోచంగా ఆచరించవచ్చు. ఏ దుష్టకార్యాలు చేయకపోతే రాజ్యసంరక్షణ కష్టసాధ్యమౌతుందో వాటిని చేయడం మూలంగా వచ్చిపడే నిందను మోయడానికి రాజు వెనకాడవలసిన అవసరంలేదు. ఎందుకంటే అన్ని విషయాలు జాగ్రత్తగా పర్యాలోచించబడినట్లైతే, పైకి నీతివలే కనిపించే విషయాన్ని ఆచరించినట్లైతే, అది అతని యొక్క పతనానిని కారణమౌతుందనీ, అదే సమయంలో పైకి దుష్టకార్యంగా కనిపించే మరేదైనా విషయాన్ని ఆచరించినట్లైతే అది ఆ రాజుకు భద్రతను, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందనీ మనకు బోధపడుతుంది.


'మాకియవెల్లి-ద ప్రిన్స్' 14వ అధ్యాయం





రాజు - రాజ్యం



అధ్యాయం - 14

సైనిక వ్యవహారాలకు సంబంధించి రాజు యొక్క విధుల గురించి






ఒక రాజుకు యుద్ధము, దాని నియమాలు మరియు దానికి కావలసిన శిక్షణ కన్నా వేరుగా మరే ఇతర లక్ష్యం గానీ, ఆలోచన గానీ ఉండకూడదు. అలాగే తన అధ్యయనానికి దానిని తప్ప మరే ఇతర విషయాన్ని ఎంచుకోకూడదు. ఎందుకంటే పరిపాలన సాగించే వానికి సంబంధించిన ఒకేఒక్క కళ యుద్ధమే కనుక. అంతేకాక ఇది జన్మతః రాజులైన వారిని తమ స్థానంలో కొనసాగేటట్లు చేయడమేకాక, అనేక సందర్భాలలో మామూలు వ్యక్తులు కూడా ఆ స్థానాన్ని పొందడాన్ని సాధ్యంచేసే ఒక శక్తి. దీనికి విరుద్ధంగా ఎవరైనా రాజులు యుద్ధం కన్నా విశ్రాంతికి అధిక ప్రాధాన్యమిస్తే, వారు తమ రాజ్యాలను కోల్పోవటాన్ని మనం చూడవచ్చు. నీవు రాజ్యాన్ని కోల్పోవడానికి ప్రధమకారణం ఈ కళను నిర్లక్ష్యం చేయడమే; అలాగే నీవు ఒక రాజ్యాన్ని పొందడాన్ని సాధ్యం చేసేది ఏమిటంటే అది ఈ కళలో ప్రావీణ్యమే. ఫ్రాన్సెస్కో స్ఫోర్జా (Francesco Sforza) తను యోధుడవటం ద్వారా సాధారణ స్థితి నుండి Duke of Milan గా రూపొందాడు. అతని కొడుకులు యుద్ధంలోని పరిశ్రమకు, కష్టానికి దూరంగా ఉండి రాజులనుండి సామాన్యులుగా మారిపోయారు. యుద్ధ ప్రావీణ్యత లేకపోవడం వలన కలిగే ఇతర నష్టాలలో ఒకటి నీవు చులకనై పోవడం. ఒక రాజు తాను గురికాకుండా –ఇప్పుడు వివరించబోతున్నట్లుగా- జాగ్రత్త పడవలసిన అగౌరవాలలో ఇది ఒకటి. యుద్ధ ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, అటువంటి ప్రావీణ్యత లేని వ్యక్తి ఏ విషయంలోనూ ఒకరికి తగినట్లుగా మరొకరు ఉండరు. ఒక యోధుడు యుద్ధ ప్రావీణ్యత లేని వ్యక్తికి విధేయుడై ఉండాలనటం, లేకపోతే యుద్ధప్రావీణ్యత లేనివ్యక్తి అటువంటి ప్రవీణత కలిగిన సేవకుల మధ్యన సురక్షితంగా ఉండాలనడం సహేతుకం కాదు. ఎందుకంటే ఒకరిలో ధిక్కారం ఉంటుంది, మరొకరిలో అనుమానం ఉంటుంది. ఇటువంటి ఇరువురు కలసి పనిచేయడం సాధ్యమయ్యే పని కాదు. కనుక యుద్ధకళను అర్థంచేసుకోని రాజు ఇప్పటికే తెలిపిన ఇతర దురదృష్టాలతోపాటుగా తన సైనికులచే గౌరవింపబడలేడు, అలాగే ఆ సైనికుల మీద ఆధారపడనూలేడు. కనుక అతడు యుద్ధమనే అంశం తన ఆలోచనలలో లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. అలాగే యుద్ధసమయంలో కన్నా శాంతి సమయంలోనే దాని అభ్యాసానికి మరింతగా తనను అంకితం చేసుకోవాలి. ఈ అభ్యాసాన్ని అతడు రెండు మార్గాలలో చేయగలడు. ఒకటి సాధన (కార్యాచరణ) ద్వారా, రెండవది అధ్యయనం ద్వారా.

సాధనకు సంబంధించి అతడు అన్నిటికన్నా ముఖ్యంగా తన సైనికులను మంచి క్రమశిక్షణ కలిగిన వారిగా, సుశిక్షితులైన వారిగా తీర్చిదిద్దటమే కాక తాను నిరంతరం వేటలో పాల్గొంటూ ఉండాలి. దీనివలన అతడి శరీరం కఠిన పరిశ్రమకు అలావాటుపడుతుంది, ఆయా ప్రాంతాల స్వభావాన్ని ఎంతోకొంత తెలుసుకుంటాడు, పర్వతాలు ఏ విధంగా పైకెగసి ఉంటాయి, లోయలు ఏ విధంగా ప్రారంభమవుతాయి, మైదానాలు ఏ విధంగా విస్తరించి ఉంటాయి మొదలైన విషయాలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. నదుల యొక్క మరియు చిత్తడినేలల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు. అలానే వీటన్నింటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుంటాడు. ఈ పరిజ్ఞానం రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. మొదటగా, ఇతడు తన దేశం గురించి తెలుసుకోవడం నేర్చుకుని, దానిని మరింత సమర్థవంతంగా కాపాడుకుంటాడు. తరువాత, ఆ ప్రాంతం యొక్క పరిజ్ఞానం మరియు పరిశీలన ద్వారా అతడికి అటుపిమ్మట ఏ ఇతర ప్రాంతాన్ని అధ్యయనం చేయటం అవసరమైనా, దానిని అతడు చాలా సులువుగా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే, ఒకప్రాంతంలోని -ఉదాహరణకు టస్కనీ లోని- కొండలు, లోయలు, మైదానాలు, నదులు మరియు చిత్తడినేలలు ఇతర దేశాలలోని వాటినే పోలి ఉంటాయి. కనుక వీటికి సంబందించిన ఒక దేశపు పరిజ్ఞానంతో ఎవరైనా చాలా సులువుగా ఇతర దేశాల పరిజ్ఞానాన్ని పొందవచ్చు. ఈ నైపుణ్యం లేని రాజు ఒక నాయకుడు కలిగి ఉండవలసిన అతిముఖ్యమైన లక్షణం లేనివాడుగా ఉంటాడు. ఎందుకంటే ఈ పరిజ్ఞానం అతనికి తన శత్రువును ఆశ్చర్యపరచడాన్ని, శిబిరాలను ఏర్పాటుచేయడాన్ని, సైన్యానికి నేతృత్వం వహించడాన్ని, యుద్ధాన్ని క్రమబద్దీకరించడాన్ని, పట్టణాలను సానుకూలంగా ముట్టడించడాన్ని నేర్పుతుంది.

(టస్కనీ అనునది ఇటలీలోని ఒక ప్రాంతం)

ఫిలోపోయెమెన్ (Philopoemen) ఏచియన్స్ యొక్క రాజు. ఇతడి గురించి చరిత్రకారులు చేసిన ఇతర ప్రశంసలకు తోడుగా మరో ప్రశంస ఏమిటంటే ఇతడు శాంతి సమయంలో తన మనస్సులో యుద్ధనియమాల గురించిన ఆలోచనలు తప్ప అన్యమేమీ కలిగి ఉండేవాడు కాడు. ఇతడు దేశంలో తన స్నేహితులతో ఉన్నపుడు తరచుగా ఆగి, వారితో ఈ విధంగా చర్చించేవాడు. “ఒకవేళ మన శత్రువు కొండమీద ఉండి, అదేసమయంలో మనం ససైన్యంగా ఇక్కడ ఉంటే పరిస్థితి ఎవరికి సానుకూలంగా ఉంటుంది? ఏ విధంగా మనం -సరైన శ్రేణీ క్రమాన్ని పాటిస్తూ, సురక్షితంగా పురోగమించి- శత్రువును చేరాలి? మనం తిరోగమించాలనుకుంటే, ఏ దిశలో వెళ్ళాలి? ఒకవేళ శతృవు తిరోగమిస్తే, మనం వారిని ఏలా వెంబడించాలి?” …ఆ విధంగా చర్చజరిగేకొలదీ సైన్యం ఎదుర్కోవడానికి అవకాశమున్న అన్ని పరిస్థితులను అతడు వాళ్ళ ముందుంచుతాడు. వాళ్ళ అందరి అభిప్రాయాలు విన్న మీదట, తన అభిప్రాయాన్ని ప్రకటించి, దానిని తగిన కారణాలతో నిర్థారణ చేస్తాడు. ఈ విధమైన నిరంతర చర్చల వలన యుద్ధ సమయంలో అతడు ఎదుర్కోలేని పరిస్థితులు ఎన్నడూ తలయెత్తేవి కావు.

(Philopoemen- born 252 B.C., died 183 B.C.)

మేథో పరిశ్రమ (మానసిక శిక్షణ) కొరకు రాజు చరిత్రలను చదవాలి. పేరు పొందిన వ్యక్తులు యుద్ధంలో ఎలా వ్యవహరించారో తెలుసుకోవడానికీ, వారి గెలుపోటములకు కారణాలను పరీక్షించడానికీ, వారి కార్యాలను అక్కడ అధ్యయనం చేయాలి. దీనివలన మనం ఓటమికి గురిచేసే కారణాలకు దూరంగా ఉండి, గెలుపునందించే కారణాలను అనుకరించవచ్చు. వీటన్నింటినీ మించి గొప్పవ్యక్తులందరూ చేసినట్లుగా నీవు కూడా చేయి. అదేమంటే వారు తమకు నమూనాగా --ఎవరు తమ కన్నా ముందు ప్రఖ్యాతిని మరియు ప్రశంసను పొంది ఉంటారో, అలాగే ఎవరు సాధించిన విజయాలను, చేసిన పనులను వారు తమ మనసులో నిరంతరం పెట్టుకుంటారో, అటువంటి వ్యక్తిని-- ఎంచుకుంటారు. ఎలా అంటే ఎచిల్లిస్‌ను అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్‌ను సీజర్, సైరస్‌ను సిపియో తమ నమూనాగా ఎంచుకుని అనుకరించినట్లుగా. గ్జినోఫోన్ చే రచించబడిన సైరస్ జీవిత చరిత్రను పఠించిన తదుపరి ఎవరైనా --సిపియో జీవితంలో ఈ అనుకరణ ఎంతో వైభవాన్ని తెచ్చిందనీ, అలాగే గ్జినోఫోన్ తన రచనలో సైరస్ గుణాలుగా చెప్పిన నైతిక పరిశుద్ధత, సౌజన్యం, మానవత్వం, ఉదారత మొదలైన లక్షణాలన్నింటినీ సిపియో కూడా కలిగి ఉన్నాడనీ-- తెలుసుకుంటారు.

వివేకం కలిగిన రాజు ఇటువంటి నియమాలను కొన్నింటిని పాటించవలసి ఉన్నది. శాంతి సమయాలలో ఎన్నడూ విశ్రమించక, కష్టసమయంలో ఉపయోగపడే విధంగా తన వనరులను పరిశ్రమతో పెంపొందించుకోవాలి. దానివలన, ఒకవేళ దురదృష్టం వెంటాడినట్లైతే ఆ దెబ్బలను అతడు తట్టుకోగలిగే పరిస్థితిలో ఉంటాడు.



25, అక్టోబర్ 2010, సోమవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్' 13వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం - 13 

సహాయ సైన్యం, మిశ్రమ సైన్యం మరియు స్వంత సైన్యాల గురించి






మరోరకం ఉపయోగం లేని సైన్యాలు, సహాయ సైన్యాలు (auxiliaries ); ఇవి నీవు సహాయం కొరకు పిలిచిన రాజుచేత నీ సహాయార్ధం మరియు రక్షణార్ధం తీసుకురాబడతాయి. ఇటీవలి కాలంలో పోప్ జూలియస్ II ఫెర్రారా యుద్ధంలో తన కిరాయి సైన్యాలయొక్క పేలవమైన ప్రదర్శనను గమనించి, సహాయక సైన్యాలను పొందదలచి, స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ తో సైన్యాన్ని పంపే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. ఈ విధమైన సహాయ సైన్యాలు మౌలికంగా ఉపయోగకరమైనవి, మంచివి అయితే అవవచ్చు, ఐతే వాటిని ఆహ్వానించిన వానికి మాత్రం అవి ఎల్లప్పుడూ హానికరమైనవే. ఎందుకంటే అవి ఓడిపోతే అతడు నాశనమౌతాడు, గెలిస్తే వాటికి బందీ అవుతాడు.

ప్రాచీన చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నప్పటికీ, ఇంకా మన మనసుల నుండి చెరిగిపోని పోప్ జూలియస్ II కు చెందిన ఇటీవలి కాలపు ఉదాహరణను దాటిపోను. అతడు ఫెర్రారాను పొందాలనే ఆతురతలో ఒక విదేశీయుడి చేతులలో చిక్కుకున్నాడు. అయినప్పటికీ అతడి అదృష్టం అతడిని రక్షించడంతో, తన అనాలోచిత ప్రవర్తన యొక్క ఫలాన్ని అతడు పొందలేదు. ఎలా అంటే అతడి యొక్క సహాయ సైన్యాలు రవెన్నా వద్ద ఓడింపబడగానే, -ఇతడు గానీ, ఇతరులు గానీ అనుకోని విధంగా- స్విట్జర్లాండ్ సైన్యాలు హఠాత్తుగా తలయెత్తి విజేతను తరిమివేశాయి. ఈ విధంగా అతడు తన శత్రువులకు -వారు పారిపోవడం వలన– బందీ అవలేదు, అలాగే తన సహాయసైన్యాలకు కూడా బందీ అవలేదు. ఎందుకంటే విజయం వారివలన కాక మరో సైన్యం వలన సిద్ధించింది కనుక.

ఫ్లోరెంటైన్స్ తమకు స్వంత సైన్యాలు అనేవి అసలు లేకపోవడం వలన పీసాను జయించడానికి పదివేల మంది ఉన్న ఫ్రెంచ్ బలగాన్ని పంపి, గతంలో ఎన్నడూ లేనంతటి ప్రమాదంలో చిక్కుకుపోయారు.

తన పొరుగు వారిని ఎదుర్కోవడానికి కాన్‌స్టాంటినోపుల్ చక్రవర్తి పదివేల మంది టర్కిష్ సైనికులను గ్రీసు దేశం లోనికి పంపించాడు. ఐతే వారు యుద్ధం ముగిసిన తరువాత తిరిగి వెళ్ళడానికి తిరస్కరించారు. క్రైస్తవేతరులకు గ్రీసుదేశం యొక్క బానిసత్వానికి ఇదే ఆరంభం.

కనుక, గెలుపొందాలనే కోరిక లేని వారే సహాయ సైన్యాల మీద ఆధారపడతారు. ఎందుకంటే అవి కిరాయి సైన్యాల కన్నా చాలా ఎక్కువ ప్రమాదకరమైనవి. వీటితో వినాశనం తయారుగా ఉంటుంది, సైన్యమంతా ఐకమత్యంతో ఉండి, వేరెవరికో విధేయత తెలుపుతూ ఉంటుంది. అదే కిరాయి సైన్యాల విషయానికి వస్తే, వారు జయించినపుడు నీకు హాని చేయడానికి వారికి ఎక్కువ సమయం మరియు మంచి అవకాశాలు అవసరమౌతాయి. వారంతా ఒకే జాతికి చెందిన వారై ఉండరు, వారు నీచే నియమించబడి నీ ద్వారా జీతభత్యాలు అందుకుంటూ ఉంటారు. వారి నాయకుడిగా నీచే నియమించబడిన వ్యక్తి నీకు హాని చేయగలిగేంతటి అధికారాన్ని వారి మీద వెంటనే పొందలేడు. మొత్తానికి చెప్పేదేమిటంటే, కిరాయి సైన్యాలలో వారి పిరికితనం మరియు నిరాసక్తత అత్యంత ప్రమాదకరమైనవి, అదే సహాయ సైన్యాలలో వారి ధైర్య సాహసాలే అతి ప్రమాదకరమైనవి. కనుక వివేకవంతుడైన రాజు ఈ సైన్యాలకు ఎల్లవేళలా దూరంగా ఉండి, తన స్వంత సైన్యాల మీద మాత్రమే ఆధారపడతాడు. అతడు ఇతరుల సైన్యం ద్వారా పొందిన దానిని నిజమైన విజయంగా పరిగణించక, తన స్వంత సేనల ద్వారా వచ్చే ఓటమినైనా కోరుకుంటాడు గానీ, ఇతరుల సైన్యం ద్వారా వచ్చే విజయాన్ని మాత్రం కాంక్షించడు.

సీజర్ బోర్గియాను మరియు అతడి చేతలను పేర్కొనడానికి నేనెన్నడూ సంకోచించను. అతడు రొమాగ్నాలోకి సహాయ సైన్యాల ద్వారా ప్రవేశించాడు -వారందరూ కూడా ఫ్రెంచ్ సైనికులే- వారి సహాయంతో ఇమోలాను మరియు ఫోర్లిని (Imola and Forli) జయించాడు. అయితే ఆ తదుపరి ఆ సైన్యాలు అతనికి విశ్వసనీయమైనవిగా కనిపించకపోవడంతో, తక్కువ ప్రమాదకరమైనవిగా భావించిన కిరాయి సైన్యాల మీద ఆధారపడాలని నిర్ణయించుకొని, ఓర్సిని మరియు విటెల్లి (Orsini and Vitelli) లను నియమించుకున్నాడు. కానీ తన నియంత్రణలోకి అవి వచ్చిన తరువాత అవి చంచలమైనవి, విశ్వాసం లేనివి మరియు ప్రమాదకరమైనవి అని గ్రహించి, వాటిని కూడా వదిలించుకుని తన స్వంత సైన్యాల మీద ఆధారపడ్డాడు. డ్యూక్ (సీజర్ బోర్గియా) ఒక్క ఫ్రెంచ్ బలగాల మీదనే ఆధారపడినపుడు, ఓర్సిని మరియు విటెల్లిలను తన కొలువులోకి తీసుకున్నపుడు అలాగే తన స్వంత సైనికుల మీద ఆధారపడినపుడు …ఇలా ఈ మూడు సందర్భాలలోనూ అతడి ప్రఖ్యాతిలోని తేడాలను గమనించడం ద్వారా మనం ఈ బలగాలలో ఒకదానితో మరోదానికి ఉన్న భేదాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ‘ప్రతీ ఒకరూ అతడిని తన బలగాలకు పూర్తి యజమానిగా గుర్తించినప్పటి కన్నా (అతడు స్వంత సైన్యాలను కలిగి ఉన్నప్పటి కన్నా) ఎక్కువగా అతడి గురించి ఉన్నతంగా మరెప్పుడూ భావించబడలేదు; అంతేకాక ఆసమయంలో అతడి ప్రఖ్యాతి నిరంతరం వృద్ధిచెందుతూనే ఉన్నది’ అని మనం తెలుసుకుంటాం.

ఇటలీకి మరియు ఇటీవలి కాలానికి చెందిన ఉదాహరణలను దాటి అవతలికి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. ఐతే నేను ఇంతకు ముందు పేర్కొన్న వారిలో ఒకడు అయిన, సిరాకస్ కు చెందిన Hieroను వదిలివేయడం నాకు ఇష్టం లేదు.

నేను చెప్పినట్లుగా ఇతడు సిరాకసన్‌ల చేత సైన్యానికి నాయకుడిగా చేయబడి, ఇటలీ సేనాధిపతులను పోలిన సేనానులతో నిర్మించబడిన కిరాయి సైన్యాలు నిరుపయోగకరమైనవనే విషయాన్ని వెనువెంటనే గ్రహించి, ఆ సేనానులను కొనసాగనివ్వనూలేక, సురక్షితంగా తొలగించనూలేక, వారందరినీ ముక్కలు ముక్కలుగా నరికించి, ఆ తరువాత ఇతర సహాయమేమీ లేకుండా తన స్వంత సైన్యాలతోనే యుద్ధం చేశాడు.

ఈ విషయానికి అనువర్తించదగిన ఓల్డ్ టెస్టమెంట్ (పాత నిబంధన గ్రంథం) లోని ఒక సంఘటనను గుర్తుతెచ్చుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. పాలస్తీనా యోధుడైన గోలియత్‌తో యుద్ధం చేయడానికి డేవిడ్ తన సంసిద్ధతను సాల్‌తో వ్యక్తం చేయగా సాల్ అతడిని ప్రోత్సహించదానికి తన స్వంత ఆయుధాలనిచ్చాడు. వాటిని డేవిడ్ ఒకసారి పరీక్షించి, వెంటనే, అలవాటు లేని ఆ ఆయుధాలతో తాను విజయం సాధించలేనని అంటూ వాటిని తిరస్కరించి, తన వడిసెల (sling), మరియు తన ఖడ్గంతోనే శత్రువును ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. చివరికి చెప్పేదేంటంటే, ఇతరుల యొక్క ఆయుధాలు పెద్దగా అనిపించి చేజారిపోవచ్చు, లేక బరువుగా అనిపించవచ్చు, లేదా మరీ తేలికగానూ అనిపించవచ్చు.

11వ లూయీ (Louis XI, born 1423, died 1483 ) తండ్రి అయిన 7వ ఛార్లెస్ (Charles VII, born 1403, died 1461) అదృష్టం ద్వారానూ మరియు ధైర్యసాహసాలతోనూ ఫ్రాన్స్ దేశాన్ని ఇంగ్లీషు వారి నుండి విముక్తం చేసిన తరువాత తన స్వంత సైన్యాలను కలిగి ఉండవలసిన అవసరాన్ని గుర్తించి, అశ్వికదళం మరియు పదాతి దళాలను ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించిన శాసనాన్ని తన సామ్రాజ్యంలో జారీ చేశాడు. తదుపరి అతని కొడుకు కింగ్ లూయీ పదాతిదళాన్ని రద్దుచేసి, దాని స్థానంలో స్విస్ కిరాయి సైనికులను తీసుకున్నాడు. తరువాతి రాజుల చేత కూడా అనుసరించబడిన ఆ పొరపాటు చర్యే ఆ సామ్రాజ్యపు విపత్తుకు మూలంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే స్విస్ వారి ప్రఖ్యాతిని పెంచడం ద్వారా అతడు తన స్వంత బలగాల విలువను పూర్తిగా తగ్గించి వేశాడు. ఫ్రెంచ్ వారి పదాతి దళం రద్దుకావడంతో వారి అశ్విక దళం పూర్తిగా విదేశీ సహాయం (స్విస్ వారి) మీద ఆధారపడేటట్లు చేయబడింది. అంతేకాక స్విస్ వారితో కలసి యుద్ధం చేయడానికి అలవాటు పడిపోవడం వలన, వారు లేకుండా తాము ఏమీ చేయలేమని భావించే స్థితికి వచ్చారు. దానితో ఫ్రెంచ్ వారు స్విట్జర్లాండ్ తో పోరాడలేని పరిస్థితి మరియు వారు లేకుండా వేరెవ్వరినీ ఎదుర్కొని విజయం సాధించలేని పరిస్థితి తలయెత్తింది. ఆవిధంగా కొంత కిరాయి సేనలతోనూ, కొంత జాతీయ సేనలతోనూ ఫ్రెంచ్‌వారి సైన్యాలు మిశ్రమ సైన్యాలుగా మారాయి.

ఈ విధంగా కలగలసిన సైన్యం కేవలం కిరాయి సైన్యాల కన్నానో, లేక కేవలం సహాయసైన్యాల కన్నానో చాలా మెరుగైనదే. కానీ స్వంత సైన్యం కన్నా చాలా తక్కువ స్థాయిది. ఛార్లెస్ శాసనం గనుక అమలులో ఉంచబడి, మరింత విస్తరించబడి ఉంటే, ఫ్రాన్స్ సామ్రాజ్యం అజేయంగా నిలచి ఉండేదని ఈ ఉదాహరణ నిరూపిస్తున్నది.

మొదట్లో బాగానే కనిపించే వ్యవహారాలలో అడుగుపెట్టినపుడు మనిషి యొక్క అల్పబుద్ధి -నేను ఇంతకుముందు విషజ్వరాల గురించి చెప్పినట్లుగా- దానిలో దాగి ఉన్న విషాన్ని స్పష్టంగా చూడలేదు. కనుక ఒక సంస్థానాన్ని పాలించే రాజు నిజంగా వివేకవంతుడు కానట్లైతే అతడు ప్రమాదాలను, అవి తనను చుట్టుముట్టేవరకూ, పసిగట్టలేడు. అటువంటి సూక్ష్మదృష్టి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. రోమన్ సామ్రాజ్యానికి దాపురించిన మొదటి ముప్పును మనం పరీక్షించినట్లైతే, కేవలం గోత్‌లను (కిరాయి సైన్యాలుగా) నియమించుకోవడంతోనే అది మొదలైనట్లుగా తెలుస్తున్నది. ఎందుకంటే అప్పటి నుండి రోమన్ సామ్రాజ్యపు శక్తి క్షీణించడం మొదలై, ఆ ధైర్యసాహసాలన్నీ ఇతరులకు (గోత్‌లకు) బదిలీ అయినాయి.

మొత్తానికి నేనేం చెబుతానంటే, తన స్వంత బలగాలు లేకుండా ఏ సంస్థానం కూడా సురక్షితం కాదు. పైగా కష్టకాలంలో ఆదుకునే ధైర్యసాహసాలు లేకపోవడంతో అది పూర్తిగా అదృష్టం మీదనే ఆధారపడుతుంది. ‘స్వంత బలం యొక్క పునాది లేని యశస్సు లేక అధికారం వలే అనిశ్చితమైనవి, అస్థిరమైనవి మరేవీ లేవు’ అనేది ఎల్లవేళలా వివేకవంతుల యొక్క అభిప్రాయం మరియు నిర్ణయం. ఒకరి స్వంత సైన్యం అంటే అతడి పౌరులు, అనుచరులు లేక ఆధారితులు, …వీరిలో ఎవరితోనైనా (either of subjects, citizens, or dependents ) నిర్మించబడినది; మిగిలిన వారంతా కిరాయి సైన్యాలు లేక సహాయ సైన్యాలు.

(‘ఆధారితులు’ అంటే రాజు యొక్క పౌరులో లేక అనుచరులో కాకపోయినా కూడా కేవలం అతడి పోషణలోనే సైనిక వృత్తిని అవలంబించేవారు)

నేను సూచించిన సూత్రాలను గనుక పర్యాలోచించినట్లైతే, అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క తండ్రియైన ఫిల్లిప్ మరియు అనేక మంది ఇతర రాజులు మరియు రిపబ్లిక్‌లు సైన్యాలను ఎలా నిర్మించి, నిర్వహించారో -నేను పూర్తిగా కట్టుబడి ఉండే సూత్రాలు- పరిశీలిస్తే స్వంత సైన్యాలను నిర్మించే మార్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.


'మాకియవెల్లి-ద ప్రిన్స్' 12వ అధ్యాయం





రాజు - రాజ్యం



అధ్యాయం - 12 

వివిధ రకాల సైన్యాల గురించి; ముఖ్యంగా కిరాయి సైన్యాల గురించి






నేను ప్రారంభంలో పరిశీలించడానికి ప్రతిపాదించిన వివిధ రకాల సంస్థానాల యొక్క లక్షణాలను విశేషంగా (సంస్థానాల వారీగా) చర్చించిన మీదట, అలాగే వాటి యొక్క బలానికి మరియు బలహీనతకు గల కారణాలను కొంతవరకు పరిశీలించిన మీదట, అంతేకాక వాటిని పొందాలని మరియు నిలుపుకోవాలని కోరుకునే అనేకమంది అనుసరించే పద్దతులను సూచించిన మీదట, ప్రతి ఒక సంస్థానం ఉపయోగించే దాడి మరియు రక్షణ సాధనం (సైన్యం) గురించి సామాన్యంగా (generally) చర్చించడమే ఇప్పుడు నాకు మిగిలి ఉన్నది.

ఒక రాజుకు తన పునాదులు బలంగా నిర్మింపబడి ఉండటం అనేది ఎంతో అవసరం, లేదంటే అతడు తప్పనిసరిగా వినాశనానికి గురి అవుతాడు అనే దానిని మనం పైన చూసాం. అన్ని రాజ్యాలకు --అవి కొత్తవైనా, లేక పాతవైనా లేక మిశ్రమమైనవైనా-- ప్రధానమైన పునాదులు మంచి శాసనాలు మరియు మంచి సైన్యాలు. ఒక రాజ్యానికి మంచి సైనిక సంపత్తి లేనట్లైతే మంచి చట్టాలు ఉండబోవు. దీనిని అనుసరించి మంచి సైనిక సంపత్తి ఉన్న రాజ్యాలు మంచి చట్టాలను కలిగి ఉండగలవు. కనుక నేను చట్టాల గురించిన చర్చను వదిలేసి సైన్యాల గురించి మాత్రమే మాట్లాడతాను.

కనుక ఇప్పుడు నేను ఏమి చెబుతానంటే, ఒక రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించే సైన్యాలు తన స్వంతవైనా (own ) అయి ఉంటాయి లేదంటే అవి కిరాయిసైన్యాలు (mercenaries ) లేదా ఇతరులు సాయం కొరకు పంపిన సైన్యాలు (auxiliaries ) లేదంటే మిశ్రమ సైన్యాలైనా (mixed ) అయి ఉంటాయి. కిరాయి సైన్యాలు మరియు ఇతరులు పంపిన సైన్యాలు నిరుపయోగమైనవి మరియు ప్రమాదకరమైనవి. తన రాజ్యాన్ని కిరాయి సైన్యాల మీద ఆధారపడి నిలుపుకునేవాడు దృఢంగానూ ఉండలేడు లేక సురక్షితంగానూ ఉండలేడు. ఎందుకంటే వాటిలో ఐకమత్యం ఉండదు, దురాశాపూరితమైనవి, క్రమశిక్షణ ఉండదు, విశ్వాసం ఉండదు, స్నేహితులతో దుందుడుకుగానూ, శతృవులతో పిరికిపందల్లానూ వ్యవహరిస్తాయి. వాటికి దేవుడంటే భయం ఉండదు. మనిషికి విశ్వాసపాత్రులుగా ఉండరు. దాడి మొదలు కానంతవరకే విధ్వంసం జరగకుండా ఉంటుంది. (వారి మీద దాడి జరిగినప్పుడల్లా ఓటమి సంభవిస్తుంది) శాంతి సమయాలలో నీవు వారి దోపిడీకి గురి అవుతావు. యుద్ధ సమయంలో నీ శతృవు యొక్క దోపిడీకి గురి అవుతావు. కారణమేమిటంటే --నీ కోసం మరణించడనికి వారు ఇష్టపడేలా చేయడానికి సరిపోని అతితక్కువ వేతనం కన్నా-- వారిని యుద్ధరంగాన్ని అంటిపెట్టుకుని ఉండేలా చేసే మరే ఇతర ఆకర్షణగానీ, కారణంగానీ వారు కలిగిలేరు. నీవు యుద్ధం చేయని సమయంలో మాత్రమే వారు నీ సైనికులుగా ఉండటానికి ఇష్టపడతారు, యుద్ధం రాగానే వారు శత్రువు నుండి పలాయనం చిత్తగించి అదృశ్యమైపోతారు. ఈ విషయాన్ని నిరూపించడంలో పెద్దకష్టమేమీ ఉండదు. ఎందుకంటే అనేక సంవత్సరాలపాటు తన ఆశలన్నీ కిరాయి సైన్యాలమీదే నిలపటం తప్ప ఇటలీ నాశనానికి మరేదీ కారణం కాదు. మొదట్లో అవి కొంత మెరుగ్గా కనబడి, వారితో వారే ఎదురైనప్పుడు ధైర్యసాహసాలు కనబరచినప్పటికీ, విదేశీయులు ప్రవేశించినప్పుడు మాత్రం వారు తామేమిటో చూయించారు. ఆ విధంగా ఫ్రాన్స్ రాజైన ఛార్లెస్ అతి సునాయాసంగా ఇటలీని తన స్వాధీనం లోనికి తెచ్చుకునే వీలు కలిగింది. ‘మన (ఇటాలియన్ల) పాపాలే దీనికి కారణం’ అని అన్నవాడు నిజమే చెప్పాడు. కానీ అవి అతడనుకున్న పాపాలు కాదు, నేను చెప్పిన పాపాలు. అంతేకాక అవి రాజుల యొక్క పాపాలు గనుక వాటికి శిక్షను అనుభవించింది కూడా రాజులే.

నేను ఈ (కిరాయి) బలగాల అవాంఛనీయ లక్షణం గురించి మరింత స్పష్టంగా విశదీకరించాలని కోరుకుంటున్నాను. ఈ కిరాయి సైన్యాల యొక్క సైన్యాధిపతులు బలవంతులో లేక బలహీనులో అయి ఉంటారు. వారు గనుక బలవంతులైతే నీవు వారిని నమ్మలేవు. ఎందుకంటే అటువంటి వారు వారి యజమానివైన నిన్నే అణచివేయడం ద్వారానో లేక నీ అభీష్టానికి విరుద్ధంగా మరెవరినో అణచివేయడం ద్వారానో వారు ఎల్లప్పుడూ తమ ఔన్నాత్యాన్నే కోరుకుంటారు. అలా కాక ఆ సైన్యాధిపతి సమర్థుడు కాకపోతే నీవు మామూలు పద్దతిలో నాశనమైపోతావు. తన చేతిలో సైన్యాలు కలిగిన ఎవరైనా సరే -అతడు కిరాయి సైన్యాధిపతి అయినా, కాకపోయినా కూడా- ఇదే విధంగా ప్రవర్తిస్తాడని ఎవరైనా అంటే దానికి నా సమాధానం: ఒక రాజు గానీ, లేక ఒక రిపబ్లిక్ గానీ సైన్యాన్ని ఉపయోగించవలసి వచ్చినపుడు; రాజు ఐతే స్వయంగా తానే సైన్యాధిపత్యం వహించడానికి వెళ్ళవలసి ఉంటుంది. రిపబ్లిక్ ఐతే తన పౌరులలో ఒకరిని పంపవలసి ఉంటుంది. ఒకవేళ అతడు అందుకు తగని వాడని నిరూపణ అయితే అతడిని మార్చవలసి ఉంటుంది, తగిన వాడని నిరూపణ అయితే చట్టాల యొక్క బలం ద్వారా అతడిని తగిన హద్దులలో ఉంచవలసి ఉంటుంది. రాజులు గానీ, రిపబ్లిక్‌లు గానీ తమ స్వంత సైన్యాల మీద ఆధారపడినపుడు గొప్ప విజయాలను పొందాయనీ, అదే కిరాయి సైన్యాలను ఉపయోగించటం వలన నష్టం తప్ప మరేమీ జరగలేదనీ అనుభవం ద్వారా మనం తెలుసుకున్నాము. స్వంత సైన్యాలు కలిగిన రిపబ్లిక్‌ను దాని యొక్క పౌరులలో ఒకని యొక్క నియంత్రణ (పాలన) లోకి తీసుకురావడం, విదేశీ సైన్యాల మీద ఆధారపడిన దానిని తేవడాని కన్నా ఎక్కువ కష్టం అవుతుంది (అంటే ఆ దేశ సైన్యాధికారి కుట్ర ద్వారా దేశాన్ని తన పాలనలోకి తెచ్చుకోవాలనుకుంటే అది కష్టసాధ్యం ) రోమ్ మరియు స్పార్టా స్వంత సైన్యాలు కలిగి ఉండి అనేక శతాబ్దాల పాటు స్వేచ్ఛగా నిలిచాయి. స్విస్ ప్రజలు పూర్తిగా స్వంత సైన్యాలు కలిగి ఉండి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉన్నారు.

ప్రాచీన కాలంలో మనకు కిరాయి సైన్యాల గురించిన ఒక ఉదాహరణ కార్తజినియన్‌ల (Carthaginians ) విషయంలో ఉన్నది. కార్తజినియన్‌లు తమ స్వంత పౌరులనే సైన్యాధికారులుగా కలిగి ఉన్నప్పటికీ, రోమ్‌తో వారి మొదటి యుద్ధం యొక్క ముగింపులో, వారు తమ కిరాయి సైన్యాల చేత దాదాపూ వినాశనమైపోయారు. (తమ స్వంత సేనాని) ఎపామినొండాస్ (Epaminondas ) మరణించిన తరువాత థెబన్లు (Thebans ), (మాసిడోనియాకు చెందినవాడైన) ఫిలిప్ ఆఫ్ మాసిడోన్‌ను (Philip of Macedon ) తమ సేనాధిపతిగా చేసారు. (వారి సేనానిగా పోరాడి ) విజయం సాధించిన తరువాత అతడు వారి స్వేచ్ఛను హరించాడు. డ్యూక్ ఫిలిప్పో (Duke Filippo ) మరణించిన తరువాత మిలనీస్ వెనటియన్స్ కు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఫ్రాన్సిస్కో స్ఫోర్జా (Francesco Sforza ) ను నియమించారు. అతడు శతృవులను కారావాగ్గియో (Caravaggio ) వద్ద ఓడించి, వారితోనే చేతులు కలిపి తన యజమానులైన మిలనీస్‌నే కూలదోశాడు. ఇతడి తండ్రి నేపుల్స్ రాణి అయిన జొహన్న (గియోవన్న) (Johanna ) కొలువు చేస్తున్నపుడు, ఆమెను హఠాత్తుగా సైన్యాలేవీ లేకుండా అరక్షితంగా వదిలివేయడంతో, ఆమె తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఆరగాన్ రాజు (King of Aragon ) యొక్క చేతులలో వాలవలసి వచ్చింది.

‘గతంలో వెనటియన్స్ మరియు ఫ్లోరెంటైన్స్, తమ భూభాగాలను ఈ (కిరాయి) సైన్యాల ద్వారా విస్తరించుకున్నా కూడా వాటి యొక్క సేనాధిపతులు తమను రాజులుగా చేసుకోవాలని కోరుకోకుండా, వారిని విశ్వాసంతో సేవించారు’ అని ఎవరైనా అంటే నేను ఇలా బదులిస్తాను: ఈ విషయంలో ఫ్లోరెంటైన్స్ అదృష్టవంతులు, ఎందుకంటే భయపడటానికి అవకాశం ఉన్న సమర్థులైన సేనానులలో కొందరు విజయం సాధించలేదు, కొందరు ప్రత్యర్థులను కలిగి ఉన్నారు, కొందరు వేరే ఇతర విషయాలకు తమ ఆశలను మళ్ళించారు.

విజయాన్ని పొందని వారిలో గియోవన్ని అకుటో (Giovanni Acuto ) ఒకడు. అతడు పరాజయం పాలవడంతో అతడి విశ్వాసపాత్రత పరీక్షను ఎదుర్కొనలేదు. ఒకవేళ ఇతడు విజేత అయినట్లైతే, ఫ్లోరెంటైన్స్ పూర్తిగా ఇతని చేత చిక్కి ఉండేవారనే విషయం ప్రతీ ఒకరికీ తెలుసు. స్ఫోర్జా మరియు బ్రాసెస్చి (Sforza had the Bracceschi ) ఎల్లవేళలా ప్రత్యర్థులు. అందువలన వారు ఒకరినొకరు కాపు కాసుకున్నారు. అంతకన్నా ముఖ్యంగా ఫ్రాన్సెస్కో (స్ఫోర్జా) తన ఆశలను లొంబార్డీ (మిలన్) వైపు మళ్ళించాడు; బ్రాసియో చర్చి మరియు నేపుల్స్ రాజ్యాల వైపు మళ్ళించాడు. మనం కొద్దికాలం క్రితం జరిగిన విషయానికి వద్దాం. ఫ్లోరెంటైన్స్ తమ సేనానిగా పగొలొ విటెల్లి (Pagolo Vitelli ) ని నియమించారు. అతడు ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడు. అతడు సాధారణ స్థితి నుండి సైన్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఉన్నత స్థానానికి ఎదిగాడు. అతడు గనుక పీసాను (Pisa ) జయించినట్లైతే, ఫ్లోరెంటైన్స్ పూర్తిగా అతడి అధికారంలోకి వచ్చి ఉండేవారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే అప్పుడిక అతడు శత్రుపక్షం వహిస్తే వారు నిస్సహాయులుగా మిగిలిపోతారు, అదే సమయంలో వారు అతడిని తమతోనే కలిగి ఉంటే వారు తప్పక అతడి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవలసి వస్తుంది.

వెనటియన్స్ సాధించిన విజయాలను మనం పరిశీలించినట్లైతే ఆ దేశ ప్రజలలోని అన్నివర్గాలవారు -గొప్పవారు గానీయండి, సామాన్య ప్రజలు గానీయండి– యుద్ధాలలో ధైర్యసాహసాలతో పోరాడినంత కాలం, వారు సురక్షితంగా మరియూ గొప్పగా వ్యవహరించినట్లుగా మనం తెలుసుకుంటాం. వారు భూమి మీద కాకుండా నీటిమీద యుద్ధం చేసినంతకాలం ఇలానే జరిగింది. ఐతే వారు భూమిమీద యుద్ధం చేయడం ప్రారంభించగానే తమకు ప్రావీణ్యం ఉన్న ఈ పద్దతులన్నింటినీ వదిలేసి ఇటలీ సంప్రదాయాలను (కిరాయి సైన్యాలను ఉపయోగించడం) అనుసరించారు. భూమి మీద వారి విస్తరణ యొక్క ప్రారంభంలో, ఎక్కువ ప్రాంతాన్ని కలిగి లేకపోవడం వలన, మరియు వారి గొప్ప ప్రఖ్యాతి కారణంగా, వారికి తమ సేనానుల వలన అంతగా భయపడవలసిన పని లేకుండా పోయింది. ఐతే వారు కార్మిగ్నుయోలా (Carmignuola ) నేతృత్వంలో తమ భూభాగాలను విస్తరించిన తరువాత తమ పొరపాటును తెలుసుకున్నారు. ఎలా అంటే అతడి ఆధ్వర్యంలో డ్యూక్ ఆఫ్ మిలన్‌ను ఓడించినపుడు, వారు అతడిని ఎంతో ధైర్యసాహసాలు మరియు నైపుణ్యం కలిగిన నాయకుడిగా గ్రహించారు. ఐతే మరోపక్క, ఆ తదుపరి యుద్ధాన్ని కొనసాగించటంలో అతడు ఎంతో నిరాసక్తంగా వ్యవహరించడాన్ని చూసి, ఇక అతడి నేతృత్వంలో ఎటువంటి విజయాలు నమోదు కావని భావించారు. అయితే వారు -తాము సాధించినదంతా కోల్పోగలమనే భయంతో అతడిని బహిష్కరించలేక- అతడి నుండి తమను తాము రక్షించుకోవడానికి తప్పనిసరి పరిస్థితులలో అతడిని హతమార్చారు. ఆ తరువాత వారు తమ సేనానులుగా బార్టోలొమియో డ బెర్గమో, రొబెర్టో డ సాన్ సెవేరినో, ద కౌంట్ ఆఫ్ పిటిగ్లియానో (Bartolomeo da Bergamo, Roberto da San Severino, the count of Pitigliano ) మొదలైన వారిని నియమించారు. వారి వలన వెనటియన్స్‌కు ఎప్పుడూ అపజయం తెచ్చిన ప్రమాదాలే తప్ప విజయం తెచ్చిన ప్రమాదాలు కలగలేదు (అపజయమే తప్ప విజయం ఏనాడూ రాలేదు). ఆవిధంగా, తదుపరి వైలా (Vaila) వద్ద; ఒకేఒక యుద్ధంలో ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో, తాము ఎంతో కష్టంతో సాధించినదంతా వారు కోల్పోయారు. ఎందుకంటే ఇటువంటి (కిరాయి) సైన్యాలతో విజయాలు చాలా నెమ్మదిగా, ఎంతో ఆలస్యంగా వస్తాయి. అవి కూడా పరిగణించదగినవి కావు. కానీ అపజయాలు మాత్రం హఠాత్తుగా వస్తాయి, అపశకునాన్ని తెస్తాయి.

ఈ ఉదాహరణల మూలంగా నేను ఎన్నో సంవత్సరముల నుండి కిరాయి సైన్యాలచే రక్షించబడుతున్న ఇటలీ (ప్రస్తావన) కి వచ్చాను కనుక ఈ విషయం గురించి కొంత లోతుగా వెళ్ళాలనుకుంటున్నాను. దాని వలన కిరాయిసైన్యాల యొక్క పుట్టుక మరియు పెరుగుదల గురించి తెలుసుకున్నవారికి, వాటితో తగినవిధంగా వ్యవహరించడం మరింత తేలిక అవుతుంది. ఆధునిక కాలంలో (రోమన్) సామ్రాజ్యం యొక్క అధికారం ఇటలీలో గుర్తింపు కోల్పోతుండగా, పోప్ యొక్క లౌకిక అధికారాలు మరింత పెరుగుతుండగా, ఇటలీ ఒక్కసారిగా అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలైపోయింది అన్న విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలి. అనేక పెద్ద నగరాలు -చక్రవర్తి అండతో అప్పటివరకూ తమను అణచివేతకు గురిచేసిన- తమ ప్రభువులమీద తిరుగుబాటు చేశాయి. తిరుగుబాటు చేసిన ఈ నగరాలను చర్చి తన లౌకిక అధికారాలను పెంపు చేసుకోవడం కోసం సమర్థిస్తే: అనేక ఇతర నగరాలలో వాటి యొక్క పౌరులే రాజులయ్యారు. దీనిమూలంగా ఇటలీ పాక్షికంగా చర్చి మరియు కొన్ని రిపబ్లిక్‌ల చేతులలోకి వెళ్ళిపోయింది. పూజారులను కలిగి ఉన్న చర్చి, మరియు సైనిక వ్యవహారాలలో అనుభవం లేని పౌరులను కలిగి ఉన్న రిపబ్లిక్‌లు, రెండూ కూడా విదేశీయులను (కిరాయి సైన్యాలను) నియమించుకోవడం ప్రారంభించాయి.

మొట్టమొదట ఈ విధమైన సైనిక పద్దతికి ప్రాచుర్యం కల్పించినవాడు రొమాగ్నాకు చెందిన అల్బెరిగొ డ కొనియో (Alberigo da Conio ). ఇతని వద్ద శిక్షణ పొందిన వారిలో బ్రాసియో మరియు స్ఫోర్జాలు తమ కాలంలో ఇటలీలోనే నిర్ణయాత్మకమైన వారు. వీరి తరువాత ఇప్పటివరకు ఇటలీ సేనలను నడిపిన ఇతర సేనానులందరూ వచ్చారు. వీరందరి ప్రతాపం యొక్క ఫలితం ఏమిటంటే, ఇటలీ ఛార్లెస్ చేతిలో ఓటమి పాలయ్యింది. లూయిస్ చే లూటీ చేయబడింది, ఫెర్డినాండ్ చే ధ్వంసం చేయబడింది, స్విట్జర్లాండ్ చేతిలో అవమానింపబడింది.

(ఛార్లెస్ మరియు లూయీస్ ఫ్రెంచ్ రాజులు; ఫెర్డినాండ్ స్పానిష్ రాజు)

ఈ కిరాయి సైన్యాల యొక్క ప్రథమ లక్ష్యం ఏమిటంటే పదాతిదళాల (infantry ) యొక్క ఖ్యాతిని తగ్గించి, తద్వారా తమ (అశ్విక దళాల) (cavalry ) ప్రాముఖ్యతను పెంచుకోవడం. వీరు ఇలా చేయడానికి కారణం వారికి తమదైన భూభాగం లేకపోవడం మరియు జీవిక కోసం వారు తమ వృత్తి మీదనే ఆధారపడటం వలన అనేక మంది సైనికులను వారు పోషించలేరు, అదే సమయంలో కొద్ది మంది పదాతి సైనికుల వలన వారికి ఏ విధమైన ప్రాముఖ్యతా రాదు, కనుక వారు అశ్వికదళం వైపు మొగ్గుచూపారు. అలా అయితే తక్కువ సైనికులతోనే ప్రాముఖ్యత వస్తుంది, మరియు పోషించడం కూడా సులభసాధ్యం. పరిస్థితి ఎక్కడకు దారితీసిందంటే ఇరవై వేల సైనికులున్న ఒక సైన్యంలో రెండువేల మంది పదాతిదళ సైనికులు కూడా కనబడరు. వీటన్నింటికీ తోడుగా ఈ కిరాయి సైన్యాలు తమకు, తమ సైనికులకు శ్రమను మరియు ప్రమాదాన్ని తగ్గించడానికి అందుబాటులో ఉండే ప్రతీ పద్దతినీ ఉపయోగిస్తాయి. యుద్ధంలో ఒకరినొకరు (శత్రుదేశపు కిరాయి సైనికులను) చంపరు, అయితే వారిని యుద్ధ ఖైదీలుగా పట్టుకుని, పరిహారంగా ధనం వసూలు చేయకుండానే విడిచిపెడతారు. వారు ఏ పట్టణం మీదా రాత్రిపూట దాడి చేయరు, అలాగే పట్టణాలలో ఉన్న సైనికులు తమను ముట్టడించిన సైన్యాన్ని రాత్రిపూట ఎదుర్కోరు, తమ సైనిక విడిది చుట్టూ వారు రక్షణ గోడలు గానీ, కందకాలు గానీ ఏర్పాటు చేయరు, చలికాలంలో యుద్ధానికి బయలుదేరరు. ఇవన్నీకూడా వారి యొక్క సైనిక నియమావళిచే అనుమతించబడ్డాయి. నేను చెప్పినట్లుగా శ్రమనూ మరియూ ప్రమాదాలనూ తప్పించుకోవడానికి వారిచే రూపొందించబడ్డాయి. ఈ విధంగా కిరాయి సైన్యాలు ఇటలీని బానిసత్వంలోకి, హీన స్థితిలోకి తీసుకెళ్ళాయి.


11, అక్టోబర్ 2010, సోమవారం

'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 11వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం - 11 

చర్చి అధీనంలోని సంస్థానాల గురించి





చర్చి అధీనంలోని సంస్థానాల గురించి చెప్పడమే ఇప్పుడు మిగిలిపోయింది. వాటిని స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ముందు మాత్రమే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాటిని పొందడానికి శక్తిసామర్థ్యాలో లేక అదృష్టమో అవసరమౌతుంది గానీ వాటిని సంరక్షించుకోవడానికి ఆ రెంటిలో దేని అవసరమూ ఉండదు. ఎందుకంటే అవి మతపరమైన ఆదేశాలద్వారా సంరక్షించబడుతూ ఉంటాయి. ఈ మతపరమైన ఆదేశాలు ఎంత శక్తివంతమైనవంటే, ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నవంటే, ఈ సంస్థానాలు వాటి యొక్క రాజులు ఏ విధంగా ప్రవర్తించినా, ఏ విధంగా జీవించినా కూడా సురక్షితంగానే ఉంటాయి. ఈ రాజులు మాత్రమే రాజ్యాలను కలిగి ఉంటారు కానీ వాటిని రక్షించరు. అలాగే ప్రజలను కలిగి ఉంటారు గానీ వారిని పాలించరు. అలాగే వారి రాజ్యాలకు ఏ విధమైన రక్షణ లేకపోయినప్పటికీ అవి వారి చేజారిపోవు. ప్రజలు తాము పాలింపబడనప్పటికీ వారు ఆసంగతిని పట్టించుకోరు. అంతేకాక వారికి తమ రాజభక్తిని వీడే కోరికగానీ, సామర్థ్యం గానీ ఉండవు. కనుకనే ఇటువంటి సంస్థానాలు మాత్రమే సురక్షితమైనవి మరియు సంతోషప్రదమైనవి. మానవ మేథస్సు అందుకోలేని శక్తులచేత రక్షించబడుతున్న వీటి గురించి నేను ఇంకేమీ మాట్లాడను. ఎందుకంటే భగవంతుడి చేతనే గౌరవింపబడి, నిర్వహింపబడుతున్న వాటి గురించి చర్చించడం అనేది ఒక దుందుడుకు వ్యక్తి యొక్క చేష్టగా భావించబడుతుంది.

అయినప్పటికీ --పోప్ అలెగ్జాండర్-VI కు ముందు ఇటలీ సార్వభౌములు [కేవలం సార్వభౌములేకాదు ప్రతీ చిన్న రాజు, భుస్వామి కూడా, వారెంత తక్కువస్థాయి వారైనప్పటికీ] చర్చియొక్క ప్రాపంచిక అధికారాలను చిన్న చూపు చూశారు. కానీ ఇప్పుడు ఫ్రాన్సురాజంతటివాడు దానిముందు భయపడిపోతున్నాడు. అతడిని అది ఇటలీ నుండి తరిమివేయగలిగింది. అలాగే వెనటియన్స్‌ను నాశనం చేయగలిగింది— దీనిని గమనించిన మీదట ప్రాపంచిక అధికారాలలో చర్చి అంత ఉన్నత స్థాయిని చేరుకోవడం ఏ విధంగా సంభవించింది అని ఎవరైనా నన్ను అడిగితే, సమధానం అందరికీ తెలిసినదే అయినప్పటికీ, దానిని కొంత జ్ఞాపకం చేసుకోవడం అనవసరం అని నాకనిపించదు.

ఫ్రాన్స్ రాజైన ఛార్లెస్ ఇటలీలోకి ప్రవేశించక ముందు [Charles VIII invaded Italy in 1494.] ఈ దేశం పోప్, వెనటియన్స్, నేపుల్స్ రాజు, డ్యూక్ ఆఫ్ మిలన్ మరియు ఫ్లోరెంటైన్స్… ఇలా వీరి యొక్క పరిపాలన కింద ఉన్నది. ఈ రాజ్యాలు రెండు ముఖ్యమైన ఒప్పందాలను కలిగి ఉన్నాయి. ఒకటి సాయుధసైన్య సమేతుడైన ఏ విదేశీయుడినీ ఇటలీ లోనికి ప్రవేశించనీయకూడదు. మరొకటి తమలో ఎవరూ కూడా రాజ్యవిస్తరణకు పూనుకోకూడదు. వీరందరిలో కూడా పోప్ మరియు వెనటియన్స్ వలనే ఎక్కువ భయాందోళనలు నెలకొన్నాయి. వెనటియన్స్‌ను అదుపులో ఉంచడానికి, ఫెర్రారాను రక్షించడం కొరకు జరిగిన విధంగా మిగిలిన రాజ్యాలన్నీ కూటమిగా ఏర్పడటం అవసరం. పోప్‌ను నియంత్రించడానికి ఓర్సిని మరియు కొలోన్నెసి అనే రెండు వర్గాలుగా విడిపోయిన రోమన్ జమీందారులను ఉపయోగించారు. వారు ఎల్లప్పుడూ ఏదో ఒక సాకుతో గొడవపడి సాక్షాత్తూ పోప్ కళ్ళముందే ఆయుధాలను చేబూని నిలబడతారు. ఈ కారణంగా పోప్ అధికారం బలహీనంగా, అరక్షితంగా ఉండిపోయింది. అప్పుడప్పుడు ధైర్యవంతుడైన సిక్స్టస్ లాంటి పోప్ తలయెత్తినప్పటికీ అతడి వివేకంగానీ అతడి అదృష్టం గానీ ఈ చీకాకులనుండి అతడిని రక్షించలేదు. అంతేకాక పోప్ యొక్క జీవితకాలం తక్కువ అవడం కూడా బలహీనతకు ఒక కారణం. ఒక పోప్ యొక్క సగటు జీవితకాలమైన 10 సంవత్సరాలలో అతడు చాలా కష్టం మీద ఒక వర్గాన్ని మాత్రమే అణచివేయగలుగుతాడు. ఉదాహరణకు ఒక పోప్ కొలొన్నెసి వర్గాన్ని దాదాపూ అణచివేశాడనుకుందాం. తరువాతవచ్చే పోప్ ఓర్సిని వర్గానికి శత్రువుగా మారి, వారి ప్రత్యర్థులకు మద్దతిస్తాడు. ఆ విధంగా కొలొన్నెసి వర్గం మరలా జీవం పోసుకుంటుంది. అయినా కూడా ఓర్సిని వర్గాన్ని నాశనం చేయగలిగేంతటి సమయం అతడికి ఉండదు. పోప్ యొక్క ప్రాపంచిక అధికారాలను (రాజకీయ అధికారాలను) ఇటలీలో ఎవరూ మన్నించకపోవడానికి ఇదీ కారణం.

ఆ తరువాత 6వ అలెగ్జాండర్ తలయెత్తాడు. ఇతడు అందరు పోప్‌ల్లా కాకుండా ధనంతో, సైన్యంతో ఒక పోప్ ఏ విధంగా విజయాలు సాధించవచ్చో నిరూపించాడు. అలాగే డ్యూక్ వాలెంటినో (6వ అలెగ్జాండర్ కుమారుడు) సహాయ సహకారాల ద్వారా, ఫ్రెంచ్ వారి దురాక్రమణను ఒక అవకాశంగా మలచుకోవడం ద్వారా, -నేను డ్యూక్ చేసిన పనుల గురించి మాట్లాడేటపుడు- పైన తెలిపిన అన్ని విషయాలను ఈయన సాధించాడు. ఇతని ఉద్దేశ్యం చర్చి యొక్క శక్తిని పెంచడం కాదు. డ్యూక్ యొక్క శక్తిని పెంచడం మాత్రమే. అయినప్పటికీ ఇతడు చేసిన పనులు చర్చి యొక్క శక్తి పెరగడనికీ, దాని గొప్పదనానికీ దోహదపడ్డాయి. అతడి మరణం తరువాత, డ్యూక్ వినాశనం తరువాత ఆ చర్చే అతడి శ్రమయొక్క ఫలానికి వారసురాలయింది.

ఆ తరువాత పోప్ జూలియస్ వచ్చాడు. మొత్తం రొమాగ్నాను పొందడం ద్వారా, -మరియు రోమన్ జమీందారుల యొక్క ప్రాభవం క్షీణించి, అలెగ్జాండర్ కొట్టిన చావుదెబ్బల మూలంగా వారి యొక్క ముఠాలన్నీ చెల్లాచెదురై పోయి ఉన్న పరిస్థితిలో- చర్చి బలంగా ఉండటం గమనించాడు. అంతేగాక అలెగ్జాండర్‌కు ముందు ఎవరూ చేయని రీతిలో ధనాన్ని పోగుజేయడానికి మార్గం సుగమంగా ఉన్నట్లుగా కూడా గమనించాడు. అటువంటి విషయాలను జూలియస్ కేవలం అనుసరించడమే కాదు వాటిని ఇంకా వృద్ధిచేశాడు. బొలోగ్నాను పొందడానికి, వెనటియన్స్‌ను నాశనం చేయడానికి, ఇటలీ నుండి ఫ్రెంచివారిని తరిమివేయడానికి ఇతడు నిర్ణయించుకున్నాడు. ఈ పథకాలన్నింటిలోనూ ఇతను విజయం సాధించాడు. ఇంతేకాక మరింత ప్రశంసనీయమైన అంశమేమంటే అతడు నిర్వర్తించిన ప్రతీకార్యం చర్చిని మాత్రమే బలోపేతం చేశింది తప్ప ఏ వ్యక్తినో బలోపేతం చేయలేదు. మరిముఖ్యంగా ఓర్సిని మరియు కొలొన్నెసి వైరివర్గాలను కూడా ప్రారంభంలో (తాను అధికారంలోకి వచ్చినపుడు) వాటికున్న స్థాయికే పరిమితం చేశాడు. వారి మధ్యన ఘర్షించాలనే ఉద్దేశ్యాలు కొంత మిగిలి ఉన్నప్పటికీ రెండు విషయాలు స్థిరంగా ఉండేటట్లు జాగ్రత్తపడటం ద్వారా వారిని నియంత్రించగలిగాడు. మొదటిది, చర్చి యొక్క గొప్పదనం. దీని ద్వారానే ఇతడు వాటిని భయపెట్టాడు. రెండవది వారిలో మతాధికారులు ఉండాటానికి అనుమతించకపోవడం. ఎందుకంటే మతాధికారులే వారి మధ్యన ఘర్షణలకు కారకులవుతున్నారు. ఈ వైరి ముఠాలలో మతాధికారులు ఉన్నప్పుడల్లా అవి ఎంతోకాలం శాంతియుతంగా ఉండవు. దీనికి కారణం మతాధికారులు రోమ్‌కు ఇంటా బయటా ఘర్షణలను ఎగదోసి, మద్దతు కొరకు భూస్వాములను (జమీందారులను) బలవంతం చేస్తారు. ఈ విధంగా మతాధికారుల దురాశల మూలంగా భూస్వాముల మధ్యన అభిప్రాయ భేదాలు, కల్లోలాలు పొడసూపుతాయి.

ఈ కారణాల మూలంగానే (జూలియస్ తరువాత పోప్ గా వచ్చిన) దైవసమానుడైన పోప్ లియో చర్చి అత్యంత శక్తివంతంగా ఉన్నట్లు గమనించాడు. తన ముందువారు దానిని సైనికంగా ఉన్నతంగా రూపొందిస్తే ఇతడు దానిని తన మంచితనం ద్వారా, అంతులేని సుగుణాల ద్వారా మరింత గొప్పగా, మరింత గౌరవనీయమైనదిగా రూపొందించాలని మనం ఆశిద్దాం.

Pope Alexander VI (1492-1503). Pope Julius II (1503-1513). Pope Leo X (1513-1521).


'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 10వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం - 10

అన్ని సంస్థానాల యొక్క బలాన్ని నిర్థారించవలసిన విధానం గురించి






ఈ సంస్థానాల యొక్క లక్షణాన్ని పరీక్షించడంలో మరో అంశం గురించి ఆలోచించడం అవసరం. అదేమంటే రాజు అవసరమైన సందర్భంలో తన స్వంత వనరులతో తనను తాను కాపాడుకోగలిగేంత సామర్ధ్యం కలిగి ఉన్నాడా లేక అతడు ఎల్లప్పుడూ ఇతరుల సహాయం యొక్క అవసరం కలిగి ఉన్నాడా అని. ఈ విషయాన్ని మరింత స్పష్టం చేయడానికి, -ధనంగానీ, వ్యక్తులుగానీ సమృద్ధిగా ఉండటం వలన తమ మీద దండెత్తే వారికి వ్యతిరేకంగా యుద్ధంలో చేరడానికి తగినంత సైన్యాన్ని పెంపొందించగలిగే వారిని- తమస్వంత వనరుల ద్వారా తమను తాము కాపాడుకోగలిగే వారుగా నేను పరిగణిస్తాను. ఎవరికైతే యుద్ధరంగంలో శత్రువును ఎదుర్కోలేక కోటగోడల వెనకాల తలదాచుకోవడం ద్వారా తమను తాము రక్షించుకునే పరిస్థితి తప్పదో, వారిని ఎల్లప్పుడూ ఇతరుల సహాయం అవసరపడి ఉండేవారిగా నేను పరిగణిస్తాను అని చెబుతున్నాను. మొదటి పరిస్థితి ఇప్పటికే చర్చించబడింది. సందర్భం వస్తే, దాని గురించి మరలా మనం మాట్లాడుకుందాం. రెండవ పరిస్థితిలో అటువంటి రాజులను మిగతా దేశం యొక్క రక్షణ గురించి ఆలోచించకుండా, తాము నివసించే పట్టణాలకు కోటలు కట్టాలనీ, తగిన ఆహారనిల్వలు కలిగి ఉండాలనీ హెచ్చరించడం తప్ప చెప్పటానికి మరేమీ లేదు. ఎవరైనా తమ పట్టణానికి చక్కగా కోటకట్టి, -పైన తెలిపిన మరియు ముందుముందు తరచూ చెప్పబోయే విధానంలో- తమ ప్రజల యొక్క ఇతర అవసరాలన్నింటినీ సక్రమంగా సమకూరుస్తారో వారిమీద ఎంతో జాగ్రత్త తీసుకుంటే తప్ప దాడి చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే కష్టంతో కూడుకున్న కార్యాచరణలో పాల్గొనడానికి మనుషులు ఎల్లప్పుడూ విముఖత చూపిస్తారు. ఎవరైతే తమ పట్టణానికి చక్కగా కోటకట్టి, ప్రజాద్వేషానికి గురికాకుండా ఉంటారో వారి మీద దాడిచేయడం అంత తేలిక విషయం కాదని తెలుస్తున్నది.

జర్మనీ యొక్క నగరాలు పూర్తి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాయి. అవి తమ చుట్టుప్రక్కల (కోట వెలుపల) కొద్దిదేశాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. అవి తమకనుకూలంగా ఉన్నపుడు మాత్రమే చక్రవర్తికి విధేయతను ప్రకటిస్తాయి. చక్రవర్తికిగానీ, తమకు సమీపంలోగల మరే ఇతర శక్తికి గానీ అవి భయపడవు. వాటిని స్వాధీనం చేసుకోవడం అనేది చాలా కష్టంతోనూ మరియూ ప్రయాసతోనూ కూడుకున్న పని అని ప్రతీ ఒక్కరికీ తేటతెల్లమయ్యే విధంగా వాటికి కోటలు కట్టబడ్డాయి. అవి అన్నీకూడా లోతైన కందకాలు మరియు బలిష్టమైన గోడల చేత సురక్షితమై ఉంటాయి, తగినన్ని ఆయుధాలను కలిగి ఉంటాయి, మరియు వాటియొక్క ప్రజా గోదాముల్లో ఒక సంవత్సరానికి సరిపడా ఆహారం, పానీయాలు, మరియు ఇంధనం నిరంతరం నిల్వ ఉంటాయి. వీటన్నింటికీ తోడుగా ప్రభుత్వానికి వ్యయం లేకుండా ప్రజలలోని పేదవర్గాలకు చేయూత నీయడానికి -అటువంటి నగరాలకు జీవమూ మరియూ బలమూ అయినటువంటి చేతివృత్తులలోనూ మరియూ సామాన్య ప్రజలు జీవనోపాధిని పొందే వృత్తులలోనూ- వారికి ఒక సంవత్సరకాలం పాటు పని కల్పించడం కొరకు కావలసిన ముడిపదార్థాల నిల్వను కూడా కలిగి ఉంటాయి. మరిముఖ్యంగా అవి సైనిక కార్యకలాపాలను చాలా ప్రతిష్టాత్మకంగా భావిచటమేకాక వాటి నిర్వహణ కొరకు ఏన్నో నియమనిబంధనలను కూడా కలిగి ఉన్నాయి.

కనుక పటిష్ఠమైన నగరాన్ని కలిగి ఉన్న మరియు ప్రజాద్వేషానికి గురికాని రాజుమీద ఎవరూ దండెత్తరు. ఒకవేళ ఎవరైనా దండెత్తినా వారు చాలా అవమానకరమైన రీతిలో తరిమివేయబడతారు. ఎందుకంటే ప్రపంచ వ్యవహారాలు ఎంతగా చలనశీలమంటే ఒక పూర్తి సంవత్సరం కోటముట్టడిలో సైన్యాన్ని ఏ మార్పూ లేకుండా అలానే ఉంచడం దాదాపూ అసాధ్యం. ఎవరైనా ఇలా వాదిస్తే: ప్రజలు నగరం వెలుపల ఆస్తులు కలిగి ఉన్నట్లైతే, అవి తగులబెట్టబడటం చూచి సహనంగా ఉండలేరు. దీర్ఘకాలముట్టడి, స్వార్థపరత్వం వారు తమ రాజును మర్చిపోయేటట్లు చేస్తాయి. దానికి నేను ఇలా సమాధానమిస్తాను. శక్తివంతుడైన మరియు ధైర్యవంతుడైన ఒక రాజు ఒకసారి తన ప్రజలకు కష్టకాలం ఎంతోకాలం కొనసాగదనే ధైర్యాన్నివ్వడం ద్వారా, మరోసారి శత్రువు యొక్క క్రూరత్వం యెడల భయాన్ని కలిగించడం ద్వారా, ఆ తదుపరి బహిరంగంగా అసంతృప్తిని తెలిపేవారిని చాకచక్యంగా నియంత్రించడం ద్వారా ఈ విధమైన కష్టాలన్నింటినీ అధిగమిస్తాడు.

ఇంతే కాకుండా, శత్రువు దండెత్తివచ్చిన వెంటనే - ప్రజల మనసులు ఉద్వేగంతో ఉండి, ఆత్మరక్షణకు సంసిద్ధంగా ఉన్న సమయంలోనే - సహజంగా దేశాన్ని తగులబెట్టి నాశనం చేస్తాడు. ఈ కారణం చేతనే రాజు భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కొంతకాలం గడిచిన తరువాత, ప్రజల ఆవేశాలు చల్లబడిన సమయంలో, ప్రమాదం అప్పటికే జరిగిపోయింది, కష్టాలకు లోనవడం జరిగిపోయింది, దీని నివారణ ఇక ఎంతమాత్రం లేదు. కనుక ప్రజలు ఇప్పుడు తమ రాజుతో మరింతగా సన్నిహితమవడానికి సంసిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అతడిని రక్షించడం కొరకు తమ గృహాలు దహనానికి, తమ ఆస్తులు విధ్వంసానికి గురయ్యాయి కనుక ఆ రాజు ఇప్పుడు తమ యెడల కృతజ్ఞతా భావంతో ఉన్నట్లుగా వారికి కనిపిస్తాడు. ఎందుకంటే తమకు జరిగిన మేలువలన ఎంతగా బంధింపబడతారో (అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో), తాము చేసిన మేలు వలన కూడా అంతగానే బంధింపబడటం (అనుబంధాన్ని ఏర్పరచుకోవడం) మానవస్వభావం. కనుక అన్ని విషయాలను గురించి జాగ్రత్తగా పరిశీలించినట్లైతే తన ప్రజలకు సరైన రక్షణను, అలానే సరైన సరఫరాలను అందించడంలో వైఫల్యం చెందకపోతే వారియొక్క మనసులను మొదటినుండి చివరివరకు స్థిరంగా ఉంచడం ఒక వివేకవంతుడైన రాజుకు కష్టం కాదు (అని చెప్పవచ్చు).


'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 9వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం- 9 

పౌర సంస్థానం గురించి






ఇప్పుడు నేను రెండవ పద్దతి గురించి చెబుతాను. (మొదటి పద్దతి పై అధ్యాయంలో వివరించబడింది) అదేమిటంటే ఒక ప్రముఖ పౌరుడు కుట్ర ద్వారా లేక హింస ద్వారా కాకుండా తన తోటి పౌరుల యొక్క మద్దతుతో తన దేశానికి రాజు కావడం. ఇటువంటి దానిని ‘పౌర రాజ్యం’(civil principality) గా పిలువవచ్చు. దీనిని పొందడానికి గొప్ప ప్రతిభాపాటవాలు గానీ, లేక అసాధారణమైన అదృష్టం గానీ అవసరం లేదు. కేవలం నిశిత దృష్టి (happy shrewdness) మాత్రమే అవసరం. తదుపరి నేను చెప్పేదేమిటంటే అటువంటి రాజ్యం ప్రజల మద్దతు ద్వారాగానీ లేక ప్రభువంశీకుల (nobles) మద్దతు ద్వారా గానీ పొందబడుతుంది. ఎందుకంటే అన్ని నగరాలలోనూ ఈ రెండు వర్గాలు ఉంటాయి. దీనివలన ప్రభువంశీకులచే తాము పరిపాలింపబడకూడదనీ, వారిచే అణచివేతకు గురికాకూడదనీ ప్రజలు కోరుకునే పరిస్థితీ; అలాగే ప్రజలను పాలించాలి, వారిని అణచివేయాలి అని ప్రభువంశీకులు కోరుకునే పరిస్థితీ తలయెత్తుతాయి. అంతేకాక ఈ రెండు విరుద్ధమైన కోరికలనుండి నగరాలలో ఈ మూడింటిలో ఏదో ఒక ఫలితం తలయెత్తుతుంది. అవి సంస్థానం (principality), లేక స్వీయ ప్రభుత్వం (self- government ) లేక అరాచకత్వం (anarchy ).

ప్రజల చేతగానీ లేక ప్రభువంశీకులచేత గానీ - వారిలో ఎవరికో ఒకరికి అవకాశం వచ్చిన దాని ప్రకారంగా - ఒక సంస్థానం సృష్టింపబడుతుంది. ఎలా అంటే ప్రజలను నియంత్రించలేమని గ్రహించిన ప్రభువంశీకులు తమలో ఒకరి యొక్క ప్రఖ్యాతిని నినదిస్తూ- ఆ విధంగా అతని నీడలో వారు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోగలిగేటట్లుగా- అతనిని రాజుగా చేస్తారు. ప్రభువంశీకులను నిరోధించలేమని తెలుసుకున్న ప్రజలు కూడా తమలో ఒకని యొక్క ప్రఖ్యాతిని నినదిస్తూ- అతని అధికారం ద్వారా ఆత్మరక్షణ చేసుకునేటట్లుగా- అతడిని రాజుగా చేస్తారు. ప్రభువంశీకుల సహాయం ద్వారా సార్వభౌమత్వాన్ని పొందినవాడు ప్రజల సహాయం ద్వారా దానిని చేరుకున్నవాని కన్నా ఎక్కువ కష్టంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే మొదటివాని చుట్టూ అతనితో సములుగా తమను భావించుకునే వారు అనేకమంది ఉంటారు. దీనిమూలంగా అతడు వారిని తన అభీష్టానుసారంగా పాలించనూలేడు లేక సమాధానపరచనూ లేడు. అయితే ప్రజామద్దతుతో సార్వభౌమత్వాన్ని చేరుకున్నవాడు తానొక్కడే ఉంటాడు. అతనియెడల విధేయత చూపడానికి సిద్ధంగా లేనివారు అతని చుట్టూ కొద్దిమందే ఉంటారు, లేనిచో అసలు ఉండరు.

దీనికి తోడుగా నిజాయితీగా వ్యవహరించడం ద్వారా మరియు ఇతరులకు హాని తలపెట్టకుండా ప్రభువంశీకులను ఎవరూ తృప్తిపరచలేరు. కానీ ప్రజలను తృప్తిపర్చవచ్చు. ఎందుకంటే వారిలక్ష్యం ప్రభువంశీకుల లక్ష్యం కన్నా ఎక్కువ ధర్మబద్ధమైనది. ప్రభువంశీకులు అణచివేయాలని కోరుకుంటే ప్రజలు కేవలం అణచి వేతకు గురికాకూడదని మాత్రమే కోరుకుంటారు. మరో విషయం ఏమిటంటే శత్రుత్వం వహించిన ప్రజలనుండి రాజు తనను ఎన్నడూ రక్షించుకోలేడు, ఎందుకంటే వారు అనేకమంది ఉంటారు. అదేసమయంలో ప్రభువంశీకుల నుండి అతడు తనను రక్షించుకోగలుగుతాడు. ఎందుకంటే వారు సంఖ్యలో కొద్దిమందే ఉంటారు గనుక. శత్రుత్వం వహించిన ప్రజల వలన ఏ రాజైనా మహా అయితే వారిచే త్యజించబడవచ్చు (abandonment). కానీ శతృత్వం వహించిన ప్రభువంశీకుల వలన త్యజించబడే భయమేకాదు, వారంతా ఇతడిమీద తిరగబడే (rise against) అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వారు చాలా గొప్ప చాకచక్యాన్ని (craft) మరియు దూరదృష్టిని కలిగి ఉండటం వలన వారు ఎల్లప్పుడూ కాలం తమ రక్షణకు అనుకూలంగా ఉండేటట్లు చూచుకొంటారు, అంతేకాక విజేత ఎవరు అవగలరని వారు భావిస్తారో వాని పక్షాన ఉండటాన్నే వారు కోరుకుంటారు. ఇంకా రాజు ఎల్లప్పుడూ అదే ప్రజలతో కలసి జీవించక తప్పదు. కానీ అదే ప్రభువంశీకులతోనే ఎల్లప్పుడూ కలసి జీవించవలసిన అవసరం మాత్రం లేదు. ఎందుకంటే వారిని అతడు ఏరోజైనా రూపొందించగలడు మరియు రూపుమార్చగలడు (make and unmake). అంతేకాక తనకిష్టం వచ్చినపుడు వారికి అధికారం ఈయనూగలడు లేక తీసివేయనూగలడు.

ఐతే ఈ విషయాన్ని తేటతెల్లం చేయడానికి, ప్రభువంశీకులు ప్రధానంగా రెండువిధాలుగా పరిగణించబడాలని నేను చెబుతున్నాను. ఎలా అంటే నీ పురోభివృద్ధిలో పాలుపంచుకునేటట్లుగా తమ నడవడికను మలచుకునేవారు (binds them entirely to your fortune) లేక అలా చేయనివారు. ఆవిధంగా పాలుపంచుకునేవారిని -వారు దురాశలేని వారైనట్లైతే (దోపిడీ ప్రవృత్తి లేని వారైనట్లైతే)- వారిని ప్రేమించాలి మరియు గౌరవించాలి. ఆ విధంగా పాలుపంచుకోని వారిని మరలా రెండువిధాలుగా పరిగణించాలి. పిరికితనం వలన మరియు సహజంగానే వారికి ధైర్యం లేకపోవడం వలన కొందరు ఆ విధంగా చేయకపోవచ్చు (పాలుపంచుకోకపోవచ్చు). అలాంటపుడు వారి సేవలను నీవు పొందాలి -మరిముఖ్యంగా వారిలో వివేకవంతులైన వారి సేవలు- ఎందుకంటే మంచిరోజులలో వారు నిన్ను గౌరవిస్తారు, కష్టకాలంలో వారివలన నీకు ఏవిధమైన భయం ఉండదు. కానీ ఉద్దేశ్యపూర్వకంగా మరియు స్వార్థపూరిత లక్ష్యాలతో వారు నీ పురోభివృద్ధిలో పాలుపంచుకోక దూరంగా ఉంటే అది వారు నీ గురించి కన్నా తమ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారన్నదానికి నిదర్శనం. అటువంటి వ్యక్తులతో రాజనేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారు తనకు బాహాటమైన శతృవులు అన్నట్లుగా వారితో వ్యవహరించాలి. ఎందుకంటే అతడి కష్టకాలంలో ఎల్లప్పుడూ అతడి వినాశనానికే వారు కృషి చేస్తారు.

కనుక ప్రజల మద్దతుతో రాజైన వాడు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలి. తన వలన అణచివేతకు గురికాకుండా ఉండటాన్ని మాత్రమే వారు కోరుకుంటున్నారని తెలుసుకుని అతడు సులభంగానే వారితో స్నేహపూర్వకంగా ఉండగలుగుతాడు. కానీ ఎవరైతే ప్రజలకు వ్యతిరేకంగా, ప్రభువంశీకుల మద్దతుతో రాజౌతాడో అతడు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవడాన్నే కోరుకోవాలి. వారిని తన సంరక్షణలోనికి తీసుకున్నట్లైతే దానిని అతడు సులువుగానే నెరవేర్చగలుగుతాడు. ఎందుకంటే మనుషులు, తాము ఎవరినుండైతే చెడును ఊహిస్తున్నారో వారినుండే తమకు మంచి ఎదురైనపుడు అలా మంచి చేసినవానితో వారు మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఆ విధంగా తమ మద్దతుతో రాజైనప్పటికంటే త్వరితంగా, మరింతగా ప్రజలు అతడిని ప్రేమిస్తారు (అతడికి అంకితమౌతారు). ఒకరాజు ప్రజల ప్రేమను పొందడానికి అనేక మార్గాలున్నాయి. కానీ అవన్నీ పరిస్థితులను బట్టి మారతాయి కనుక ఎవరూ స్థిరమైన సూత్రీకరణలను చేయలేరు. కనుక నేను వాటిని వదిలివేస్తున్నాను. ఐతే నేను మరలా చెబుతున్నాను. ఒక రాజుకు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండటం అనేది అవసరం, లేనిచో కష్టకాలంలో అతనికి రక్షణ ఉండదు.

నబీస్ (Nabis) అనబడే స్పార్టన్ల రాజు మొత్తం గ్రీసు దేశం చేసిన దాడిని మరియు విజయోత్సాహంతో ఉన్న రోమన్ సైన్యం యొక్క దాడిని తట్టుకుని వారి నుండి తన దేశాన్ని మరియు తన ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు. ఈ ముప్పును అధిగమించడానికి అతడికి కొద్దిమంది నుండి మాత్రమే తనను రక్షించుకోవలసిన అవసరం ఏర్పడినది. ప్రజలు కనుక శతృత్వంతో ఉన్నట్లైతే ఇది (ఈ జాగ్రత్త) సరిపోయి ఉండేదికాదు. “ ప్రజలను నమ్ముకున్నవాడు బురదను నమ్ముకున్నట్లే” (He who builds on the people, builds on the mud) అనే సాధారణ సామెత ద్వారా నేను చెప్పిన ఈ విషయాన్ని ఎవరూ సవాలు చేయవద్దు. ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి ప్రజలను నమ్ముకుని, తాను తన శత్రువుల చేతగానీ, లేక ప్రభుత్వాధికారుల చేతగానీ అన్యాయానికి గురైనపుడు, తనను ప్రజలు రక్షిస్తారని అనుకుంటే ఆ సామెత నిజమే కావచ్చు. ఎందుకంటే అటువంటి సందర్భాలలో ఎక్కువగా అతడు మోసపోవడమన్నదే జరుగుతుంది. రోమ్‌లో గ్రాచికి మరియు ఫ్లోరెన్స్‌లో మెస్సర్ జెయోర్జియోస్కాలి కి ఇలానే జరిగింది. కానీ ప్రజలలో నమ్మకాన్ని ఉంచినది ఒక రాజు -శాసించగలిగిన వాడు, ధైర్యవంతుడు, కష్టకాలంలో నిరుత్సాహపడనివాడు, తగుజాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపనివాడు, తన స్థిరనిర్ణయంతో, ఉత్సాహంతో ప్రజలందరిలో ఉత్తేజాన్ని నింపేవాడు- అయినట్లైతే అతడు మోసగింపబడడు. పైగా అతడు తన పునాదులను చక్కగా నిర్మించుకున్నట్లుగా తెలుస్తుంది.

(నబిస్: స్పార్టా నియంత, 195 B.C లో ఫ్లామినినస్ నేతృత్వంలో రోమన్లచే జయించబడ్డాడు. 192B.C లో చంపబడ్డాడు.)

ఇటువంటి సంస్థానాలు, పౌరసంస్థానాల నుండి నిరంకుశ రాజ్యాలుగా మారే క్రమంలో వీటికి కష్టకాలం సంభవిస్తుంది. ఎందుకంటే వీటి యొక్క రాజులు వ్యక్తిగతంగానైనా పరిపాలిస్తారు లేక పరిపాలనాధికారుల ద్వారానైనా ( through magistrates) పరిపాలన సాగిస్తారు. రెండవ పద్దతిలో వారి ప్రభుత్వం బలహీనంగానూ మరియు మరింత అరక్షితంగానూ ఉంటుంది. ఎందుకంటే అది పూర్తిగా పరిపాలనాధికారులుగా వ్యవహరిస్తున్న పౌరుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అంతే కాక ఈ పరిపాలనాధికారులు మరిముఖ్యంగా కల్లోల సమయంలో రహస్యమైన కుట్ర ద్వారాగానీ లేక బాహాటమైన వ్యతిరేకత ద్వారాగానీ ప్రభుత్వాన్ని చాలా సులువుగా కూలదోయగలరు. అంతేగాక రాజుకు కల్లోల సమయం నడుమన నిరంకుశాధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఉండదు. ఎందుకంటే పౌరులు మరియు ప్రభుత్వ సిబ్బంది (citizens and subjects) పరిపాలనాధికారుల నుండి ఆదేశాలు అందుకోవడానికి అలవాటుపడి ఉండటంతో ఈ గందరగోళం మధ్యన అతడికి విధేయత చూపగలిగే స్థితిలో ఉండరు. అంతేకాక కష్టకాలంలో అతడు విశ్వసించగల మనుషుల కొరత ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే అటువంటి రాజు తాను శాంతి సమయాలలో ఆచరించే వాటిమీద ఆధారపడలేడు. శాంతి సమయంలో పౌరులు రాజ్యం యొక్క అవసరంలో ఉంటారు. అప్పుడు ప్రతిఒక్కరూ అతనితో ఏకీభవిస్తారు, అందరూ హామీ ఇస్తారు, మృత్యువు సుదూరంగా ఉన్న ఆ సమయంలో అతని కొరకు మరణించడానికి అందరూ సిద్ధపడతారు. ఐతే కష్టకాలంలో, అంటే రాజ్యం పౌరుల యొక్క అవసరంలో ఉన్నపుడు వారిలో కొద్దిమంది మాత్రమే అతనికి లభిస్తారు. అంతేకాక ఈ ప్రయోగం ఎంతో ప్రమాదకరమైనది కనుక దీనిని ఒకసారి మాత్రమే ప్రయత్నించాలి. కనుక వివేక వంతుడైన రాజు తన పౌరులు అన్నిరకాలైన, అన్నివిధాలైన పరిస్థితులలోనూ, ఎల్లప్పుడు కూడా రాజ్యం యొక్క మరియు తనయొక్క అవసరాన్ని కలిగి ఉండేటట్లుగా జాగ్రత్తపడాలి. అప్పుడు వారంతా ఎల్లవేళలా విశ్వాసపాత్రులుగానే ఉంటారు.


'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 8వ అధ్యాయం





రాజు - రాజ్యం



అధ్యాయం - 8

కుట్రద్వారా రాజ్యాధికారాన్ని పొందినవారి గురించి






సాధారణ స్థితినుండి ఒక వ్యక్తి రాజుగా ఎదగడానికి అదృష్టం ద్వారానో లేక ప్రతిభద్వారానో కాకుండా మరో రెండు పద్దతులు కూడా ఉన్నాయి. రిపబ్లిక్‌ల గురించి చెప్పేటపుడు వాటిలో ఒకటి విస్తృతంగా చర్చించబడినా కూడా వాటిని ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేను. ఆ మార్గాలు ఏవంటే కుట్ర, కుతంత్రాలద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం లేదంటే ఒక సాధారణవ్యక్తి తోటిపౌరుల యొక్క సహాయ సహకారాల ద్వారా తన దేశానికి రాజు కావడం. మొదటి పద్దతి రెండురకాల ఉదాహరణల ద్వారా వివరించబడుతుంది. ఒకటి ప్రాచీనమైనది, మరోటి ఆధునికమైనది. (రెండవపద్దతి గురించి తరువాతి (9వ) అధ్యాయంలో వివరించబడుతుంది) ఇక ఈ విషయంలోకి మరింత లోతుకి వెళ్ళకుండా, వాటిని అనుసరించాలనుకునే వారికి ఈ రెండు ఉదాహరణలు చాలని నేను అనుకుంటున్నాను.

అగాథోక్లెస్ (Agathocles, 361BC-289BC) అనబడే సిసిలియన్ మామూలు స్థితి మాత్రమే కాదు, అతి దుర్భరమైన స్థితినుండి సిరాకస్ కు రాజు అయ్యాడు. (ఇటలీకి సమీపంలోగల ‘సిసిలీ’ అనే ద్వీపంలో ‘సిరాకస్’ అనే నగరం ఉన్నది) ఒక కుమ్మరివాని కొడుకైన ఇతడు తన కెరీర్‌లోని అన్ని దశలలోనూ చాలా దుష్ప్రవర్తనతో కూడిన జీవితం గడిపాడు. అయినప్పటికీ ఇతడు దుష్ప్రవర్తనకు తోడుగా మానసికంగానూ మరియూ శారీరకంగానూ దృఢత్వం కలిగినవాడవడంతో సైన్యంలో చేరి అంచెలంచెలుగా Praetor of Syracuse స్థాయికి ఎదిగాడు. ఆ స్థానంలో నిలదొక్కుకోవడంతోనే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనీ, అలాగే అప్రయత్నంగా ప్రజామోదంతో సాధించుకున్న ఆ అధికారాన్ని ఇతరులకు బద్ధుడు కాకుండా హింసతో నిలుపుకోవాలనీ బాగా యోచించి నిర్ణయించుకున్నాడు. ఈ లక్ష్యం కొరకు అతడు ఆ సమయంలో తన సైన్యంతో సిసిలీలో యుద్ధం చేస్తున్న అమిల్కర్ (Amilcar) అనే కార్తజినియన్‌తో ఒక అవగాహనకు వచ్చాడు. ఒక రోజు ఉదయం ఇతడు రిపబ్లిక్ కు సంబంధించిన విషయాలను చర్చించాలనే మిషతో సిరాకస్ పట్టణపు ప్రజలను, సెనేట్‌ను సమావేశపరిచాడు. అతడి సైగతో సైనికులు సెనేటర్స్ అందరినీ, మరియు ప్రజలలో ధనవంతులనూ హతమార్చారు. ఆ విధంగా వారు హతమార్చబడిన తరువాత ఆ నగర సార్వభౌమత్వాన్ని అతడు ఎటువంటి ప్రజావ్యతిరేకత లేకుండా చేజిక్కించుకున్నాడు. (ఆ తరువాత) అతడు కార్తజినియన్లచే రెండు సార్లు ఓడింపబడి, చివరికి ముట్టడింపబడినప్పటికీ తన నగరాన్ని రక్షించుకోగలగటమే కాదు, నగర రక్షణార్థం కొంత సైన్యాన్ని వదలి, మిగతా సైన్యంతో ఆఫ్రికా మీద దండెత్తి అనతికాలంలోనే సిరాకస్ నగరాన్ని ముట్టడి నుండి విముక్తం చేశాడు. గత్యంతరం లేని పరిస్థితిలో కార్తజినియన్‌లు అగాథోక్లెస్‌తో సంధిచేసుకుని, సిసిలీని అతనికే వదిలేసి ఆఫ్రికాతో సరిపెట్టుకున్నారు.

దీనిని బట్టి అతడి యొక్క చేతలను మరియు అతడు సాధించిన విజయాలను పరిశీలించినవారు అందులో అదృష్టం పాత్ర ఏమీలేదని తెలుసుకుంటారు. పైన తెలిపినట్లుగా ఏ ఒక్కరి సహాయం లేకుండా, సైనికవృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి, ప్రతీదశనూ అనేక కష్టనష్టాలతో అధిగమించి, అద్వితీయమైన స్థానాన్ని చేరుకుని, ఆ తదుపరి ఆ స్థానాన్ని ఎంతో ధైర్యంతో అనేక ప్రమాదాలకోర్చి పదిలంచేసుకున్నాడు. అయినా కూడా తోటి పౌరులను హతమార్చడం, స్నేహితులను మోసం చేయడం, విశ్వాసం, దయ, మతం అన్నవి లేకుండా ఉండటం; ఇవన్నీ ప్రతిభాసామర్థ్యాలుగా గణింపబడవు. అటువంటి పద్దతులు సామ్రాజ్యాన్ని తెస్తేతేవచ్చు గానీ, పేరు ప్రతిష్టలను తేలేవు. అయినా కూడా కష్టనష్టాలను సహించడంలో మరియు వాటిని అధిగమించడంలో అగాథోక్లెస్ యొక్క మానసిక దృఢత్వంతోబాటు, ప్రమాదాలలోకి అడుగిడటంలో మరియూ వాటినుండి బయటపడటంలో అతడి యొక్క ధైర్యాన్ని పరిశీలించినట్లైతే ప్రఖ్యాత నాయకుల కన్నా అతడు తక్కువగా ఎందుకు పరిగణింపబడుతున్నాడో మనకు కారణం కనబడదు. అయినప్పటికీ ఇతడి ఆటవిక కౄరత్వం మరియు అంతులేని ఘోరకృత్యాలతో కూడుకున్న అమానవీయత ప్రఖ్యాత వ్యక్తులతో బాటుగా ఇతడిని పరిగణించడానికి అనుమతించవు. కనుక, ఏ విధంగా కూడానూ ఇతడు సాధించిన దానికి కారణంగా అదృష్టాన్నో లేక ప్రతిభనో మనం చూపలేము.

ఈ రోజులలో, 6వ అలెగ్జాండర్ పరిపాలనా సమయంలో ఓలివెరొట్టో డ ఫెర్మో (Oliverotto da Fermo) చాలా సంవత్సరాల క్రితమే అనాథగా మారి గివోవన్ని ఫొగ్లియని అనబడే తన మేనమామచే పెంచబడ్డాడు. అతడి యవ్వన ప్రారంభ దినాలలో పగోలో విటెల్లి క్రమశిక్షణలో తర్ఫీదు పొంది, సైన్యంలో ఉన్నత స్థాయిని పొందాలనే ఉద్దేశ్యంతో అతడి క్రింద పనిచేయడానికి సైన్యంలో చేర్చబడ్డాడు. పగోలో చనిపోయిన తరువాత అతడి సోదరుడైన విటెల్లొజొ క్రింద సైన్యంలో పనిచేసి, అనతికాలంలోనే తన తెలివితేటలతో, శారీరక, మానసిక దృఢత్వంతో తన వృత్తిలో అగ్రగణ్యుడిగా నిలిచాడు. కానీ ఇతరుల వద్ద పనిచేయడం చిన్నతనంగా భావించిన అతడు ఫెర్మో రాజ్యం యొక్క స్వేచ్ఛకన్నా దాని బానిసత్వాన్నే ఎక్కువగా కోరుకున్న (దేశద్రోహులైన) ఆ రాజ్యపు పౌరులు కొందరి సహాయంతో మరియు విటెల్లెషి మద్దతుతో ఫెర్మోను స్వాధీనం చేసుకోవాలని పథక రచన చేశాడు. ఆ పథకం ప్రకారం అతడు తన మేనమామ అయిన గియోవన్ని పొగ్లియానికి ఈ విధంగా జాబు రాశాడు. చాలా సంవత్సరాలనుండి ఇంటికి దూరంగా ఉండటం వలన, తనను, స్వంత ఊరిని ఓసారి చూడాలనుకుంటున్నట్లు, అలాగే తన తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తి సంగతి కూడా ఓసారి పరికించాలనుకుంటున్నట్లు రాశాడు. ఇంకా తాను గౌరవాన్ని పొందడానికి తప్ప మరిదేని కోసం శ్రమించనప్పటికీ, స్వంత ఊరి ప్రజలకు తాను ఇన్నాళ్ళూ సమయాన్ని వ్యర్థంగా గడపలేదని తెలియజేయటం కొరకు గౌరవప్రదంగా ఆ ఊరికి రావాలనుకుంటున్నట్లు, అందుకొరకు తన స్నేహితులు, అనుచరులతో కూడిన వందమంది గుఱ్ఱపు రౌతులను వెంట తేవాలని అనుకుంటున్నట్లు రాశాడు. ఇంకా తనను ఫెర్మియన్‌లు గౌరవప్రదంగా స్వాగతించేటట్లు గా ఏర్పాటు చేయమని తన మేనమామను అర్థిస్తూ, అది అంతా తానొక్కడికే గౌరవం కాదనీ, తనను పెంచి పెద్దచేసిన తన మేనమామకు కూడా గౌరవమేనని కూడా రాశాడు.

