29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: 22 వ అధ్యాయం







రాజు - రాజ్యం




అధ్యాయం - 22 

రాజు యొక్క సహాయకుల గురించి






(Unedited)


ఒక రాజుకు తన మంత్రులను ఎంపిక చేసుకోవడం అనేది అంత ప్రాధాన్యతలేని విషయమేమీ కాదు;. ఆ మంత్రులు మంచివారా కాదా అనేది రాజు విచక్షణను అనుసరించే ఉంటుంది. ఎవరైనా సరే రాజు చుట్టూ ఉండే వ్యక్తులను చూచి, దానినిబట్టే  రాజుగురించి గానీ, అతని తెలివితేటల గురించి గానీ ఓ ప్రాధమిక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. వారు సమర్థులు, విశ్వాసపాత్రులు ఐనప్పుడు ఆ రాజు వివేకవంతుడిగా పరిగణింపబడతాడు. ఎందుకంటే సమర్థులను ఎలా గుర్తించాలో, వారిని విశ్వాస పాత్రులుగా ఎలా ఉంచాలో ఆ రాజుకు తెలిసి ఉండటం చేత. వారు సమర్థులు, విశ్వాసపాత్రులు కానప్పుడు ఎవరికైనా ఆ రాజు గురించి సదభిప్రాయం ఏర్పడదు. ఎందుకంటే వారిని ఎంచుకోవడమనే తొలి అడుగులోనే అతడు తప్పు చేయడం చేత.           



సియేనా రాజైన పండాల్ఫో పెట్రూసి యొక్క మంత్రిగా మెస్సర్ ఆంటోనియో డ వెనాఫ్రో ను ఎరిగిన వారిలో ప్రతిఒక్కరూ వెనాఫ్రోను తన మంత్రిగా ఎంచుకున్న విషయంలో పండాల్ఫోను ఎంతో తెలివైనవాడిగా పరిగణిస్తారు. ఎందుకంటే గ్రాహక శక్తి మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి తనకు తానుగా గ్రహిస్తుంది, మరోటి ఇతరులు వ్యక్తీకరించినదానిని గ్రహిస్తుంది, మూడవది తనకు తానుగానూ గ్రహించలేదు, అలాగే ఇతరులు వ్యక్తీకరించిన దానినీ గ్రహించలేదు. మొదటిది సర్వోత్తమమైనది, రెండవది ఉత్తమమైనది, మూడవది నిరుపయోగమైనది. పండాల్ఫో మొదటి విధానికి చెందని పక్షంలో అతడు తప్పనిసరిగా రెండవ విధానికి చెందుతాడని దీనిని బట్టి అవగతమవుతున్నది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇతరులు చేసిన లేక చెప్పిన దానిలోని మంచి చెడులను తెలుసుకునే గ్రహింపు ఎప్పుడైతో ఉంటుందో —తనకు తానుగా ఏ విషయంలోనూ ముందడుగు వేయలేకపోయినప్పటికీ— అప్పుడు అతడు తన సేవకుడిలోని తప్పొప్పులను గుర్తించగలిగి ఒప్పులను ప్రసంశించి, తప్పులను సరిదిద్దుతాడు. దీనితో ఆ సేవకుడు తన యజమానిని మోసగించాలనే ఆలోచన చేయలేక నిజాయితీగా ఉండిపోతాడు.


ఒక రాజు తన మంత్రి గురించి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలగడానికీ ఎన్నడూ వైఫల్యం చెందని ఒక పరీక్ష ఉంది. మంత్రి నీ ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాల గురించే ఎక్కువగా అలోచించడం, ప్రతి విషయంలోనూ అంతరంగంలో తన స్వలాభాన్నే కోరుకోవడం నీవు చూచినట్లైతే, అటువంటి మనిషి ఎన్నడూ మంచి మంత్రి అవబోడు; అలాగే అతడిని నీవు ఎన్నటికీ నమ్మలేవు. ఎందుకంటే మరొకరి రాజ్యాన్ని తన చేతులలో కలిగి ఉన్నవాడు ఎన్నడూ తన గురించి ఆలోచించకూడదు; ఎల్లప్పుడూ తన ప్రభువు గురించే ఆలోచించాలి. అలాగే తన ప్రభువుకు సంబంధం లేని విషయాల యెడల ఎన్నడూ కూడా ఏమాత్రం శ్రద్ధ పెట్టకూడదు.



మరోపక్క ఒక రాజు తన మంత్రిని నిజాయితీపరుడిగా ఉంచడం కొరకు అతడి గురించి ఆలోచించాలి. అతడిని గౌరవించాలి, అతడిని ధనవంతుడిని చేయాలి, అతడి యెడల దయ చూపాలి, పదవులను, రాజ్యభారాన్ని అతడితో పంచుకోవాలి. అలా చేయడం వలన అతడికి ఇవ్వబడిన గొప్ప గౌరవాలు, పదవులు అతడు వాటిని వేరే విధాలుగా పొందకుండా చేస్తాయి. అలాగే అతడికి అప్పగించబడిన కార్యభారాలవలన —రాజు మద్దతులేకుండా తానొక్కడే వాటిని నెరవేర్చలేనని తెలిసి ఉండడంతో— అతడు కుట్రలకు పాల్పడడానికి భయపడతాడు. రాజు, మంత్రి ఇలాంటి సంబంధంలో ఉన్నపుడు వారు ఒకరినొకరు విశ్వసించుకోగలుగుతారు. కానీ వారి సంబంధం మరోలా ఉన్నప్పుడు ఇరువురిలో ఎవరో ఒకరు వినాశకరమైన అంతాన్ని పొందుతారు.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి