31, జనవరి 2012, మంగళవారం

సన్-జు 'యుద్ధకళ':2వ అధ్యాయం





యుద్ధకళ




2వ అధ్యాయం: యుద్ధ సన్నాహం








సన్జు చెప్పాడు:

1) సాధారణంగా యుద్ధానికి అవసరమైనవి ఈ విధంగా ఉంటాయి. త్వరితగతిన కదలగలిగే ఒకవేయి రథాలు, అంతే సంఖ్యగల భారీ రథాలు, రక్షణ కవచాలు ధరించిన లక్షమంది సైనికులు, ఇంత సైన్యం ఒక వేయి లీల దూరం పోగలిగేంత వరకు సరిపోయే ఆహారపదార్థాలు, అతిథులవినోదం, జిగురు మరియు రంగు వంటి చిన్న చిన్న వస్తువులు, రథాలు, రక్షణ కవచాల మీద వ్యయం చేసే మొత్తం; ఇలా వీటన్నింటితో కలుపుకుని రాజ్యంలోనూ, యుద్ధ రంగంలోనూ అయ్యే ఖర్చు రోజుకి వేయి ఔన్సుల వెండికి చేరుకుంటుంది. ఒక లక్షమంది సైనికులతో కూడిన సైన్యం పెంపొందించడానికి అయ్యే ఖర్చు ఆవిధంగా ఉంటుంది..

(‘లీఅనునది చైనాలో పొడవును కొలిచే ఒక ప్రమాణం. 2.78 ‘లీలు ఒక మైలుకు సమానం)

2) యుద్ధం చేసేటపుడు విజయాన్ని త్వరగా సాధించాలని కోరుకో. విజయం ఆలస్యం అయ్యేకొలదీ సైనికుల ఆయుధాల పనితీరు మందగించడంతోపాటు వారి ఉత్సాహం నీరుగారి పోతుంది. నీవు కోట ఉన్న ఒక పట్టణాన్ని ముట్టడిస్తే కాలయాపన వలన నీ బలం క్షీణించిపోతుంది.

3) అంతేగాక, యుద్ధాన్ని సాగదీసే కొలదీ రాజ్యంలోని వనరులు యుద్ధభారానికి చాలవు.

4) నీ ఆయుధాలు సక్రమంగా పనిచేయని, నీ ఉత్సాహం నీరుగారి పోయి, నీ బలం క్షీణించి పోయి, నీ ఖజానా ఖర్చయి పోయి ఉన్న ఈ సమయంలో పొరుగు రాజులు నీ కష్టాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కార్యరంగంలోకి దూకుతారు. అప్పుడు ఎటువంటి వివేకవంతుడు కూడా అనివార్యమైన కొన్ని పరిణామాలను జరగకుండా ఆపలేడు.

5) యుద్ధంలో తెలివితక్కువ తొందరపాటు గురించి మనం విని ఉన్నప్పటికీ, సుదీర్ఘమైన కాలవిలంబన తెలివితో కూడి ఉండటాన్ని మనం ఎప్పుడూ చూడలేదు.

(యుద్ధంలో తొందరపాటు ఒక్కోసారి తెలివితక్కువతనం కావచ్చు. కానీ ఆలస్యం ఎప్పుడూ తెలివైనపని కాదు.)

6) దీర్ఘకాల యుద్ధం ద్వారా ఏదైనా దేశం ప్రయోజనం పొందిన సందర్భాలు లేనేలేవు.

7) ఏ వ్యక్తి అయితే యుద్ధంలోని కష్టనష్టాల గురించి బాగా అవగాహన కలిగి ఉంటాడో అతడు మాత్రమే యుద్ధాన్ని లాభదాయకమైన మార్గంలో నడపడాన్ని బాగా అర్థం చేసుకోగలడు.

8) యుద్ధంలో నైపుణ్యం కలిగిన యోధుడు రెండవసారి సైన్యాన్ని భర్తీ చేయడు. అలాగే నిత్యావసరాలను మూడవసారి రవాణా చేయడు.

(తగినంత సైన్యాన్ని, సరఫరాలను ఒకేసారి ఏర్పాటు చేసుకుంటారు. వీటిని దఫదఫాలుగా చేస్తూ కాలహరణం చేయరు)

9) యుద్ధ సామాగ్రిని ఇంటివద్దనుండి నీతోపాటు తీసుకెళ్ళు. కానీ ఆహార పదార్థాలను మాత్రం శత్రువునుండి కొల్లగొట్టు. అలాచేస్తే సైన్యం తన అవసరాలకు సరిపడినంత ఆహారాన్ని కలిగి ఉంటుంది.

10) రాజ్య ఖజానా పేదరికం సైన్యాన్ని దూరంనుండి అందే విరాళాల ద్వారా పోషించడానికి కారణమవుతుంది. దూరాన ఉన్న ఒక సైన్యాన్ని పోషించడంలో పాలుపంచుకోవడం ప్రజల పేదరికానికి కారణమవుతుంది.

11) మరోపక్క సైన్యం సమీపంలో కనుక ఉంటే ధరలు పెరుగుతాయి. అధిక ధరలు ప్రజల సంపద హరించుకుపోవడానికి కారణమవుతాయి.

12) వారి సంపద హరించుకు పోయినపుడు పన్నుకట్టడం రైతాంగానికి భారమైపోతుంది.

13) &14) ఆస్తి నష్టపోవడంతోనూ, బలం క్షీణించిపోవడంతోనూ ప్రజల ఇళ్ళు పేదరికంతో బోసిపోతాయి. వారి ఆదాయంలో పదింట ఏడు వంతులు వ్యర్థమైపోతుంది. విరిగిన రథాలకు, పూర్తిగా అలసిపోయి, శక్తి క్షీణించిన గుఱ్ఱాలకు, రక్షణ కవచాలకు, శిరస్త్రాణాలకు, బల్లాలు, డాళ్ళు. బాణాలు, విల్లంబులు, భారీగా ఉండే సరఫరా బళ్ళు, వాటిని లాగే ఎద్దులు మొదలైన వాటి కొరకు ప్రభుత్వానికయ్యే ఖర్చులు దాని ఆదాయంలో పదింట ఆరు వంతులుంటుంది.

15) కనుక వివేకవంతుడైన సేనాని శత్రువు నుండి ఆహారాన్ని స్వాధీనం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు. శత్రువుకు చెందిన ఆహార పదార్థాలతో నిండిన ఒక బండి, స్వంత ఆహార పదార్థాలతో నిండిన ఇరవై బళ్ళతో సమానం. అలాగే ఒక పికల్బరువున్న శత్రువుకు చెందిన పశుగ్రాసం దానికి ఇరవై రెట్లున్న మన స్వంత పశుగ్రాసంతో సమనం.

(పికల్ అనేది చైనాలో ఒకప్పటి బరువు ప్రమాణం. ఒక పికల్ 65.5kg లకు సమానం)

16) శత్రువును చంపడానికి సైన్యంలో ఆగ్రహాన్ని రెచ్చగొట్టాలి. శత్రువును ఓడించడంలో సైన్యానికి లాభం కనబడాలంటే వారికి తగిన బహుమతులను ప్రకటించాలి.

17) కనుక రథ యుద్ధంలో పది లేక అంతకన్నా ఎక్కువ రథాలు పట్టుబడినపుడు మొదటి రథాన్ని స్వాధీనం చేసుకున్న వారిని సత్కరించాలి. శత్రురథాల మీద ఉన్న జెండాల స్థానంలో మన జెండాలను అమర్చాలి. పట్టుబడిన రథాలను మన రథాలతో కలిపి ఉపయోగించాలి. పట్టుబడిన సైనికుల యెడల దయతో ప్రవర్తించాలి.

18) జయించిన శత్రువును స్వంతబలాన్ని పెంపు చేసుకోవడానికి ఉపయోగించుకోవడంగా దీనిని పిలుస్తారు.

19) కనుక, యుద్ధంలో నీ అతిముఖ్యమైన లక్ష్యం విజయమే గానీ, దీర్ఘకాలపు యుద్ధం కాదు.

20) ఈ విధంగా సేనానాయకుడు అనేవాడు ప్రజల భాగ్యవిధాత. అతడు ఒక జాతి సుఖశాంతులతో ఉండాలాలేక కష్టాల పాలవ్వాలాఅన్నది ఆధారపడి ఉండే వ్యక్తి అని మనకు తెలుస్తున్నది.





(రెండవ అధ్యాయం సమాప్తం)





హోమ్‌పేజి






29, జనవరి 2012, ఆదివారం

సన్-జు 'యుద్ధకళ':1వ అధ్యాయం





యుద్ధకళ



1వ అధ్యాయం: ప్రాథమిక అంచనాలు








సన్జు చెప్పాడు :

1) ఒక రాజ్యానికి యుద్ధకళ అనేది ప్రాణసమానమైన ప్రాముఖ్యత కలిగినటువంటిది.

2) ఇది ఒక జీవన్మరణ సమస్య. సురక్షితం లేక వినాశనంఈ రెంటిలో ఏదో ఒక దానికి ఇది రహదారి. కనుక ఇది నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించవలసిన అంశం.

3) యుద్ధకళను ఐదు స్థిరమైన అంశాలు నిర్దేశిస్తాయి. యుద్ధరంగంలో ఎదురయ్యే పరిస్థితులను నిర్ణయించాలని కోరుకుంటున్నపుడు, ఎవరైనా తమ పర్యాలోచనలో ఆ ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

4) అవి:

a.నైతికనియమం

b. దివి

c. భువి

d. సేనాని

e. విధానము క్రమశిక్షణ

5) & 6) ‘నైతిక నియమంప్రజలు తమ పాలకుడి ఆలోచనలతో ఏకీభవించడానికి కారణమవుతుంది. దానివలన అతడిని వారు తమ జీవితాలను లెక్కచేయకుండా, ఎటువంటి ప్రమాదానికి కూడా భయపడకుండా అనుసరిస్తారు.

7) ‘దివిఅంటే వాతావరణం: పగలు, రాత్రి ; చలి, వేడి; కాలాలు, ఋతువులు.

8) ‘భువిఅంటే భూనైసర్గిక స్వరూపం: ఎత్తులు, లోతులు; సుదూరాలు, సమీపాలు; ప్రమాదకరమైన మార్గాలు, సురక్షితమైన మార్గాలు; బహిరంగ మైదానాలు, ఇరుకైన కనుమలు; అక్కడ చావనూవచ్చు లేక బ్రతకనూవచ్చు.

9) ‘సేనానిఅంటే నాయకత్వం: వివేకం, చిత్తశుద్ధి, సహృదయత, ధైర్యం, క్రమశిక్షణ మొదలైన సుగుణాలు.

10) ‘విధానముక్రమశిక్షణఅంటే సైన్యంలోని వివిధ విభాగాలను వాటికి తగిన స్థానాలలో నిలపడం. అధికారులందరికీ వారి స్థాయిని నిర్ణయించడం, సైన్యానికి సరఫరాలను చేరవేసే రహదారులను నిర్వహించడం, సైన్యానికయ్యే ఖర్చును నియంత్రించడం.

11) ఈ ఐదు విషయాలనూ ప్రతీ సేనాని తెలుసుకుని ఉండాలి. ఇవి తెలిసిన వాడు విజయాన్ని పొందుతాడు; ఇవి తెలియని వాడు అపజయాన్ని పొందుతాడు.

12) కనుక, సైనిక పరిస్థితులను నిర్ణయించాలని కోరుకుంటూ నీవు పర్యాలోచన చేసేటపుడు, వాటిని ఈ విధమైన పోలికకు ప్రాతిపదికగా చేయి.

13) a. ఇద్దరు రాజులలో ఎవరు ప్రజల మద్దతును కలిగి ఉన్నారు?

b. ఇద్దరు సేనానులలో ఎవరు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు?

c. ‘దివి’, ‘భువిఅంటే వాతావరణం, భూస్వరూపం ఎవరికి సానుకూలంగా ఉన్నాయి?

d. ఎవరు క్రమశిక్షణను ఎక్కువ ఖచ్చితంగా పాటిస్తున్నారు?

e. ఎవరి సైన్యం బలమైనది? (నైతికంగా, భౌతికంగా)

f. అధికారులు, సైనికులు ఏ వైపున ఎక్కువగా శిక్షణ పొంది ఉన్నారు?

g. సత్కరించడంలోనూ, శిక్షించడంలోనూ ఏ సైన్యం ఎక్కువ దృడచిత్తం కనబరుస్తున్నది?