ఆ ప్రకారంగా గియోవన్ని తన మేనల్లుడికి జరగవలసిన గౌరవమర్యాదలలో లోటులేకుండా చూచాడు. ఫెర్మియన్స్ అతడిని సగౌరవంగా స్వాగతించేటట్లు చేసి, తన స్వంత ఇంటిలోనే అతడికి బస ఏర్పాటు చేశాడు. అక్కడ కొద్ది రోజులు గడిపి, తన దుర్మార్గమైన పథకానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న ఓలివెరొట్టొ (పథకం ప్రకారం) ఒక ఘనమైన విందును ఏర్పాటుచేసి దానికి తన మేనమామ అయిన గియోవన్ని ఫోగ్లియానిని మరియు ఫెర్మో నగరానికి చెందిన ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. విందు మరియు అటువంటి విందులలో సాధారణంగా ఉండే వినోద కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత ఓలివరెట్టో తెలివిగా పోప్ అలెగ్జాండర్ మరియు అతడి కొడుకైన సీజర్ బోర్గియాల గొప్పతనం గురించి మరియు వారు చేపడుతున్న కార్యాల గురించి మాటాడుతూ గంభీరమైన చర్చను ప్రారంభించాడు. అతడు మాట్లాడుతున్న దానికి గియోవన్ని మరియు ఇతరులు సమాధానమిస్తుండగా అతడు హఠాత్తుగా పైకి లేచి, ఇటువంటి విషయాలను అందరి ముందూ కాక వ్యక్తిగతంగా (ప్రైవేటుగా) మాట్లాడుకోవాలని చెబుతూ మరో గదిలోనికి నడిచాడు. గియోవన్ని మరియు ఇతరులు కూడా అతడిని అనుసరించి అదే గదిలోనికి వెళ్ళారు. వారు అక్కడ ఆసీనులయ్యారో లేదో రహస్య ప్రదేశాలలో దాగి ఉన్న సైనికులు దూసుకొచ్చి గియోవన్ని మరియు మిగిలినవారిని హతమార్చారు. ఈ హత్యాకాండ తరువాత ఓలివెరొట్టొ తన అశ్వాన్ని అధిరోహించి, నగర వీధులలో కలియదిరుగుతూ- ప్రజలు భయంతో విధిలేక తనకు విధేయత తెలపడానికీ మరియు తాను రాజుగా ఉండే ప్రభుత్వాన్ని అనుమతించడానికీ గాను- చీఫ్ మెజెస్ట్రేట్‌ను రాజసౌధంలో బంధించాడు. అసంతృప్తితో తనకు హాని తలపెట్టగలిగే వారినందరినీ హతమార్చాడు. అంతేకాక ఆ రాజ్యాన్ని నిలుపుకున్న సంవత్సరకాలంలో అతడు ఫెర్మో నగరం మీద పట్టును కలిగి ఉండటమే కాక తన ఇరుగుపొరుగు వారందరికీ అసాధ్యుడుగా మారే విధంగా నూతనమైన పౌర, సైనిక శాసనాలతో శక్తివంతుడిగా రూపొందాడు. సీజర్ బోర్గియా చేత గనుక ఇతడు మోసగింపబడకపోయినట్లైతే ఇతడిని పదవీచ్యుతిడిని చేయడం అగాథోక్లెస్ ను పదవీచ్యుతుణ్ణి చేయడమంత కష్టమయి ఉండేది. కానీ సీజర్ బోర్గియా పైన చెప్పిన విధంగా ఇతడిని సినిగాలియాలో ఓర్సిని, విటెల్లిల తోపాటుగా పట్టుకున్నాడు. ఆ విధంగా తన మేనమామను చంపిన ఒక సంవత్సరకాలం తరువాత, ధైర్యసాహసాలలో మరియు దుర్మార్గంలో తనకు గురువైన విటెల్లొజొ తో పాటుగా పీక నులిమి చంపబడ్డాడు (Strangled).

ఇతరులు అనేకమంది కౄరత్వం మూలంగా యుద్ధసమయం సంగతి దేముడెరుగు కనీసం శాంతియుత సమయంలో సైతం తమ రాజ్యాన్ని రక్షించుకోలేకపోతుంటే, అగాథోక్లెస్ మరియు అటువంటి ఇంకొందరు అనంతంగా ఘోరకృత్యాలకూ మరియు కౄరత్వానికీ పాల్పడిన తరువాత కూడా తమ దేశంలో చిరకాలం సురక్షితంగా మనగలగడం, బాహ్యశత్రువుల నుండి తమను తాము రక్షించుకోగలగడం, ప్రజలు వారి యెడల ఎన్నడూ కుట్రకు పాల్పడకపోవడం….ఇదంతా ఎలా సంభవం అని ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఐతే ఇది కౄరత్వాన్ని ‘సరిగా అమలు చేయడం’, లేక ‘సరిగా అమలు చేయకపోవడం’ అన్న దాన్ని అనుసరించి జరిగింది అని నేను నమ్ముతున్నాను. ఆత్మరక్షణార్థం ఒకేఒక్క సమయంలో అమలు చేయబడిన కౄరత్వాన్ని, తదుపరి కాలంలో -ప్రజల మంచి కోసం వినియోగపడని పక్షంలో- కొనసాగకుండా ఉండే కౄరత్వాన్ని ‘సరిగా అమలు చేయబడిన కౄరత్వం’ (well employed ) గా చెప్పవచ్చు (చెడును సరియైనది అని చెప్పడం సాధ్యమైనట్లైతే). ఆరంభంలో స్వల్పంగా ఉండి కాలం గడిచే కొలదీ తగ్గకపోగా ద్విగుణీకృతమౌతూ పోయేది ‘సరిగా అమలు చేయబడని కౄరత్వం’ (ill-employed). మొదటి పద్దతిని ఆచరించేవారు దైవసహాయం ద్వారాగానీ లేక మానవసహాయం ద్వారాగానీ అగాథోక్లెస్ వలే తమ పరిపాలనను కొంత సులువుగా చేయగలుగుతారు. రెండవ పద్దతిని అనుసరించేవారికి తమను తాము కాపాడుకోవడం సాధ్యం కాదు.

ఒక రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నపుడు విజేత తాను తీసుకోవలసిన కఠిన చర్యలన్నింటినీ (తాను చేయవలసిన గాయాలన్నింటినీ) క్షుణ్ణంగా పరీక్షించి, వాటిని ప్రతిరోజూ పునరావృతం చేయవలసిన పనిలేకుండా వాటన్నింటిని ఒకేదెబ్బతో అమలు చేయవలసి ఉన్నది. ఆ విధంగా ప్రజలను అస్థిరపరచకుండా ఉండటం ద్వారా వారిలో తిరిగి నమ్మకాన్ని కలిగించగలుగుతాడు. అంతేకాక వారికి మేలుచేయడం ద్వారా వారి అభిమానాన్ని సంపాదిస్తాడు. పిరికితనం వలన గానీ, లేక చెడుసలహా వలన గానీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించేవాడు ఎల్లప్పుడూ ఖడ్గాన్ని చేబూని ఉండవలసి వస్తుంది. అతడు ప్రజల మీద ఆధారపడలేడు, నిరంతరం అదే పనిగా పునరావృతమయ్యే కౄరత్వం వలన బాధలను అనుభవిస్తున్న ప్రజలు కూడా ఇతడిని విశ్వాసపాత్రుడిగా చూడరు. అందువలన గాయలన్నింటినీ కూడా ఒకేసమయంలో చేస్తే తక్కువగా బాధిస్తాయి గనుక తక్కువ ఆగ్రహాన్నే కలుగజేస్తాయి. చేసే మేలును మాత్రం కొద్దికొద్దిగా చేస్తే ఆ ఆనందం దీర్ఘకాలం ఉంటుంది.

అన్నిటికన్నా ముఖ్యంగా రాజనేవాడు అనుకోకుండా జరిగే మంచి లేక చెడు సంఘటనల వలన తన ప్రవర్తనా విధానం మారకుండా ఉండే విధంగా తన ప్రజల మధ్యన జీవించాలి. ఎందుకంటే మారవలసిన అవసరం కష్టకాలంలో కలిగితే అప్పటికి కఠిన చర్యలు తీసుకునే సమయం మించిపోయి ఉంటుంది. అలాగే మెతకవైఖరి అవలంబిస్తే, నీవు తప్పనిసరి పరిస్థితిలో అలా ప్రవర్తించావని పరిగణింపబడి, దాని నిమిత్తం ఏ ఒక్కరూ నీకు కృతజ్ఞత చూపకపోవడంతో నీకు ఏ విధంగానూ ఆ మెతక చర్యలు సహాయకారిగా ఉండవు.


'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 7వ అధ్యాయం






రాజు - రాజ్యం



అధ్యాయం - 7

ఇతరుల సహాయం ద్వారా లేక అదృష్టం ద్వారా పొందిన నూతన సంస్థానాల గురించి






సాధారణ స్థితినుండి కేవలం అదృష్టం వలన రాజులుగా మరిన వారికి అలా మారడంలో పెద్ద కష్టమేమీ ఉండదు. కానీ ఆస్థానాన్ని నిలుపుకోవడంలో మాత్రం వారు ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటారు. తమ లక్ష్యాన్ని వారు రెక్కలతో ఎగురుకుంటూ చేరుతున్నారా అన్నట్లుగా వారు తమ మార్గంలో ఏవిధమైన ఆటంకాన్ని ఎదుర్కోవడం జరగదు. కానీ ఆ అత్యున్నత స్థానాన్ని చేరుకున్న తరువాత మాత్రం వాళ్ళను కష్టాలు ముంచెత్తుతాయి. ధనానికి బదులుగాగానీ, లేక దాత యొక్క ప్రసన్నత వలన గానీ రాజ్యాన్ని పొందినవారు ఈ విభాగానికి చెందుతారు. గ్రీసు దేశంలో అయోనియా మరియు హెల్లెస్పాంట్ ప్రాంతాలలోని నగరాలలో డేరియస్‌చే అనేక మంది రాజులుగా రూపొందించబడ్డారు. డేరియస్ యొక్క రక్షణ మరియు పేరుప్రఖ్యాతుల కొరకు వారు ఆ నగరాలను పాలిస్తుంటారు. సైన్యాన్ని అవినీతికి పాల్పడేటట్లు చేయడం ద్వారా సాధారణ స్థితి నుండి సామ్రాజ్యాన్ని పొందిన చక్రవర్తులు కూడా ఈ విభాగానికే చెందుతారు. అటువంటి రాజులు పూర్తిగా తమకు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టిన రాజు యొక్క ప్రసన్నత మీద మరియు అతని యొక్క బాగోగుల మీద ఆధారపడి ఉంటారు. అవి రెండూ స్థిరమైనవీ కావు, సురక్షితమైనవీ కావు. అంతేకాక వారిలో తమ స్థానాన్ని కాపాడుకోగల పరిజ్ఞానం గానీ, శక్తిగానీ లోపించి ఉంటాయి. వారికి కావలసిన పరిజ్ఞానం ఎందుకు ఉండదంటే మంచి నైపుణ్యం మరియు బలమైన వ్యక్తిత్వం ఉంటే తప్ప చిరకాలం సాధారణ వ్యక్తులుగా జీవించిన అటువంటి వారికి రాజ్యాన్ని ఎలా పాలించాలో తెలిసి ఉంటుందని అనుకోలేము. వారికి కావలసిన శక్తి ఎందుకు ఉండదంటే విశ్వాశపాత్రమైన సైన్యాలు వారికి ఉండవు.

అనుకోకుండా హఠాత్తుగా పొందబడిన రాజ్యాలు -ప్రకృతిలో పుట్టిన పిమ్మట త్వరితగతిన పెరిగే అన్ని ఇతర విషయాలవలే- తమను తాకే మొదటి తుఫాను గాలికే కూలిపోకుండా నిలవగలిగేలా వేళ్ళూనుకోవడంగానీ, పట్టును కలిగి ఉండటం గానీ ఎన్నడూ జరగదు. ముందే చెప్పినట్లుగా అలా ఒక్కసారిగా రాజులైనవారు విధి తమ ఒడిలో చేర్చిన దానిని కాపాడుకోవడాన్ని త్వరితగతిన నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగి ఉండి, తాను రాజవడానికి ముందు ఆ రాజ్యానికి ఇతరులచే వేయబడిన పునాదులను తాను రాజయిన పిమ్మట కూడా బలీయం చేయగలిగితే మాత్రం అది ఇందుకు మినహాయింపు.

సామర్థ్యంతోగానీ, అదృష్టం వలనగానీ రాజుగా ఎదిగే ఈ రెండు విధానాలకు సంబంధించి నాకు జ్ఞాపకం ఉన్న కాలపరిధినుండి రెండు ఉదాహరణలను సూచిస్తాను. అవి Francesco Sforza మరియు Cesare Borgia. ఫ్రాన్సెస్కో తగిన మార్గాల ద్వారా, అసాధారణ సామర్థ్యంతో సాధారణస్థితి నుండి డ్యూక్ ఆఫ్ మిలన్‌గా ఎదిగాడు. అనేక ప్రయత్నాల ద్వారా పొందిన ఆ స్థానాన్ని స్వల్ప ప్రయాస ద్వారానే కాపాడుకున్నాడు. మరో పక్క ప్రజలచే డ్యూక్ ఆఫ్ వాలెంటినో గా పిలువబడే సీజర్ బోర్గియా తన తండ్రి ప్రాబల్యం సాగుతున్న కాలంలో రాజ్యాన్ని సంపాదించాడు. ఆవిధంగా ఇతరుల సైన్యం మరియు ఐశ్వర్యం ద్వారా తాను పొందిన రాజ్యంలో వేళ్ళూనుకోవడానికి ఒక వివేకవంతుడైన వాడు మరియు ఒక సమర్థవంతమైనవాడు చేయవలసిన ప్రతీ పనీ చేసినప్పటికీ, తీసుకోవలసిన ప్రతీ చర్యా తీసుకున్నప్పటికీ తన తండ్రి ప్రాబల్యం క్షీణించగానే ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు.

ఎందుకంటే పైన తెలిపిన విధంగా తన అధికారానికి పునాదులను ముందుగా నిర్మించుకోనివాడు తనకు సామర్థ్యం ఉన్న పక్షంలో తరువాత నిర్మించుకుంటాడు. ఐతే ఆ పునాదులు భవనానికీ, భవన నిర్మాతకు కూడా కష్టాన్ని కొనితెచ్చేటట్లుగా నిర్మించబడతాయి. డ్యూక్ ఆఫ్ వాలెంటినో గైకొన్న వివిధ చర్యలను మనం పరిశీలించినట్లైతే తన భవిష్యత్ అధికారం కొరకు అతడు ఎంతో బలమైన పునాదులు నిర్మించుకున్నాడని తెలుస్తుంది. వాటి గురించి చర్చించడం అనవసరమని నేను అనుకోను. ఎందుకంటే ఒక కొత్త రాజుకు నేర్పడానికి అతడి చేతలకన్నా ఉత్తమమైన పాఠాలు ఏమిటో నాకు తెలియదు. అతడు గైకొన్న చర్యలు అతడికి అంతిమవిజయాన్ని సమకూర్చలేక పోవడంలో అతడి దోషం ఏమీలేదు. దానికి కారణం అసాధారణంగా, అత్యంత తీవ్రంగా విధి వక్రించడమే.