14) ఈ ఏడు పరిశీలనలద్వారా నేను విజయమా లేక అపజయమా అన్నది ముందుగానే గ్రహించగలను.

15) నా సలహాలను శ్రద్ధతో విని, వాటి ప్రకారం నడచుకునే సేనాని జయిస్తాడు: అటువంటి వాడినే సేనానిగా ఉండనివ్వండి! నా సలహాల యెడల శ్రద్ధ లేనటువంటి, వాటి ప్రకారం నడచుకోనటువంటి సేనాని అపజయం పాలవుతాడు: అటువంటి వాడిని తొలగించండి!

16) నా సలహాలను పాటించి లబ్ది పొందుతున్న సమయంలో, ఈ సాధారణ నియమాల పరిధిలోనికి రానటువంటి సహాయకర పరిస్థితులు ఏవైనా ఎదురైతే వాటిని కూడా అంగీకరించండి.

17) ఎవరైనా కూడా తన పథకాలను పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ఉండాలి.

18) యుద్ధమంతా వంచన మీద ఆధారపడి ఉంటుంది.

19) కనుక, మనం దాడి చేయగలిగే సామర్థ్యంతో ఉన్నపుడు అటువంటి సామర్థ్యం మనకు లేనట్లు కనబడాలి. మనం మన బలగాలను ఉపయోగిస్తున్నపుడు అచేతనంగా ఉన్నట్లు కనబడాలి. మనం సమీపంలో ఉన్నపుడు, సుదూరంగా ఉన్నట్లు శత్రువును నమ్మించాలి. మనం దూరంగా ఉన్నపుడు, దగ్గరగా ఉన్నట్లు అతడిని నమ్మించాలి.

20) శత్రువును ప్రలోభపెట్టడానికి ఎరవేయి. అస్తవ్యస్తతను నటించి, అతడిని నేలరాయి.

21) అతడు అన్ని విషయాలలో సురక్షితంగా ఉంటే అతడి కొరకు నీవు సన్నద్ధుడవై ఉండు. అతడు నీ కన్నా ఎక్కువ బలాన్నికలిగి ఉంటే అతడి నుండి తెలివిగా తప్పించుకో!

22) నీ ప్రత్యర్థి సులభంగా కోపగించుకునే లక్షణాన్ని కలిగి ఉంటే అతడిని చీకాకు పరచు, అతడి దూకుడు పెరగడం కొరకు నీవు బలహీనుడిగా నటించు.

23) అతడు విశ్రమిస్తుంటే, విశ్రమించనీయకు. అతడి బలగాలు సంఘటితంగా ఉంటే వాటిని విడగొట్టు.

24) అతడు అప్రమత్తంగా లేని చోట అతడి మీద దాడి చేయి, నిన్ను ఊహించని చోట ప్రత్యక్షమవ్వు.

25) విజయానికి దారితీసే ఈ సైనిక ఎత్తుగడలు ముందుగా బహిర్గతం కాకూడదు.

26) యుద్ధానికి ముందు తన దేవాలయంలో అనేక అంచనాలు వేసే సేనాని యుద్ధాన్ని గెలుస్తాడు. కొద్ది అంచనాలు మాత్రమే వేసే సేనాని యుద్ధాన్ని కోల్పోతాడు. ఆవిధంగా ఎక్కువ అంచనాలు విజయానికి దారితీస్తాయి, కొద్ది అంచనాలు ఓటమికి దారితీస్తాయి. ఇక అసలు అంచనాలే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో?!—ఈ అంశం మీద దృష్టి నిలపడం ద్వారా నేను ఎవరు గెలవబోతున్నారో, ఎవరు ఓటమి పాలవబోతున్నారో ముందుగానే గ్రహించగలను.