తన కొడుకైన డ్యూక్ వాలెంటినోను గొప్పవాడిని చేసే ప్రయత్నంలో పోప్ అలెగ్జాండర్-6 సమీప మరియు సుదూర కష్టాలను అనేకం ఎదుర్కొన్నాడు. మొదటగా చర్చికి చెందని రాజ్యానికి అతడిని ప్రభువును చేయడానికి అతడికి మార్గమేమీ కనపడలేదు. అదే సమయంలో చర్చికి చెందే రాజ్యానికి అతడిని ప్రభువును చేయాలనుకుంటే అందుకు డ్యూక్ ఆఫ్ మిలన్ మరియు వెనటియన్స్ సమ్మతించరని తెలుసు. ఎందుకంటే ఫయెంజా మరియు రిమిని అప్పటికే వెనటియన్స్ యొక్క సంరక్షణలో ఉన్నాయి. తదుపరి అతడు ఎదుర్కొన్న కష్టం: ఇటలీ సైన్యాలు, మరీ ముఖ్యంగా తనకు సహాయంగా నిలవగలిగే అవకాశం ఉన్న సైన్యాలు తన ప్రాభవానికి భయపడే వారైన ఓర్సిని మరియు కొలొన్నెసి వంశస్తులు మరియు వారి అనుచరుల చేతులలో ఉన్నాయి. అందువలన వాటిని విశ్వసించలేడు. పర్యవసానంగా ఉన్న పరిస్థితులను తారుమారు చేయడం మరియు ఇటలీ లోని రాజ్యాలను గందరగోళానికి గురిచేయడం అవసరమయినది. దాని మూలంగా వాటిలో కొంతభాగానికి తనను తాను సురక్షితంగా అధిపతిని చేసుకోవచ్చు. వెనటియన్స్ వేరే ఇతర కారణాలతో ఫ్రెంచ్ వారిని మరోసారి ఇటలీలోకి రప్పించే విధంగా పథకం పన్నారని తెలియడంతో పోప్‌కు మార్గం సులువైపోయింది. వారి పథకాన్ని పోప్ అలెగ్జాండర్ వ్యతిరేకించకపోవడమేకాక ఫ్రెంచ్ రాజు (12వ లూయీ) యొక్క ప్రధమ వివాహాన్ని రద్దుపరచడం ద్వారా మరింతగా బలపరిచాడు (Ann of Brittany ను వివాహం చేసుకోవడానికి వీలు కలిగేటట్లుగా). దాని మీదట కింగ్ లూయీ వెనటియన్స్ యొక్క సహాయంతో మరియు అలెగ్జాండర్ యొక్క సమ్మతితో ఇటలీలోకి ప్రవేశించాడు. రొమాగ్నా మీద దండయాత్ర చేయడానికి పోప్ అతడి నుండి సైనిక దళాలను స్వీకరించిన వెంటనే లూయీ మిలన్ లో ప్రత్యక్షమయ్యాడు. ఫ్రెంచ్ సైన్యాలపేరు వినగానే రొమాగ్నా పోప్‌కు లొంగిపోయింది. ఆ విధంగా డ్యూక్ వాలెంటినో రొమాగ్నాను స్వంతం చేసుకొని, కొలొన్నెసిని అణచివేసి తన విజయాలను పదిలపరచుకోవాలనీ, మరింతగా విస్తరించాలనీ అభిలషిస్తున్న సమయంలో రెండు ఆటంకాలనెదుర్కొన్నాడు. ఒకటి తన బలగాలు తన యెడల విధేయత కలిగి ఉన్నాట్లుగా కనిపించకపోవడం, మరొకటి ఫ్రాన్సు రాజు సానుకూలంగా లేకపోవడం. వివరంగా చెప్పాలంటే తాను ఉపయోగిస్తున్న ఓర్సిని బలగాలు కీలక సమయంలో తనకు మద్దతుగా నిలబడవనీ, రాజ్యవిస్తరణను ఆటంకపరచడం మాత్రమే కాక తాను అప్పటికే జయించిన వాటిని కూడా వారు తననుండి స్వాధీనం చేసుకుంటారనీ, ఫ్రాన్సు రాజు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తాడనీ అతడు భయపడ్డాడు. ఫయెంజాను చేజిక్కించుకున్న తరువాత బొలోగ్నా మీద దాడి చేస్తున్న సమయంలో ఓర్సిని బలగాలు ఎంతో అనిష్టంగా ఆ దాడిలో పాల్గొన్నప్పుడే అతడికి వాటి స్వభావం అవగతమైనది. డ్యూక్ ఆఫ్ అర్బినోను స్వాధీనం చేసుకున్న తరువాత తాను టస్కనీ మీద దాడిచేయబోతున్న సమయంలో ఆ దాడిని నిలువరించాలని ఫ్రాన్సు రాజు లూయీ తనను బలవంతం చేసినపుడే అతడికి రాజు యొక్క మనసు అర్థమైనది. ఈ కారణాలవలన డ్యూక్ వాలెంటినో ఇక మీదట ఇతరుల బలగాల మీద మరియు అదృష్టం మీద ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాడు.

మొదటి చర్యగా అతడు రోమ్‌లోని ఓర్సిని, కొలొన్నెసి ముఠాలను బలహీనం చేశాడు. వాళ్ళ అనుచరులలో సచ్ఛీలురందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. వారికి మంచి జీతభత్యాలను అందించాడు. వారందరికీ స్థాయికి తగిన విధంగా మంచి ఉద్యోగాలను, అధికారాలను కల్పించి గౌరవింఛాడు. దానితో కొద్దినెలల కాలంలోనే వారికి పాత ముఠాలతో ఉన్న సంబంధాలన్నీ తొలగిపోయి వారంతా డ్యూక్ కి నమ్మకస్థులైన అనుచరులుగా మారిపోయారు. దీని తరువాత –కొలొన్నా శిబిరపు అనుచరులనందరినీ చెల్లా చెదురు చేసి-ఓర్సిని శిబిరాన్ని కూడా నేలరాయగల అవకాశం కోసం ఎదురుచూశాడు. ఆ అవకాశం కూడా త్వరలోనే రావడంతో దానిని డ్యూక్ సద్వినియోగం చేసుకున్నాడు. ఎలాగంటే డ్యూక్ మరియు చర్చి యొక్క ప్రాబల్యం తమను నాశనం చేయగలదని చివరికి అర్థం చేసుకున్న ఓర్సిని పెరూగియా ప్రాంతంలోని మాగియోన్ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాని మూలంగా అర్బినోలో తిరుగుబాటు చెలరేగింది, రొమాగ్నాలో అల్లర్లు జరిగి డ్యూక్ కు లెక్కలేనన్ని కష్టనష్టాలు సంభవించాయి. వీటన్నింటినీ కూడా అతడు ఫ్రెంచ్ వారి సహాయంతో అధిగమించాడు. తన అధికారాన్ని పునఃస్థాపించుకున్న డ్యూక్, ఇకమీదట ఫ్రెంచ్ వారిని గానీ, లేక మరే ఇతర విదేశీ సహాయాన్ని గానీ నమ్మకుండా, తన ఎత్తుగడల మీదే అధారపడ్డాడు. తన ఆలోచనలను బయట పడకుండా జాగ్రత్త పడటంలో ఇతడు ఎంత సమర్థుడంటే, సిగ్నొర్ పగోలో యొక్క మధ్యవర్తిత్వం ద్వారా (ఇతడిని డ్యూక్ ఎంతో శ్రద్ధ చూపడం ద్వారా, ధనం, వస్త్రాలు, గుఱ్ఱాలు ఈయడం ద్వారా ప్రలోభపెట్టాడు.) -ఓర్సిని వర్గం అమాయకంగా సినిగాలియాలో డ్యూక్ అధికారపరిధిలోకి వచ్చిచేరే విధంగా- వారితో తిరిగి సత్సంబంధాలు ఏర్పరచుకోగలిగాడు. నాయకులందరూ అంతమొందించబడి, వారి అనుచరులందరూ ఇతనికి సన్నిహితులుగా మార్చబడి, డ్యూక్ తన అధికారానికి చాలినంతగా మంచి పునాదులు (మొత్తం రొమాగ్నాను మరియు డ్యూక్‌డమ్ ఆఫ్ అర్బినోను కలిగి ఉండటం ద్వారా) నిర్మించుకునాడు. తమకు మెరుగైన జీవితం లభించినదని బావిస్తున్న ఆ రాజ్యాల ప్రజలందరూ కూడా ఇతడికి సానుకూలంగా మారడం వలన అతడి నడవడికలోని ఈ భాగం గమనించదగినది మరియు ఇతరులచే అనుకరించదగినది అవడం వలన దీనిని నేను విస్మరించదలచుకోలేదు.

డ్యూక్ (సీజర్ బోర్గియా) రొమాగ్నాను ఆక్రమించినపుడు అది చాలా బలహీనులైన రాజుల పరిపాలనలో ఉన్నట్లుగా గమనించాడు. వారు ప్రజల బాగోగులు చూడటం కన్నా వారిని దోపిడీ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాక వారు ప్రజలను సమైఖ్యంగా ఉంచడం కన్నా వారు విచ్ఛిన్నమై పోవడాన్నే ఎక్కువగా ప్రోత్సహిస్తుండటంతో దేశం దొంగతనాలు, దోపిడీలు, పోట్లాటలు ఇంకా అనేక రకాల హింసాయుత ఘటనలతో నిండిపోయింది. దానితో అతడు ఆ రాజ్యంలో శాంతిభద్రతలను తిరిగి నెలకొల్పి, తన అధికారానికి లోబడి ఉండేటట్లు చేసుకోవడానికి గాను అక్కడ మంచి రాజప్రతినిధిని నియమించడం అవసరమని నిర్ణయించుకున్నాడు. దానికొరకు అతడు మెస్సెర్ రామిరో డి ఓర్కో అనబడే వ్యక్తికి పూర్తి అధికారాలనిచ్చి నియమించాడు. అతడు చురుకైనవాడు మాత్రమేకాక చాలా క్రూరుడు. అతడు అనతికాలంలోనే శాంతిభద్రతలను, సమైఖ్యతను విజయవంతంగా పునరుద్ధరించాడు. కానీ ఆ తదుపరి అంతటి అపరిమిత అధికారం తనను ప్రజాద్వేషానికి గురిచేస్తుంది కనుక, ఇక మీదట అది అనవసరమని తలచిన డ్యూక్ ఆ రాజ్యంలో ప్రతిభావంతుడైన న్యాయాధికారి నేతృత్వంలో ఒక న్యాయస్థానాన్ని నెలకొల్పాడు. దానిలో అన్ని పట్టణాలకు చెందిన న్యాయవాదులు ఉంటారు. అప్పటి వరకు ఆ రాజ్యంలో ప్రదర్శింపబడిన క్రూరత్వం వలన తన యెడల ద్వేషం జనించినదని తెలుసుకున్న డ్యూక్, ప్రజల మనసుల నుండి దానిని చెరిపివేసి, వారి విశ్వాసాన్ని పొందడానికి గానూ జరిగిన అకృత్యాలకు తాను కారణం కాదనీ, అవి కేవలం రాజప్రతినిధి యొక్క కౄరస్వభావం వలనే సంభవించాయనీ ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఉద్దేశంతో అతడు ఒక రోజు ఉదయం రామిరోకు శిరచ్ఛేదం చేయించి, వధ్యశిల మరియు రక్తమోడుతున్న గొడ్డలి తోపాటుగా అతడి మృతదేహాన్ని సెసేనా పట్టణపు వ్యాపార కూడలిలో పడవేశాడు. ఆ భయానక దృశ్యం చూచిన ప్రజలు దిగ్భ్రాంతితో పాటు సంతృప్తిని కూడా పొందారు.

ఇక మనం అసలు విషయానికి వద్దాం. డ్యూక్ ఇప్పుడు తగిన విధంగా శక్తివంతుడై, తనకు కావలసిన విధంగా సైన్యాన్ని కూడగట్టడం ద్వారా పొంచి ఉన్న ప్రమాదాలన్నింటి నుండి ఎంతో కొంత సురక్షితంగా ఉండి, -తాను మరింతగా రాజ్య విస్తరణకు పూనుకున్న పక్షంలో తనకు హాని తలపెట్టగలిగే ఇరుగు పొరుగు శక్తులన్నింటినీ- పూర్తిగా నేలరాచాడు. ఇక ఆలోచించవలసినది ఫ్రాన్సు గురించే. ఎందుకంటే ఫ్రాన్సు రాజు చివరకు తను చేసిన తప్పు తెలుసుకుని ఇక మీదట తనకు మద్దతివ్వడని డ్యూక్‌కు తెలుసు. అందువలన ఇక నుండి కొత్త మిత్రుల కోసం అన్వేషణ ప్రారంభించి, -గేటే ఆక్రమణలో నిమగ్నులై ఉన్న స్పానియార్డుల మీద దాడి చేయడానికి నేపుల్స్ రాజ్యం మీదకు దండెత్త దలచిన ఫ్రాన్స్‌కు- సహాయం చేయకుండా వాయిదా వేసాడు. ఫ్రాన్స్ నుండి తనను రక్షించుకోవడమే డ్యూక్ యొక్క ఉద్దేశం. పోప్ అలెగ్జాండర్ జీవించి ఉన్నట్లైతే ఈ లక్ష్యాన్ని అతడు చాలా త్వరగానే నెరవేర్చుకోగలిగి ఉండేవాడు.

వర్తమాన పరిస్థితులకు సంబంధించి అతడు తీసుకున్న చర్యల క్రమం ఆ విధంగా ఉన్నది. అయితే భవిష్యత్తుకు సంబంధించి మొట్టమొదటగా భయపడుతున్న దేమిటంటే చర్చికి తదుపరి వారసుడు ఒకవేళ తనతో స్నేహపూర్వకంగా మెలగకుండా, తన తండ్రియైన పోప్ అలెగ్జాండర్ తనకు ఇచ్చినదంతా తననుండి తిరిగి తీసుకునే పరిస్థితిని ఎదుర్కోవడానికి అతడు నాలుగు రకాల మార్గాలలో జాగ్రత్త వహించాడు. మొదటిది తాను పదవీచ్యుతులను గావించిన ప్రభువులందరి కుటుంబాలను తుదముట్టించడం ద్వారా, వారు కొత్త పోప్ చేతి సాధనాలుగా మారకుండా నిరోదించాడు (పోప్‌కు సాకు దొరకకుండా నిరోధించాడు). రెండవది రోమ్ లోని ప్రముఖులందరినీ తనకు అనుకూలురుగా మార్చుకుని, వారి సహాయం ద్వారా పోప్‌కు కళ్ళెం వేయగలిగేటట్లుగా చర్యతీసుకున్నాడు. మూడవది మతాధికారులందరినీ సాధ్యమైనంత వరకు తన నియంత్రణ లోనికి తెచ్చుకునాడు. నాల్గవది ప్రస్తుత పోప్ అయిన తన తండ్రి మరణించే లోగానే మొదటి దెబ్బను కాచుకోగలిగేంత దృఢంగా తన అధికారాన్ని సుస్థిరంచేసుకోవడం. ఈ నాల్గింటిలో అలెగ్జాండర్ మరణించేనాటికి మూడింటిని నెరవేర్చాడు. అతడు తనచే పదవీచ్యుతులు గావింపబడిన ప్రభువులలో చేజిక్కిన వారందరినీ హతమార్చాడు. కొద్దిమంది తప్పించుకున్నారు. రోమన్ ప్రముఖులందరినీ తనకు అనుకూలురుగా మార్చుకునాడు. అలాగే మతాధికారులలో కూడా చాలా మందిని తన పక్షం వైపు తిప్పుకున్నాడు. డ్యూక్ తన రాజ్యాన్ని మరింతగా విస్తరించడం కొరకు టస్కనీకి అధిపతి కావాలని తలచాడు. Perugia మరియు Piombino లను అప్పటికే అతడు స్వాధీనం చేసుకుని ఉన్నాడు. అంతేకాక పిసా ఇతని సంరక్షణలోనే ఉన్నది. ఫ్రాన్సు గురించి ఏ మాత్రం ఆలోచించాల్సిన పని లేకపోవడంతో (ఎందుకంటే ఫ్రెంచి వారు నేపుల్స్ రాజ్యం నుండి స్పానియార్డులచే తరిమివేయబడటం వలన ఇరువురూ కూడా డ్యూక్ స్నేహాన్ని అర్ధించవలసిన అవసరం ఏర్పడింది.) ఇతడు పిసాను తటాలున ఆక్రమించాడు. దీని తరూవాత Lucca మరియు Siena -ఫ్లోరెంటైన్ల అసూయవలన కొంత, భయం వలన కొంత- వెంటవెంటనే లొంగిపోయాయి. దీనితో ఫ్లోరెన్స్ డ్యూక్ నుండి తనకు రక్షణలేదని గ్రహించింది. అతడు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లైతే -అలెగ్జాండర్ చనిపోయిన సంవత్సరంలోనే అతడు స్వాధీనం చేసుకోబోతున్నాడు కనుక-ఇతరుల శక్తిమీద గానీ, తన అదృష్టం మీద గానీ ఆధారపడకుండా పూర్తిగా తన బలం మరియు ధైర్యం మీదనే ఆధారపడగలిగి, తానొక్కడే నిలవగలిగేంతటి అధికారాన్ని, ప్రతిష్టను అతడు పెంపొందించుకోగలుగుతాడు.

డ్యూక్ తన ఖడ్గానికి మొదటిసారిగా పనిచెప్పిన తరువాత 5 సంవత్సరాలకు అలెగ్జాండర్ మరణించాడు. తన కొడుకైన డ్యూక్‌ను అతడు -రొమాగ్నాలో మాత్రమే అధికారం సుస్థిరమై ఉండి, మిగతావన్నీ అస్థిరంగా ఉన్న పరిస్థితిలో- అత్యంత శక్తివంతమైన రెండు శత్రుసైన్యాల నడుమన వదిలి జబ్బుపడి మరణించాడు. అయినా కూడ డ్యూక్‌లో ఎంతటి ధైర్యం మరియు సామర్థ్యం ఉన్నవంటే అతడికి మనుషులను ఎలా తనకు అనుకూలురుగా మార్చుకోవాలో లేక ఎలా వారిని నాశనం చేయాలో బాగా తెలుసు. అలాగే అతడు కొద్ది కాలవ్యవధిలోనే నిర్మించిన పునాదులు ఎంతటి బలమైన వంటే అతడి పొంతనే ఆ శతృసైన్యాలు గనుక లేకుండా ఉన్నట్లైతే లేక అతడు మంచి ఆరోగ్యంతో ఉన్నట్లైతే ప్రతీ కష్టాన్నీ అధిగమించగలిగి ఉండేవాడు. (ఇతడు లేని సమయంలో) రొమాగ్నా ఎంతో విశ్వాసపాత్రంగా నెలరోజుల పైగా ఇతడి కోసం ఎదురుచూచింది. (అనారోగ్యంతో) సగం మరణించి ఉన్న పరిస్థితిలో కూడా ఇతడు రోమ్‌లో సురక్షితంగా ఉన్నాడు. ఆ సమయంలో రోమ్ మీదకు దాడికి వచ్చిన Baglioni, Vitelli మరియు Orsini లు అతడి మీద ఎటువంటి విజయాన్ని పొందలేకపోయాయి. ఈ విషయాలన్నింటిని బట్టి అతడు నిర్మించిన పునాదులు ఎంతటి బలమైనవో గ్రహించవచ్చు. మరిముఖ్యంగా తనకు ఇష్టమైన వ్యక్తిని పోప్‌గా చేయలేకపోయినా కనీసం తనకు ఇష్టంలేని వ్యక్తి పోప్‌గా ఎన్నిక కాకుండా ఆపగలిగే సామర్థ్యం కలిగి ఉండటం వలన అలెగ్జాండర్ మరణ సమయంలో ఇతడు చక్కని ఆరోగ్యంతో ఉన్నట్లైతే, అన్ని విషయాలూ ఇతనికి సానుకూలంగా జరిగి ఉండేవి. జూలియస్ II పోప్‌గా ఎన్నికైన రోజున డ్యూక్ నాతో “నా తండ్రి మరణిస్తే జరగబోయే విషయాలన్నింటి గురించి ముందుచూపుతో ఆలోచించి, వాటన్నింటి కొరకు తగిన విధంగా జాగ్రత్తపడ్డాను కానీ నిజంగా నా తండ్రి యొక్క మరణం సంభవించినపుడు స్వయంగా నేనే మృత్యుముఖంలో ఉంటానన్న విషయాన్ని మాత్రం ఊహించలేకపోయానని” అన్నాడు.

(అలెగ్జాండర్-VI 18, ఆగష్టు, 1503న జ్వరంతో మరణించాడు.)