(ప్రాచీన కాలంలో చైనాలో ఒక సంప్రదాయం ఉండేది. యుద్ధంలో పాల్గొనబోయే సేనాని ఎంపిక చేయబడ్డ ఒకానొక దేవాలయాన్ని చేరుకుని అక్కడ తన యుద్ధ ప్రణాళికను రచిస్తాడు)





(మొదటి అధ్యాయం సమాప్తం)






27, జనవరి 2012, శుక్రవారం

సన్-జు 'ద ఆర్ట్ ఆఫ్ వార్ ' తెలుగులో: మనవి





యుద్ధకళ 




మనవి







ప్రాచీనకాలంలో రచింపబడిన ఈ గ్రంథంలోని కొన్ని వాక్యాలు, పదాలు అస్పష్టమైన అర్థంతో మార్మికంగా, అన్యాపదేశంగా ఉంటాయి. కనుకనే, చరిత్ర క్రమంలో ఎందరో చైనీయులు తమదైన అర్థంతో ఈ గ్రంథానికి వ్యాఖ్యానాలు రాశారు. ఆ వ్యాఖ్యానాలన్నీ కూడా చైనా చరిత్రలో జరిగిన అనేక యుద్ధఘటనలు, సైనిక వ్యవహారాల ఉదహరింపుతో, సుదీర్ఘంగా ఉంటాయి. వాటన్నింటినీ సమీక్షిస్తూ అనేక మంది ఆధునిక యుగపు ఆంగ్లేయులు ఈ గ్రంథాన్ని ఆంగ్ల భాషలోనికి The Art of War పేరుతో అనువదించారు. ఆ అనువాదాలన్నింటిలోకీ ప్రామాణికమైన Lionel Giles అనువాదం నుండి ఈ ఆంధ్రానువాదం చేయబడినది. 

ఆంగ్ల అనువాదకులందరూ కూడా ఇంతకుముందే చెప్పినట్లుగా చైనా భాషలో ఈ గ్రంథానికున్న వ్యాఖ్యానాలను చాలా వరకు పేర్కొంటూ, వాటిని సమీక్షిస్తూ సాగిపోవడంతో వారి అనువాదాలన్నీ ఈ చిరుగ్రంథ పరిమాణాన్ని పెద్దది చేశాయి. అయితే ఈ తెలుగు అనువాదంలో వ్యాఖ్యానాలను అవసరమనుకున్న చోట మాత్రమే బ్రాకెట్లలో ఇవ్వడం జరిగినది. విషయం స్పష్టంగా ఉన్నంతవరకూ సన్–జు బోధించిన ప్రథాన పాఠాన్ని మాత్రమే పేర్కొనడం జరిగినది. పాఠకులు గమనించగలరు.


 సరస్వతీ కుమార్ (అనువాదకుడు)








25, జనవరి 2012, బుధవారం

సన్-జు 'ద ఆర్ట్ ఆఫ్ వార్ ' తెలుగులో: గ్రంథపరిచయం





యుద్ధకళ



గ్రంథపరిచయము






(వేణుగానం బ్లాగులో రాసిన  గ్రంథపరిచయాన్నే మరలా అందిస్తున్నాను) 

జీవితంలో యుద్ధం అనివార్యమైనది. దుష్టుడు యుద్ధాన్ని ఆరంభిస్తాడు; శిష్టుడు ఆ యుద్ధాన్ని ముగిస్తాడు. యుద్ధం చేయాలా వద్దా అని నిర్ణయించుకోగల స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. ఎవరైనా సరే మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం, విజయాన్ని సాధించడం కోసం యుద్ధం చేసితీరాలి. నీవు శాంతి కాముకుడవు అయినా కూడా యుద్ధం చేయక తప్పదు. ఎందుకంటే శాంతి యుద్ధాన్ని నిరాకరిస్తే రాదు; యుద్ధం చేస్తే వస్తుంది. మనిషి జీవితంలో యుద్ధమనేది ఒక నిరంతర ప్రక్రియ.

అటువంటి యుద్ధానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సుబోధకంగా వివరించే గ్రంథం The Art of War. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీన యుద్ధతంత్ర గ్రంథం. ఈ గ్రంథ రచయిత క్రీ.పూ.6వ శతాబ్దానికి చెందిన చైనా దేశపు సైనిక వ్యూహకర్త అయిన సన్–జు. ఇతడు ‘వు’ రాజ్య సేనానిగా పనిచేసి అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. ఈ గ్రంథాన్ని చైనీస్ లో ‘పింగ్ ఫా’ అని అంటారు. ఈ గ్రంథం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. చరిత్రలో ఎన్నో యుద్ధ గతులను, వాటి ఫలితాలను ప్రభావితం చేసింది. ప్రాచ్య, పాశ్చాత్య దేశాలకు చెందిన ఎందరో సేనానులు ఈ గ్రంథం లో వివరించిన వ్యూహాలను ఆచరించి విజయాన్ని తమ స్వంతం చేసుకున్నారు.