డ్యూక్ యొక్క చేతలన్నింటినీ సమీక్షించినపుడు అతడిలో నాకు తప్పేమీ కనిపించలేదు. మీదుమిక్కిలి, అదృష్టం లేక ఇతరుల యొక్క సైన్యాల ద్వారా రాజ్యాధికారాన్ని పొందినవారందరూ అనుకరించడానికి ఇతడిని ఒక నమూనాగా ప్రతిపాదించడం (నేను ప్రతిపాదిస్తున్నట్లుగా) సబబని నాకు అనిపిస్తున్నది. గొప్పవైన ధైర్యసాహసాలు, సమున్నతమైన ఆశయాలు కలిగిన అతడు మరోవిధంగా ప్రవర్తించగలిగేవాడు కాదు. అతడి తండ్రి కొద్దికాలం మాత్రమే జీవించడం, మరియు స్వయంగా తాను రోగగ్రస్తుడు కావడం; ఇవి మాత్రమే అతడి ప్రణాళికలు విజయవంతం కాకుండా నిరోధించాయి. కనుక ఎవరైతే కొత్తగా సాధించిన రాజ్యంలో –శతృవుల నుండి తమను కాపాడుకోవడం, కొత్త మిత్రులను ఏర్పరచుకోవడం, బలప్రయోగం ద్వారానో లేక ఎత్తుగడలద్వారానో ప్రాబల్యాన్ని సాధించడం, ప్రజలలో తన యెడల భయభక్తులు కలిగించడం, సైనికులచే గౌరవింపబడి వారి విధేయతను పొందడం, తనకు హాని తలపెట్టగలిగిన శక్తిగానీ, లేక అలా చేయాలనే తలంపు గానీ ఉన్న వారందరినీ తుదముట్టించడం, పాత విధివిధానాలను తొలగించి నూతన విధానాలను ప్రవేశపెట్టడం, కఠినంగానూ అలాగే దయతోనూ, ఉదారతతోనూ మరియు విశలాదృక్పథంతోనూ మెలగడం, రాజభక్తిలేని సైన్యాన్ని రద్దుచేసి నూతన సైన్యాన్ని నిర్మించడం, రాజులు, రారాజులు తనకు సహాయం చేయడంలో వారికి లాభమున్నట్లు, తనకు ఆగ్రహం కలిగించడం వారికి ప్రమాదమన్నట్లు వారు భావించే విధంగా వారితో సంబంధాలను కలిగి ఉండటం--ఇలా ఇవన్నీ అవసరమని భావిస్తాడో అతడు డ్యూక్ యొక్క చేతలకన్నా సజీవమైన నమూనాను పొందలేడు.

రెండవ జూలియస్‌ను పోప్‌గా ఎన్నుకున్న విషయంలో మాత్రమే ఇతడిని మనం నిందించగలం. కారణం ఆ ఎంపిక సరైనది కాదు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్లు తనకు ఇష్టమైన వ్యక్తిని పోప్‌గా ఎన్నుకునే సామర్థ్యం లేకపోయినా, వేరెవరినైనా పోప్ కాకుండా నిరోధించగలిగి ఉండేవాడు. మతాధికారులలో తన వలన దెబ్బతిన్నవారు గానీ లేక పోప్ అయిన మీదట తన వలన భయం ఉన్నవారు గానీ పోప్ అవడానికి ఇతడు సమ్మతించి ఉండవలసినది కాదు. ఎందుకంటే మనుషులు భయం వలన గానీ లేక కోపం వలన గానీ హాని తలపెడతారు (శత్రువులుగా మారతారు). ఇతని వలన దెబ్బతిన్న వారిలో కొందరు San Pietro ad Vincula, Colonna, San Giorgio మరియు Ascanio. మిగిలినవారందరూ పోప్ అయిన మీదట ఇతని వలన భయం ఉన్నవారే. రోయిన్ మరియు స్పానియార్డులు తప్ప. (స్పానియార్డులు వారికున్న సంబంధ బాంధవ్యాలు మరియు బాధ్యతల మూలంగా, రోయిన్ ఫ్రాన్స్ రాజ్యంతో తనకున్న సంబంధం రీత్యా శక్తివంతుడుగా ఉండటం వలన) అందువలన డ్యూక్ మొదటి ప్రత్యామ్నాయంగా స్పానియార్డులలో ఒకరు పోప్‌గా ఎన్నిక అవడానికి ప్రయత్నించి ఉండవలసినది. అందులో విఫలమైన పక్షంలో రోయిన్ ఎన్నిక కావడానికి సమ్మతించి ఉండవలసినది. అంతేకానీ San Pietro ad Vincula (జూలియస్-II) ఎన్నికకు తన సమ్మతిని తెలిపి ఉండవలసినది కాదు.

‘గొప్పస్థానంలో ఉన్న వ్యక్తులు కొత్తగా చేసిన మేలు మూలంగా పాత గాయాలను మరచిపోతార’ని నమ్మేవాడు మోసపోతాడు. ఈ విధంగా డ్యూక్ తన ఎంపికలో తప్పు చేశాడు. ఆ తప్పే అంతిమంగా అతడి వినాశనానికి కారణమైనది.


'మాకియవెల్లి-ద ప్రిన్స్ ' 6వ అధ్యాయం





రాజు - రాజ్యం



అధ్యాయం - 6 

రాజు తన శక్తి సామర్థ్యాలతో స్వంత సైన్యం ద్వారా పొందిన 
నూతన సంస్థానాల గురించి






ఇప్పుడు నేను వివరించబోయే పూర్తిగా కొత్తవైన సంస్థానాల గురించి మాట్లాడేటపుడు రాజు గురించి, రాజ్యం గురించి గొప్పవైన ఉదాహరణలను సూచిస్తే ఎవరూ ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే వ్యక్తులు చాలా వరకూ ఇతరుల యొక్క అడుగుజాడలలోనే నడుస్తుంటారు, వారి చేతలనే అనుకరిస్తుంటారు; కానీ తాము అనుకరించేవారు చేరుకున్న ఉన్నత స్థానాన్ని చేరుకోవడం కానీ, పూర్తిగా ఇతరులు నడిచిన దారిలోనే నడవడంగానీ వీరికి సాధ్యం కాదు. కనుక వివేకవంతుడు ఎల్లప్పుడూ గొప్పవాళ్ళు నడచిన బాటనే అనుసరించాలి, ఉన్నతమైన వారినే అనుకరించాలి. దానివలన సామర్థ్యంలో వారితో సముడవ్వలేకపోయినా కనీసం వారి సామర్థ్యపు పరిమళాన్ని కొంతైనా పొందగలుగుతాడు. విలుకాడు సుదూరాన ఉన్న లక్ష్యాన్ని ఛేదించదలచి, తన వింటి యొక్క బలంతో శరం ఎంత దూరం పోగలదో తెలుసుకొని ఉండి, లక్ష్యంకన్నా ఎక్కువ ఎత్తుకు గురిపెడతాడు. అంత ఎత్తుకు తన బాణం పోవాలని కాదు. అంత ఎత్తుకు గురిపెడితేకానీ తాను ఛేదించాలనుకున్న లక్ష్యాన్ని బాణం చేరడం సాధ్యం కాదు. అటువంటి తెలివైన విలుకాడిలా అతడు వ్యవహరించాలి.

కనుక ఇప్పుడు నేను ఏం చెబుతానంటే, రాజుకూడా కొత్తవాడుగా ఉండే పూర్తిగా కొత్తవైన సంస్థానాలను నిలుపుకోవడం కష్టసాధ్యమా లేక సులభసాధ్యమా అన్నది దానిని స్వాధీనం చేసుకున్న వాని యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి సింహాసనం పొందాలంటే అతడికి అదృష్టమో లేక సామర్థ్యమో ఉండాలి అన్న వాస్తవం కారణంగా ఈ రెంటిలో ఏదో ఒకటి ఉండటం చాలా వరకూ కష్టాలను తగ్గిస్తుంది అన్న విషయం స్పష్టపడుతుంది. అయినప్పటికీ అదృష్టం మీద తక్కువగా ఆధారపడే వాడు శక్తివంతుడిగా రూపొందుతాడు (తన స్థానాన్ని చక్కగా పదిలం చేసుకుంటాడు). అంతేకాక రాజుకు మరే ఇతర సంస్థానాలూ లేకపోవడం వలన అతడు తాను స్వాధీనం చేసుకున్న రాజ్యంలోనే నివసించవలసి రావడం కూడా సానుకూలమైన అంశంగా మారి సమస్య మరింత సులువవుతుంది.

అదృష్టం వలన కాక, తమ స్వీయ శక్తి సామర్థ్యాలతో సింహాసనాన్ని పొందినవారి గురించి పరిశీలిస్తే మోసెస్, సైరస్, రోములస్, థెసియస్ (Moses, Cyrus, Romulus, Theseus, ) మొదలైనవారు మంచి ఉదాహరణలని నేను చెబుతాను. మోసెస్ కేవలం దేవుని ఆజ్ఞలను మాత్రమే నిర్వర్తించే ఒక సాధనంగా మాత్రమే వ్యవహరించాడు కనుక అతని పేరు చెప్పవలసిన అవసరం లేకపోయినప్పటికీ దేవుని తోనే సంభాషించగల అర్హతను సాధించిన అతని సుగుణాల మూలంగా అతను ఆరాధ్యుడే. సామ్రాజ్యాలను స్థాపించిన లేక సాధించిన సైరస్ మరియు ఇతరులను పరిశీలిస్తే వారు కూడా ఆరాధింపదగిన వారిగానే పరిగణింపబడతారు. అంతేకాక వారి చేతలు, మరియు నడవడికలను పరిశీలిస్తే --మోసెస్ గొప్ప బోధకుడైనప్పటికీ-- అతని కన్నా వారు తక్కువేమీ కాదనే విషయం బోధపడుతుంది. అంతేకాక వారి జీవితాలను, వారి కార్యాలను పరీక్షించినట్లైతే వారు అదృష్టానికి ఏమాత్రం ఋణపడలేదని మనం తెలుసుకుంటాము. కేవలం అవకాశం మాత్రమే విషయాలకు తమ ఇష్టమైన రూపం ఇవ్వగలిగే సామార్థ్యాన్ని వారికి ఇచ్చింది. ఆ అవకాశమే లేనట్లైతే వారి మానసిక శక్తులు హరించుకుపోయి ఉండేవి; మరో పక్క వారి మానసిక శక్తులే లేనట్లైతే ఆ అవకాశం వ్యర్థమైపోయి ఉండేది.

కనుక తనను అనుసరించి బంధవిముక్తులు అగుటకుగానూ ఈజిప్టులో ఆ దేశీయులచే అణచివేతకు గురిచేయబడి, బానిసలుగా మార్చబడిన ఇజ్రాయెలీలు మోజెస్‌కు అవసరమయ్యారు. రోములస్ రోమ్ నగరాన్ని స్థాపించడానికీ, దానికి రాజవడనికీ అతడు అల్బాలో ఉండకపోవడం, అతడు తన జనన సమయంలో అరక్షితంగా వదిలివేయబడటం అవసరమయ్యాయి. పర్షియన్‌లు Medes ప్రభుత్వంచే అసంతృప్తులవటం, అంతేకాక సుదీర్ఘశాంతి వలన Medes బలహీనులుగా, మగటిమి లేనివారుగా అవటం సైరస్ కు అవసరమయినది. ఎథీనియన్‌లు అసంఘటితంగా, చెల్లాచెదురుగా లేనట్లైతే థెసియస్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగి ఉండేవాడు కాదు. ఒక పక్క ఈ అవకాశాలు వారిని అదృష్టవంతులుగా చేస్తే, మరోపక్క వారి స్వీయ శక్తిసామర్థ్యాల వలన వారు ఈ అవకాశాలను గుర్తించగలిగి, తమ దేశానికి ఖ్యాతిని, గౌరవాన్ని తేగలిగారు.

వీరివలే ఉన్నతమైన నడవడిక ద్వారా రాజులుగా మారిన వారు ఒక సంస్థానాన్ని కష్టంతో స్వాధీనంచేసుకుని, చాలా సులువుగా సంరక్షించుకుంటారు. తమ ప్రభుత్వాన్ని స్థాపించుట కొరకు మరియు దాని సంరక్షణ కొరకు అమలు చేయవలసి వచ్చిన నూతనమైన నియమ నిబంధనలు మరియు పద్దతుల మూలంగా --ఒక నూతన రాజ్యాన్ని పొందడంలో వారికి ఎదురయ్యే కష్టాలు తలయెత్తుతాయి. ఒక కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టేటపుడు నాయకత్వం వహించడం కన్నా --చేపట్టడానికి కష్టమైనది, నిర్వర్తించడానికి ప్రమాదకరమైనది, విజయవంతమయ్యే విషయంలో అనిశ్చితమైనది-- మరోటిలేదనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నూతనత్వాన్ని తెచ్చేవానికి పాత పరిస్థితులు అనుకూలంగా ఉన్నవారంతా శత్రువులుగా మారతారు. నూతన వ్యవస్థ అనుకూలంగా ఉండబోయే వారు మాత్రం చాలా నిరాసక్తంగా అతనికి మద్దతు పలుకుతుంటారు. ఈ నిరాసక్తతకు కొంతకారణం పాత చట్టాలు అనుకూలంగా ఉన్న ప్రత్యర్థులకు భయపడటం, మరికొంత కారణం సుదీర్ఘకాలపు అనుభవం లేకుండా ఏ కొత్త విషయాన్నీ వెంటనే అంగీకరించలేని మానవుడి అపనమ్మకం. ఫలితంగా మార్పుకు శత్రువులు తమకు దాడిచేసే అవకాశం చిక్కినప్పుడల్లా ఎంతో ఉద్వేగంతో, చాలా బలంగా దాడిచేస్తారు. అదే సమయంలో ఇతరులు (నిరాసక్తమైన మద్దతుదారులు) తమను తాము చాలా బలహీనంగా రక్షణ చేసుకుని తమను, తమలక్ష్యాన్నీ రెంటినీ ప్రమాదంలో పడవేస్తారు.

ఐతే ఈ విషయాన్ని బాగా అర్థంచేసుకోవాలంటే నూతనత్వాన్ని తెచ్చేవారు స్వయంగా ఈ పని చేశారా? లేక ఇతరుల సహాయం మీద ఆధారపడ్డారా?….. మరో రకంగా చెప్పాలంటే తమ పథకాలను ఆచరణలోకి తేవడానికి వీరు విన్నపాల మీద ఆధారపడ్డారా? లేక బలప్రయోగం చేశారా? ఆన్న విషయం పరిశీలించవలసి ఉన్నది. మొదటి సందర్భంలో వారు ప్రతీసారీ అపజయాన్నే పొందారు, ఏమీ సాధించలేకపోయారు; ఐతే వారు స్వంత వనరులమీద ఆధారపడి బలప్రయోగానికి పాల్పడినప్పుడు మాత్రం అపజయాన్ని పొందిన సందర్భాలు పెద్దగాలేవు. దీనిని బట్టి సాయుధ ప్రవక్తలందరూ విజయాన్ని సాధించారనీ, నిరాయుధ ప్రవక్తలందరూ నశించి పోయారనీ నిర్థారించవచ్చు.

ఇప్పుడు చెప్పిన విషయాలతో పాటు ఈ విషయాన్ని కూడా మనసులో ఉంచుకోవాలి. ప్రజల యొక్క స్వభావం చంచలమైనది. వారికి ఒక విషయాన్ని నచ్చజెప్పడం తేలికేగానీ అదే విషయానికి వారు స్థిరంగా మద్దతు పలికేటట్లు చేయడం మాత్రం కష్టం. కనుక ప్రజలు ఒక విషయాన్ని ఎంతోకాలం నమ్మలేకపోతున్నప్పుడు వారు దానిని నమ్మేటట్లుగా బలప్రయోగం చేసే అవసరం ఏర్పడుతుంది. మోజెస్, సైరస్, థెసియస్, మరియు రోములస్‌లు (Moses, Cyrus, Theseus, and Romulus) గనుక నిరాయుధులు అయినట్లైతే తమ శాసనాలను మరియు తమ వ్యవస్థలను దీర్ఘకాలం అమలులో ఉంచగలిగేవారు కాదు. మనకాలంలో Fra Girolamo Savonarola విషయంలో ఈ విధంగానే జరిగింది. ప్రజలకు అతడి యెడల విశ్వాసం తగ్గిన వెంటనే తన కొత్త వ్యవస్థతో పాటుగా అతడు కూడా నాశనమైపోయాడు. నమ్మిన వారిని స్థిరంగా ఉంచడానికీ, నమ్మని వారిని నమ్మేటట్లుగా చేయడానికీ అతడివద్ద ఏ మార్గమూ లేదు.

కనుక అటువంటి (గొప్ప) వ్యక్తులు తమ పథకాలను అమలు చేయడంలో అనేక కష్టాలను ఎదుర్కొంటారు. కానీ ఆ కష్టాలన్నీ కూడా మార్గమధ్యంలోనే వస్తాయి. వాటన్నింటినీ వారు ధైర్యంతో అధిగమిస్తారు. అలా అధిగమించి, గౌరవప్రదమైన స్థానాన్ని చేరుకుని, తమ విజయం ఎడల అసూయ చెందిన వారందరినీ నిర్మూలించి వారు శక్తివంతులుగా, సురక్షితులుగా, యశోవంతులుగా మరియూ సుఖసంతోషాలు కలిగిన వారుగా కొనసాగుతారు.

పైన తెలిపిన గొప్పవైన ఉదాహరణలకు కొంచెం తక్కువైన మరో ఉదాహరణను జోడిస్తాను. తక్కువది ఐనా కూడా అది గొప్ప వాటితో పోలి ఉంటుంది. అంతేకాక తనలాంటి వాటన్నింటికీ ఒక నమూనాగా కూడా ఉంటుంది. ఆ ఉదాహరణే Hiero the Syracusan.[*]. ఇతడు సాధారణ స్థితి నుండి Syracuse కు రాజుగా ఎదిగినాడు. అదృష్టం వలన కాక అవకాశం వలన మాత్రమే అతడు ఈ స్థితికి వచ్చాడు. సిరాకసన్‌లు అణచివేతకు గురికావటం వలన ఇతడిని తమ నాయకుడిగా ఎంచుకున్నారు. తదుపరి ఇతడు వారి రాజుగా ఎంచుకోబడ్డాడు. ఇతడు ఎంత సమర్థత కలిగినవాడంటే ఇతడు సాధారణ వ్యక్తిగా ఉన్నపుడే ఒక రచయిత ఇతడి గురించి రాస్తూ ‘ ఒక రాజు కలిగి ఉండవలసిన విషయాలలో ఇతనికి లేనివి ఏమీలేవు…. ఒక్క సామ్రాజ్యం తప్ప.’ అని పేర్కొన్నాడు. ఇతడు పాత సైన్యాన్ని రద్దుచేసి నూతన సైనిక వ్యవస్థను నెలకొల్పాడు. పాత స్నేహ సంబంధాలకు స్వస్తి పలికి నూతన మిత్రులను ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా తనవైన సైన్యం మరియు మిత్రుల ద్వారా ఏర్పడిన పునాదిమీద అతడు తన ఇష్టానుసారమైన నిర్మాణాన్ని చేపట్టగలిగే స్థితికి చేరాడు. ఈ విధంగా రాజ్యాన్ని పొందడంలో అతడు ఎంతో కష్టపడినప్పటికీ దానిని సంరక్షించుకోవడంలో మాత్రం ఏ మాత్రం కష్టపడలేదు.

[*] Hiero II, born about 307 B.C., died 216 B.C.