నెపోలియన్, మావో సేటుంగ్, హొచిమిన్ వంటి రణతంత్రవేత్తలు, హెన్రీ కిసింజర్ వంటి రాజనీతి కోవిదుడు; ఇంకా ఇటువంటి వారు అనేక మంది ఈ గ్రంథాన్ని నిత్యపఠనీయ గ్రంథంగా పరిగణించారు. మరిముఖ్యంగా ఈ గ్రంథంతో నెపోలియన్‌కున్న అనుబంధం ప్రత్యేకమయినది. ఈ గ్రంథం యొక్క ఫ్రెంచ్ అనువాదం ఫ్రాన్సు దేశంలో ఓ ‘నెపోలియన్’ రూపొందడానికి కారణమయినదంటే అది అతిశయోక్తి కాదు. వియత్నాం యుద్ధకాలం నుండి అమెరికన్ సైనికాధికారులలో ఈ గ్రంథం విశేషమైన ఆదరణను పొందుతున్నది. వారి యుద్ధ వ్యూహాలన్నీ ఈ గ్రంథం మీదనే ఆధారపడి ఉంటాయి.

(ఆధునిక యుద్ధస్వరూపాన్ని రూపొందించిన నెపోలియన్ తను నిదురించే సమయంలో సైతం ఈ గ్రంథాన్ని చెంతనే ఉంచుకొనేవాడు.

ఆధునిక కాలంలో వామపక్ష గెరిల్లా పోరాటాలకు మార్గదర్శకంగా ఉన్న గ్రంథం ‘గెరిల్లా వార్‌ఫేర్'. దీనిని చైనా నాయకుడు మావో సన్-జు ‘యుద్ధతంత్రం’ ఆధారంగానే రచించాడు.

ఈ గ్రంథంలో సన్-జు ప్రతిపాదించిన సూత్రాలను అనుసరించడం వలనే వియత్నాం లాంటి చిన్నదేశం, పేదదేశం అమెరికాలంటి అతిపెద్దదేశం, అపరిమితమైన ఆర్ధికశక్తి, సైనికశక్తి ఉన్న దేశాన్ని ఓడించడం జరిగినది. 20వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగిన ఈ యుద్ధం ‘వియత్నాం యుద్ధం’గా చరిత్ర ప్రసిద్ధి చెందింది. ఈ యుద్ధంలో వియత్నాంకు నాయకత్వం వహించిన హొచిమిన్ ఈ గ్రంథాన్ని చైనీస్ నుండి తమ దేశప్రజల మాతృభాషలోకి అనువదించాడు. ఈ యుద్ధ సమయంలోనే అమెరికా సైనికాధికారులు వియత్నాం గెలుపులో కీలక పాత్ర వహించిన ఈ గ్రంథం గురించి తెలుసుకుని అప్పటినుండి ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు.

కొంతకాలం క్రిందటివరకు సంపన్న పాశ్చాత్యుల డైనింగ్ టేబుల్ సంభాషణలలో ఈ గ్రంథం గురించి చర్చించడం ఒక ఫ్యాషన్.

ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసిన తరువాతే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారతదేశం మీద కార్గిల్ యుద్ధానికి పథక రచన చేశాడు.)

ఈ గ్రంథానికి అనేక విశిష్టతలున్నాయి. ఇది ఏదో ఒక కాలానికి మాత్రమే పరిమితమైన గ్రంథం కాదు. ప్రాచీన కాలంలో రచింపబడిన ఈ గ్రంథం నేటి ఆధునిక కాలంలో కూడా అనుసరింపదగినదిగా ఉండి అంతకంతకూ తన ప్రాధాన్యతను పెంచుకుంటూనే ఉన్నది. అలాగే ఈ గ్రంథం ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇందులో వివరించిన వ్యూహాలు కేవలం సైనిక పరంగానే కాక ఇతర రంగాలకు కూడా అన్వయించుకునే విధంగా ఉంటాయి. అందుకే ఈ గ్రంథం సైనికరంగంతో పాటుగా రాజకీయ, వ్యాపార, మానేజిమెంట్ వంటి అనేక ఇతర రంగాలలో కూడా విశేషమైన వ్యాప్తిని పొందినది.

విషయాన్ని నైతిక దృక్పథంతో బోధించే గ్రంథాలు అనేకం ఉంటాయి. కానీ వాస్తవ దృక్పథంతో బోధించే గ్రంథాలు అరుదుగా ఉంటాయి. అటువంటి అరుదైన గ్రంథం ఈ The Art of War. ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. మానవ సంబంధాలలో మనకు తరచూ ఎదురయ్యే అనేక సమస్యలను ఈ గ్రంథంలో వివరించిన వ్యూహాలను అవగాహన చేసుకోవడం ద్వారా ఎదుర్కోవచ్చు. ఇది ఒక మానసిక శాస్త్ర గ్రంథం. ఎదుటిమనిషి అంతరంగాన్ని అంచనా వేయడానికి ఈ గ్రంథం ఎంతైనా ఉపకరిస్తుంది.

ఈ గ్రంథానికి ఆంగ్లభాషలో అనేక అనువాదాలున్నాయి. వాటన్నింటిలోకీ Lionel Giles యొక్క అనువాదం ప్రామాణికమైనదిగా పరిగణింపబడుతున్నది. ఇంటర్‌నెట్‌లో ఈ గ్రంథం యొక్క Giles అనువాదాన్ని వ్యాఖ్యాన సహితంగా ప్రోజెక్ట్ గుటెన్‌బర్గ్ అందిస్తున్నది. వ్యాఖ్యాన రహితంగా అనేక వెబ్‌సైట్లు అందిస్తున్నాయి. Thomos Cleary యొక్క అనువాదాన్ని www.sonshi.com అనే వెబ్‌సైట్ అందిస్తున్నది.

మాకియవెల్లి యొక్క ప్రఖ్యాత రచన ‘ద ప్రిన్స్’ (The Prince) తో సమానంగా, ప్రపంచవ్యాప్త ఆదరణ చూరగొన్న ఈ గ్రంథాన్ని మీరు కూడా చదవండి!

    





23, జనవరి 2012, సోమవారం

సన్-జు 'ద ఆర్ట్ ఆఫ్ వార్ ' తెలుగులో: హోమ్‌పేజి






యుద్ధకళ




హోమ్‌పేజి








2వ అధ్యాయం: యుద్ధ సన్నాహం

3వ అధ్యాయం: ఎత్తుగడే ఆయుధం


5వ అధ్యాయం: శక్తి

6వ అధ్యాయం: బలాలుబలహీనతలు

7వ అధ్యాయం:  సైనిక విన్యాసాలు


9వ అధ్యాయం: సైన్యం కదలిక

10వ అధ్యాయం: భూస్వరూపం


12వ అధ్యాయం: నిప్పుతో దాడి

13వ అధ్యాయం: గూఢచారులు



22, జనవరి 2012, ఆదివారం

సన్-జు 'ద ఆర్ట్ ఆఫ్ వార్ ' తెలుగులో

నేను నా 'వేణుగానం' బ్లాగులో పరిచయం చేసిన సన్-జు 'యుద్ధకళ ' (The Art of War) గ్రంథం యొక్క తెలుగు అనువాదాన్ని ఇప్పుడు ఈ బ్లాగులో ప్రచురించాలనుకుంటున్నాను. ఇది మొత్తం పదమూడు అధ్యాయాలు ఉన్న చిన్న గ్రంథం. అధ్యాయానికొక పోస్ట్ చొప్పున ప్రచురిస్తాను. అన్ని అధ్యాయాలకు హోమ్‌పేజీలో లింక్ ఉంటుంది. అలాగే ప్రతి అధ్యాయంలోనూ హోమ్‌పేజీకి లింక్ ఉంటుంది.

ఈ గ్రంథం యొక్క చైనీస్ మూలానికి Lionel Giles యొక్క ఆంగ్ల అనువాదం The Art of War. దాని నుండి ఈ ఆంధ్రానువాదం చేయబడింది. అనువాదకుడు ఈ బ్లాగు రచయిత.